నల్గొండ: గతకొన్నిరోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుండటంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ వర్షాలతో పలుజిల్లాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. గత నాలుగు రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమయింది. ఈశాన్య రుతుపవనాల ప్రబావంతో కోస్తా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో భారీవర్షాలు కురియడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలుచోట్ల గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
నల్లగొండ జిల్లాలోని కట్టంగూరు వద్ద వరద ఉధృతి పెరగడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహాదారి మీదుగా వెళ్లే వావాన రాకపోకలను మళ్లిస్తున్నట్టు నల్గొండ జిల్లా కలెక్టర్ చిరంజీవులు పేర్కొన్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలను నకిరెకల్ నుండి తిప్పర్తి, నల్గొండ మీదుగా హైదరాబాద్‌కు మళ్లిస్తున్నట్టు ఆయన చెప్పారు. అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను బిబినగర్, జనగాం, సూర్యాపేట మీదుగా విజయవాడ వైపు దారి మళ్లిస్తున్నట్టు తెలిపారు. కట్టంగూరు వద్ద వరద ఉధృతి తగ్గితే యదావిధిగా రాకపోకలు కొనసాగుతాయని చిరంజీవులు తెలిపారు.
కట్టంగూరు వద్ద పెరిగిన వరద ఉధృతి, వాహనాల దారి మళ్లింపు
Published Fri, Oct 25 2013 11:14 PM | Last Updated on Wed, Aug 1 2018 3:55 PM
Advertisement
Advertisement