సర్వే.. సక్సెస్ | A comprehensive family survey of the district was the success of the | Sakshi
Sakshi News home page

సర్వే.. సక్సెస్

Published Wed, Aug 20 2014 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 12:07 PM

సర్వే.. సక్సెస్

సర్వే.. సక్సెస్

సాక్షిప్రతినిధి, నల్లగొండ: కుటుంబ సమగ్ర సర్వే జిల్లాలో సక్సెస్ అయింది. ఉదయం మందకొడిగా మొదలైన సర్వే, రాత్రిదాకా కొనసాగింది. కలెక్టర్ చిరంజీవులు నల్లగొండ మున్సిపాలిటీలోని 6వ వార్డు, పద్మావతి కాలనీతోపాటు నార్కట్‌పల్లి మండలంలో పర్యటించి సర్వే తీరును పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ ప్రీతిమీనా సూర్యాపేట మున్సిపాలిటీ, కోదాడ, నడిగూడెం, మునగాల మండలాల్లో పర్యటించారు. సర్వే సందర్భంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించాయి. ఆర్టీసీ బస్సులు తిరగలేదు. పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా ఇదే పరిస్థితి కనిపించింది. సర్వే సందర్భంగా అన్ని చోట్లా దాదాపు ఒకేరకమైన సమస్యలు తలెత్తాయి.
 
ఎన్యుమరేటర్లకు సరైన శిక్షణ లేకపోవడం కొంత ప్రభావం చూపించింది. కుటుంబాల సంఖ్యకు తగిన రీతిలో ఎన్యుమరేటర్ల సంఖ్య కూడా లేదు. చాలాచోట్ల ఇళ్లకు నంబర్లు కేటాయించడంలో జరిగిన పొరపాట్లు సర్వేను ప్రభావితం చేశాయి. గ్రామాల్లో ఎన్యుమరేటర్లతో ప్రజలు వాగ్వాదానికి దిగారు. నంబర్లు కేటాయించని కారణంగా చాలా కుటుంబాలు సర్వేలో తమ వివరాలను నమోదు చేయించుకోలేకపోయారు. నల్లగొండ పట్టణంలో సాయంత్రం వరకు ఎన్యుమనేటర్ల కోసం ఎదురు చూశారు. దూర ప్రాంతాల నుంచి సొంత గ్రామాలకు వచ్చిన వారి ఇళ్లకు నంబర్లు వేయకపోవడంతో సర్వేకు వచ్చిన ఎన్యుమరేటర్లతో ఆందోళనకు దిగి నంబర్లు వేయించుకోవాల్సి వచ్చింది. దాంతో ఒక్కో ఎన్యుమనేటర్‌కు కేటాయించిన కుటుంబాల సంఖ్య పెరిగింది. నల్లగొండ పట్టణంలో ఇంటి నంబర్లు వేయలేదని గాంధీనగర్‌కు చెందిన 20 మంది మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. కాగా, కలెక్టర్ చిరంజీవులు, ఎస్పీ ప్రభాకర్‌రావు, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఎమ్మెల్సీ పూల రవీందర్ నల్లగొండ పట్టణంలోనే సర్వే ఫారాలు నింపారు.
 
నల్లగొండ మండలంలోని అన్నేపర్తి, రాములబండ, అప్పాజిపేట, నర్సింగ్‌భట్ల గ్రామాలలో హైదరాబాద్‌కు వలస వెళ్లిన వారి ఇళ్లకు నంబర్లు వేయకపోవడంతో ఎన్యుమరేటర్లతో వాగ్వాదానికి దిగారు. దాంతో బై నంబర్లు వేసి సర్వేలో నమోదు చేశారు. తిప్పర్తి మండల కేంద్రంలోని కొన్ని ఏరియాలలో ఇంటి నంబర్లు వేయకపోవడంతో ఆలస్యంగా 12 గంటలకు సర్వే ప్రారంభమైంది. పజ్జూరు, ఎర్రగడ్డలగూడెం, మాడ్గులపల్లి గ్రామాలలో 50 చొప్పున ఇళ్లకు నంబర్లు వేయకపోవడంతో స్థానికులు ఆందోళన చేశారు. నోడల్ అధికారులు అదనపు సర్వే ఫారాలను తెప్పించి సర్వే నిర్వహించారు. కనగల్ మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా ఇంటి నంబర్లు కోసం ఆందోళనలు జరిగాయి. నోడల్ అధికారలు స్పందించి బై నంబర్లు ఇవ్వడంతో సర్వే కొనసాగింది. కనగల్ మండలంలో ఎన్యుమనేటర్లు కాకుండా వారి బంధువులు సర్వే చేయడం వల్ల తప్పలు దొర్లినట్లు పలువురు పేర్కొన్నారు.
 
