‘పది’కి కొత్త పరీక్షలు! | new exam pattern for tenth class exams | Sakshi
Sakshi News home page

‘పది’కి కొత్త పరీక్షలు!

Published Wed, Mar 18 2015 3:53 AM | Last Updated on Sat, Sep 2 2017 10:59 PM

‘పది’కి కొత్త పరీక్షలు!

‘పది’కి కొత్త పరీక్షలు!

నూతన విధానంలో టెన్త్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి  పరీక్ష సమయం అదనంగా 15 నిమిషాలు పెంపు రాష్ట్రంలో నూతన విధానంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఇన్నాళ్లుగా పాఠం చివరిలో ఇచ్చిన ప్రశ్నలకే పరీక్షల్లోనూ సమాధానాలు రాస్తున్న దానికి బదులుగా... అసలు ఎలాంటి ప్రశ్నలు వస్తాయో తెలియని విధానంలో విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అందులోనూ ఈసారి పరీక్షల్లో ఆబ్జెక్టివ్ పేపర్ విడిగా ఉండదు.


విద్యార్థులు ప్రశ్నలను బాగా చదివి అర్థం చేసుకోవడం కోసం అదనంగా 15 నిమిషాల సమయం ఇవ్వనున్నారు. మొత్తంగా ఒక్కో సబ్జెక్ట్‌లో 80 మార్కులకే (ఒక్కో పేపర్ 40 మార్కుల చొప్పున రెండు పేపర్లు) పరీక్షలు జరుగనుండగా... ఇంటర్నల్స్‌కు 20 మార్కులు వేయనున్నారు. 25న ప్రారంభమయ్యే ఈ పరీక్షలకు 5.65 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.            
- సాక్షి, హైదరాబాద్
 
ఏర్పాట్లన్నీ పూర్తి..
రాష్ట్రంలో ఈ నెల 25వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2,600 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 5,65,000 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు వెల్లడించారు. ఈసారి కొత్త విధానంలో పరీక్షలను నిర్వహిస్తున్నందున విద్యార్థులు ప్రశ్నలను బాగా చదివి అర్థం చేసుకునేందుకు అదనంగా 15 నిమిషాల సమయం ఇస్తున్నట్లు చెప్పారు. ప్రశ్నలు ఏ రూపంలో ఉంటాయో కూడా తెలియని పరిస్థితుల్లో విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని... ప్రశ్నలను అర్థం చేసుకొని జవాబులు రాయాలని చిరంజీవులు సూచించారు.

ఇక 49,410 మంది ప్రైవేటు విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని.. వీరికి ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. మరోవైపు అన్ని సబ్జెక్టులకు రెండు పేపర్ల చొప్పున ఉండగా ద్వితీయ భాషకు ఒకే పేపర్ ఉంటుందని, ఆ పరీక్ష రోజున మాత్రం విద్యార్థులకు 3:15 గంటల సమయం (ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు) ఇవ్వనున్నట్లు ప్రభుత్వం పరీక్షల విభాగం డెరైక్టర్ శేషుకుమారి తెలిపారు. పాఠం చివరన ప్రశ్నలు లేకపోవడం, విద్యార్థులే ఆలోచించి నేర్చుకునేలా అమల్లోకి తెచ్చిన ‘నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ)’ విధానంలో మొదటిసారిగా విద్యార్థులు ఈ నెల 25 నుంచి పరీక్షలు రాయనున్నారు.
 
పకడ్బందీగా పరీక్షలు: చిరంజీవులు
పదో తరగతిలో ఫలితాలు ముఖ్యం కాదని, పకడ్బందీగా పరీక్షలను నిర్వహించాలని పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు అధికారులను ఆదేశించారు. మాల్‌ప్రాక్టీస్‌కు ఏ మాత్రం అవకాశం లేకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పరీక్షల ఏర్పాట్లపై మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, విద్యాశాఖ, రెవెన్యూ, విద్యుత్, వైద్యారోగ్య శాఖల అధికారులతో చిరంజీవులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆదేశించారు. ‘‘పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌ను అమలు చేయాలి. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలి. తాగునీరు, ఫర్నీచర్, టాయిలెట్ సదుపాయం కల్పించాలి. రూమర్స్, పేపర్ లీక్ వంటి వాటిపై వెంటనే చర్యలు చేపట్టాలి. పరీక్షల సమయంలో ఆయా ప్రాంతాల్లో కరెంటు కోత విధించవద్దు. వైద్యారోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలి. రవాణా సదుపాయం కల్పించాలి. చీఫ్ సూపరింటెండెంట్ మినహా మరెవరు కూడా సెల్‌ఫోన్ తీసుకెళ్లవద్దు..’’ అని ఆయన సూచించారు.
 
పరీక్షా కాలం..

  • 10,978 ఉన్నత పాఠశాలల నుంచి విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
  • మొత్తం పరీక్షా కేంద్రాలు.. 2,600. ఇందులో రెగ్యులర్ విద్యార్థులకు 2,383 కేంద్రాలు, ప్రైవేటు విద్యార్థులకు 231 కేంద్రాలు.
  • పరీక్షలు రాసే మొత్తం విద్యార్థులు 5,65,000. ఇందులో రెగ్యులర్ 5,15,590, ప్రైవేటు విద్యార్థులు 49,410 మంది. ఇక వొకేషనల్ విద్యార్థులు 11,041 మంది.
  • పరీక్షలు రాసేవారిలో 2,92,764 మంది బాలురు, 2,72,236 మంది బాలికలు.
  • మాస్ కాపీయింగ్‌ను నిరోధించేందుకు 144 ఫ్లైయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. వీటితోపాటు సమస్యాత్మక కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్‌లు ఉంటాయి.
  • ద్వితీయ భాష మినహా ఒక్కో పేపర్‌లో 40 మార్కులకు (ఒక సబ్జెక్టులో మొత్తంగా 80 మార్కులకు) రాత పరీక్ష ఉంటుంది. ఒక్కో సబ్జెక్టులో ఇంటర్నల్స్‌కు 20 మార్కుల చొప్పున ఉంటాయి.
  • ఈ కొత్త విధానంలో ఆబ్జెక్టివ్ పేపర్ ఉండదు. ప్రైవేటు విద్యార్థులకు మాత్రం ఉంటుంది.
  • ఓఎంఆర్ జవాబు పత్రంపై హాల్‌టికెట్ నంబర్ వేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
  • గతంలో ఫెయిలై ఇప్పుడు పరీక్ష రాస్తున్న ప్రైవేటు విద్యార్థులు ఈసారితోపాటు వచ్చే జూన్/జూలైలో నిర్వహించే సప్లిమెంటరీ పరీక్షలే పాత విధానంలో చివరి అవకాశం. ఆ తర్వాత (2016 మార్చి నుంచి) కొత్త విధానంలోనే వారు పరీక్షలు రాయాల్సి ఉంటుంది.

 
పది నిమిషాలకు మించితే నో
విద్యార్థులు పరీక్ష కేంద్రానికి అరగంట ముందుగానే చేరుకోవాలి. పరీక్ష హాల్లోకి 15 నిమిషాల ముందు అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభమయ్యాక గరిష్టంగా 10 నిమిషాల వరకు మాత్రమే విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. అంతకు మించి ఆలస్యమైతే వెనక్కి వెళ్లాల్సిందే. ఇక ఎండాకాలం అయినందున విద్యార్థులు పరీక్షకు వచ్చేప్పుడు భోజనం చేసి రావడం మంచిది. వీలయితే వాటర్ బాటిల్ వెంట తెచ్చుకోవాలి. మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement