పిల్లర్ల దశలోనే నిలిచిన ఆసరా భవన నిర్మాణ పనులు
ఆదిలాబాద్: ఆసరా లేని వారికి ఆశ్రయం కల్పించేందుకు జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి ఆవరణలో నిర్మిస్తున్న ‘ఆసరా భవనం’ ఆదిలోనే ఆగిపోయింది. కాం ట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో ఆరు నెలల క్రితం ప్రారంభించిన భవన నిర్మాణ పనులు పిల్లర్ల దశలోనే నిలిచిపోయాయి. ఫలితంగా జిల్లాలో నిరాశ్రయులకు నీడ కల్పన మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం రూ.50 లక్షల నిధులతో రెండేళ్ల క్రితం రాత్రిబస కేంద్రాన్ని జిల్లా కేంద్రానికి మంజూరు చేసింది. 2017లో ఈ భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆగస్టులో పనులు ప్రారంభించగా కాంట్రాక్టర్ పునాదులు, పిల్లర్ల దశలోనే నాసిరకం పనులు చేపట్టడంతో భవనం కుంగిపోయింది. అధికారులు పర్యవేక్షించకపోవడంతో పిల్లర్ల వరకే పనులు చేసిన కాంట్రాక్టర్ మధ్యలోనే నిలిపివేశారు.
అనాథలకు ఆసరాగా..
అనాథలుగా రోడ్లపై, బస్టాండ్, రైల్వేస్టేషన్, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఆశ్రయం లేక జీవనం సాగించే వారికి ఆశ్రయం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ భవనాన్ని మంజూరు చేసింది. ఇందులో అన్ని సౌకర్యాలు కల్పించి రాత్రి భోజనంతో పాటు స్నానపు గదులు, నిద్రించేందుకు సదుపాయాలు సైతం ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. గతంలో ఓ స్వచ్ఛంద సంస్థ నిరాశ్రయుల కోసం ఓ కేంద్రాన్ని నిర్వహించింది. ప్రస్తుతం దాన్ని మూసివేయడంతో అభ్యాగులకు నిలువనీడలేకుండా పోయింది. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఆశ్రయం లేనివారిని గుర్తించి ఇందులో వారికి నీడ కల్పించాలనే ఉద్దేశంతో కేంద్రం ప్రభుత్వం భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఏటా నిర్వహణ కోసం కూడా ప్రత్యేకంగా నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో భవన నిర్మాణం ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఆదిలాబాద్ పట్టణంలోని రైల్వేస్టేషన్, ఠాకూర్‌హోటల్, బస్టాండ్, ఓల్డ్‌బస్టాండ్, తాంసి బస్టాండ్, వినాయక్‌చౌక్, అంబేద్కర్‌చౌక్, శివాజీచౌక్, తదితర ప్రాంతాల్లో ఎంతో మంది నిరాశ్రయులు నిత్యం కనిపిస్తుంటారు. చలికాలం, వర్షకాలంలో వీరి అవస్థలు వర్ణనాతీతం. భద్రత కారణాల దృష్ట్యా పోలీసులు రోడ్ల పక్కన పడుకునే వారిని అక్కడి నుంచి పంపివేస్తుంటారు. ఇలా అన్ని రకాలుగా నిరాశ్రయులకు ఆధారం లేకుండా పోతోంది.
చేతులెత్తేసిన కాంట్రాక్టర్..
కాంట్రాక్టర్‌కు అప్పగించిన ఈ భవన నిర్మాణ పనులు ఆరు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. పనులు ప్రారంభమై ఆరు నెలలు గడుస్తున్నా.. ఇంకా పిల్లర్ల దశ దాటలేదు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి పనులు నిలిపివేసి ఆరు నెలలు గడుస్తున్నా అతడిపై మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేవలం నోటీసులు అందించామని చెబుతున్న అధికారులు, సదరు కాంట్రాక్టర్ పనులు చేసేందుకు ముందుకు రావడం లేదని తెలిసినా ఇంకా అతని కోసం ఎదురుచూడడం గమనార్హం. సకాలంలో భవనం పూర్తి చేయకపోతే కాంట్రాక్టర్‌ను తొలగించి కొత్త టెండర్‌లు నిర్వహించి వేరేవారికి అప్పగించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడా అది జరగడం లేదు. ఆసరా భవనం పూర్తయితే అందులో ఉండేందుకు నిరాశ్రయుల వివరాల సేకరణ సైతం చేశారు.
నోటీసులు అందించాం..
భవన నిర్మాణాలు చేపట్టాలని ఇది వరకే కాంట్రాక్టర్‌కు నోటీసులు అందించాం. త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. ఆరు నెలల అగ్రిమెంట్‌తో పనులు అప్పగించడం జరిగింది. ఆర్థిక సమస్యలు ఉన్నాయని కాంట్రాక్టర్ చెబుతున్నాడు. నెల రోజుల్లో పూర్తి చేయకుంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
కొండల్‌రావు, మున్సిపల్ డీఈ
Comments
Please login to add a commentAdd a comment