సర్వేను సామాజిక బాధ్యతతో నిర్వహించాలి
రాంనగర్ :ప్రభుత్వం మంగళవారం చేపట్టనున్న సమగ్ర కుటుంబ సర్వేను సామాజిక బాధ్యతతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు కోరారు. ఆదివారం కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో జరిగిన ఎన్యుమరేటర్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా సర్వేలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సర్వే చేసేటప్పుడు వారు చెప్పిందే కాకుండా ఎన్యుమరేటర్లు కూడా కొంత పరిశీలించి సమాచారం సేకరించాలని సూచించారు. సమగ్ర కుటుంబ సర్వేలో ప్రజలు వాస్తవాలను తెలియజేయాలని కోరారు.
ఎవరికైనా రెండు చోట్ల ఆస్తులు ఉంటే ప్రస్తుతం ఉన్న చోట మాత్రమే తమ పేరు నమోదు చేయించుకోవాలన్నారు. సర్వే సమయంలో అందుబాటులో ఉండని విద్యార్థులు, ఆస్పత్రిలో ఉన్నవారి వివరాలను వారి కుటుంబ సభ్యులు ఆధారాలతో ఎన్యుమరేటర్లకు చూపించి పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు. కుటుంబంలోని వారి అకౌంట్ వివరాలు తెలియజేస్తేనే ఎన్యుమరేటర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఉద్యోగులందరూ సమన్వయంతో పనిచేసి కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏజేసీ వెంకట్రావ్, జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి, సీపీఓ నాగేశ్వరరావు, మోహన్‌రావు పాల్గొన్నారు.