భువనగిరి నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు.  దూర ప్రాంతాలకు వలస వెళ్లిన ప్రజలు సర్వేకోసం గ్రామాలకు చేరుకునే సరికి వారి ఇళ్లకు నంబర్లు లేవన్న సాకుతో ఎన్యుమరేటర్లు కుటుంబాల వివరాలు సేకరించ లేదు. భువనగిరి మున్సిపాలిటీ, భువనగరి మండలం, బీబీనగర్, పోచపల్లి, వలిగొండ మండలాల్లో సర్వే సందర్భంగా పెద్ద ఎత్తున కుటుంబాల సంఖ్య పెరిగింది. ఇక ఎన్యుమరేటర్ల కోసం ప్రజలు గంటల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది.  ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇళ్లల్లోంచి బయటకు వెళ్లకుండా వేచి ఉన్నారు. వీధుల్లో జనసంచారం ఎక్కడా కనిపించలేదు.
   
దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లి, చందంపేట వంటి మండలాల్లో  సర్వే నిర్వహణకు ఎన్యుమరేటర్లకు ట్రైనింగ్ ఇచ్చినా చివరికి సిబ్బంది సరిపోక అధికారులు అప్పటికప్పుడు ఏమాత్రం శిక్షణ తీసుకోని విద్యార్థులకు, ప్రైవేట్ వ్యక్తులకు కూడా ఎన్యుమరేటర్ బాధ్యతలు అప్పగించారు. ఇంటి నంబర్లు వేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోని వైనం సర్వే సందర్భంగా బయట పడింది. చాలా కుటుంబాలకు ఇంటి నంబర్లు వేయలేదు. దీంతో ఎన్యుమరేటర్లకు పరిమితి సంఖ్యలో సర్వే ఫారాలు ఇవ్వగా అవి సరిపోక, చాలా కుటుంబాలు తమ పేర్లను నమోదు చేయించుకోలేకపోయాయి. పట్టణాలలో బతుకు దెరువుకు వెళ్లిన పలువురు సర్వే కారణంగా గ్రామాలకు, తండాలకు చేరుకునే క్రమంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రవాణా సౌకర్యాలు లేక చాలా మంది సర్వేకు అందుకోలేకపోయారు. తప్పనిసరిగా ఆధార్‌కార్డు నంబరు వేయాలని సూచించడం, చాలా మందికి ఆధార్ కార్డులు లేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎన్యుమరేటర్లు ఆధార్‌ను తప్పనిసరిగా చూపించాలనడంతో కొన్ని గ్రామాల్లో వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి.
   
హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని నాగార్జునసాగర్ ఆయకట్టులో వరినాట్లు ముమ్మరంగా జరుగుతున్నా పనులకు వెళ్లకుండా సర్వేలో పాల్గొన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనేందుకు  దూర ప్రాంతాలలో నివసిస్తున్న వారు హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని తమసొంత గ్రామాలకు చేరుకున్నారు.  అయితే సర్వే నిర్వహణకు ముందుగా ఒక్కొక్క ఇంటికి ఒక నంబర్ మాత్రమే కేటాయించారు. ఒకే ఇంటిలో రెండు, మూడు కుటుంబాలు నివసిస్తుండటంతో తమను కూడా సర్వేలో భాగస్వాములు చేయాలని మిగిలినవారు కోరారు. దీంతో ఎన్యుమరేటర్లు తమ జాబితాలో పేరు లేదని నిరాకరించడంతో దాదాపు అన్ని గ్రామాల్లో వివాదం చెలరేగింది.

ఈ విషయాన్ని తెలుసుకున్న అధికారులు ఆయా గ్రామాలకు చేరుకొని వారికి కూడా సర్వేలో భాగస్వాములు చేస్తామని హామీలు ఇచ్చారు. ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన జాబితా కుటుంబాల వారిని మాత్రమే సర్వే చేస్తామని అదనపు కుటుంబాలకు సర్వే నిర్వహించమంటూ అన్ని గ్రామాల్లో నిరాకరించారు. హుజూర్‌నగర్ పట్టణంలోని 19, 20 వార్డుల్లో ఎన్యుమరేటర్లకు కేటాయించిన ఇళ్లు ఒకేచోట లేక సర్వే నిర్వహణకు ఇబ్బందులు పడ్డారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశవర్కర్లు, విద్యార్థులను ఎన్యుమరేటర్లుగా నియమించడంతో సర్వే పత్రాలు నింపడానికి వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  
 
మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలంలో కొన్ని గ్రామాల్లో ఒకే ఇంట్లో రెండు, మూడు కుటుంబాలు ఉండగా ఒకే నంబరు వేయడంతో మిగితా కుటుంబాలను సర్వే చేయకపోవడంతో ఎన్యుమరేటర్లతో వాగ్వాదానికి  దిగారు. అధికారులు అన్ని కుటుంబాలను సర్వే చేస్తామని హామీ ఇచ్చారు. పట్టణంలోని పలు వార్డుల్లో ఎన్యుమరేటర్లకు ఉదయం టిఫిన్ , మధ్యాహ్న భోజనం సమయానికి అందించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నియోజకవర్గంలో సమగ్ర కుటుంబ సర్వే ప్రశాంతంగా ముగిసింది.
 
తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని మండలాల్లో చాలా చోట్ల కుటుంబాలు ఎక్కువగా ఉండి ఫారాలు సరిపోను అందక సర్వే ఆలస్యమైంది. శాలిగౌరారం మండలం వల్లాల, చిత్తలూరు గ్రామాల్లో ఇళ్లకు నంబర్లు కేటాయించలేదని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వచ్చి ప్రజలను సముదాయించారు. మోత్కూరు మండలంలో సర్వే ఫారాలు సరిపోక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎన్యుమరేటర్లకు సమయానికి భోజనం అందించలేక పోయారు. రాత్రి వరకు సర్వే కొనసాగింది. ప్రతి గ్రామంలో సర్వే ఫారాల కొరత ఏర్పడింది.  

సూర్యాపేట నియోజకవర్గంలో సమగ్ర సర్వే చిన్నచిన్న సమస్యల నడుమ కొనసాగింది. దూర ప్రాంతంలో ఉన్న వారు సైతం సొంతూళ్లకు రావడంతో  గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంది.
 
సూర్యాపేట, పెన్‌పహాడ్, చివ్వెంల, ఆత్మకూర్.ఎస్ మండలాల్లో సర్వే రాత్రి వరకు కొనసాగింది. సూర్యాపేట మండలం యండ్లపల్లి గ్రామంతో పాటు పలు గ్రామాలకు వచ్చిన ఎన్యుమరేటర్లకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో సర్వే కొంత ఆలస్యంగా మొదలైంది. కొన్ని గ్రామాల్లో తాళం వేసిన ఇళ్లకు డోర్ నంబర్లు వేయకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు.  పెన్‌పహాడ్ మండలం అనంతారం, గాజులమల్కాపురం గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో సర్వే ఫారాలు నింపడంలో  ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయా గ్రామాల్లో విద్యావంతులు, యువకుల సాయంతో కూడా సర్వే ఫారాలను నింపిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. చివ్వెంల మండలం గుంజలూరు గ్రామంలో సర్వేను జాయింట్ కలెక్టర్ ప్రీతిమీనా, ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి పరిశీలించారు.
 
కోదాడ నియోజకవర్గంలో సమగ్ర సర్వే ప్రశాంతంగా సాగింది. కోదాడ పట్టణంతో పాటు గ్రామాల్లో ఎన్యుమరేటర్లు ఉదయం ఏడు గంటలకే సర్వే ప్రారంభించారు. ముందుగా వేసిన ఇంటినంబర్ల ఆధారంగా సర్వే నిర్వహించారు. పట్టణంలో ప్రభుత్వ ఉపాధ్యాయులనే నియమించడంతో ప్రశాంతంగా సాగింది. సర్వే జరుగుతున్న తీరును కోదాడ మున్సిపల్ కమిషనర్ పరిశీలించారు. కోదాడ పట్టణంతో పాటు గ్రామాల్లో ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో వీధులన్ని నిర్మానుష్యంగా మారాయి. ఆర్టీసీ బస్సులు తిరగలేదు. గ్రామాల్లో సర్వే వివరాలు చెప్పడానికి పలువురు తటపటాయిస్తుండటంతో ఒక్కొక్క ఇంటివద్ద 20 నుంచి 30 నిమిషాల సమయం తీసుకున్నారు.
   
చౌటుప్పల్‌లో అద్దెకున్న వారి వివరాలను చాలా చోట్ల నమోదు చేయలేదు. ఇంటి యజమాని వివరాలను తీసుకున్న ఎన్యుమరేటర్లు, ఆ ఇంటిలో అద్దెకున్న వారికి బై నంబర్లు వేసి వివరాలు తీసుకోవాలి. కానీ, అలా తీసుకోలేదు. ఇతర ప్రాంతాల్లో నివాసముండే వారు అక్కడ వివరాలు ఇవ్వకుండా, స్వగ్రామంలోనే సర్వేలో పాల్గొంటామని వచ్చారు. అలాంటి వారి వివరాలను కూడా ఎన్యుమరేటర్లు నమోదు చేయలేదు. ఒక కుటుంబంలో తండ్రి, ఇద్దరు కొడుకులు ఉంటే, వారికి వివాహమైతే, మూడు కుటుంబాలుగా నమోదు చేయాలని ఎన్యుమరేటర్లను కోరారు. అందుకు వారు ఒకే ఇంట్లో ఉంటున్నందున ఒకే కుటుంబంగా పరిగణిస్తామని చెప్పారు. డి.నాగారం గ్రామంలో గ్రామస్తులు ఈ విధంగానే వీఆర్వోను నిలదీశారు. పోలీసులు వచ్చి గ్రామస్తులను పంపించి వేశారు. మునుగోడు, ఊకొండిలలో ఎన్యుమరేటర్లు అవగాహన లోపంతో వివరాల నమోదులో కోడ్‌లకు బదులుగా వివరాలు రాశారు. చండూరులో సర్వే ఫామ్స్ లేక గంటన్నర ఆలస్యంగా సర్వే ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి  చెందిన వారు ఉంటే వారి వివరాలను నమోదు చేయలేదు.
   
ఆలేరు నియోజకవర్గంలో సమగ్ర సర్వే సందర్భంగా పెద్దఎత్తున కుటుంబాలు అదనంగా నమోదయ్యాయి. ఆలేరు, రాజాపేట, యాదగిరిగుట్ట, గుండాల, ఆత్మకూరు (ఎం), తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లో ఇళ్లకు నంబర్లు వేయకపోవడంతో పలువురు ఆందోళన చెందారు. ఆలేరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఎన్యుమరేటర్లు అదనపు కుటుంబాల వివరాలు సేకరించకుండానే పోయారు. ఎన్యుమరేటర్లకు సరైన అవగాహన కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో సర్వే సమయంలో గంటల తరబడి ఒక్కోకుటుంబం వివరాలు సేకరించారు. ఇళ్లకు నంబర్లు వేయలేదని వాటిని వదిలిపెట్టడంతో ఆయా కుటుంబాల వారు అధికారుల చుట్టూ తిరిగారు. ఆలేరు, తుర్కపల్లి మండలాల్లో ఈ పరిస్థితి కన్పించింది. నాలుగు ఇళ్లు ఉంటే ఒక్కటే నంబరు వేశారు. దీంతో ఆయా కుటుంబాలు ఆందోళన చెందాయి. బొమ్మలరామారం మండలం మర్యాలలో సర్వే కోసం వచ్చిన ఒకరు గుండెపోటుతో మృతి చెందారు. ఎన్యుమరేటర్లకు సరైన అవగాహన లేకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. భక్తులు లేక యాదగిరికొండ వెలవెలబోయింది.
   
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో సర్వే అస్తవ్యస్తంగా జరిగింది. హాలియా, పెద్దవూర, నిడమనూరు, త్రిపురారం, గుర్రంపోడు మండలాల్లో పెద్ద ఎత్తున కొత్త కుటుంబాలు నమోదయ్యాయి. ఆయా మండలాల్లో ఒక ఇంటికి ఒకటే నంబర్ ఇవ్వడం, అందులో నివాసం ఉండే ఇతర కుటుంబాలకు బై నంబర్లు ఇవ్వకపోవడంతో పలువురు ఆందోళన చెందారు. ఎన్యుమరేటర్లు తమకు ఇచ్చిన ఇంటి నంబర్‌లను మాత్రమే సర్వే చేశారు. హాలియా మండలంలో ఎన్యుమరేటర్లు తమకు ఇచ్చిన ఇళ్లనే సర్వే చేసి అదనపు ఇళ్లను సర్వే చేయకుండానే వెళ్లిపోయారు. ఎన్యుమరేటర్లకు సరైన అవగాహన కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యార నే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇళ్లకు నంబర్లు వేయలేదని వాటిని వదిలిపెట్టడంతో ఆ కుటుంబాల వారు అధికారుల చుట్టూ తిరిగారు. హాలియా, త్రిపురారం, నిడమనూరు, నాగార్జునాగర్‌లలో  ఈ పరిస్థితి కనిపించింది.
   
నకిరేకల్ నియోజకవర్గంలో ఆయా మండలాల్లో కుటుంబాల సంఖ్య ఎక్కువగా కావడం, ఇంటినంబర్లు తక్కువ వేయడంతో సర్వే ఫారాల కొరత ఏర్పడింది. దీంతో సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. చందుపట్ల గ్రామంలో కుటుంబాలు ఎక్కువగా ఉండడం, సరిపడా పత్రాలను ఇవ్వకపోవడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కట్టంగూర్ మండలం ఈదులూరు, పరడ, కట్టంగూర్, కల్మెర గ్రామస్తుల నుంచి  నిరసన వ్యక్తమైంది. చిట్యాలలో దుకాణాల వెనుక నివాసం ఉంటున్న కుటుంబాలకు నంబర్లు కేటాయించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement