![AP Education Department Plans To Release SSC Results May First Week - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/21/10th.jpg.webp?itok=pJPQuXPu)
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను సజావుగా ముగించడంతోపాటు ఫలితాలను కూడా సాధ్యమైనంత త్వరగా విడుదల చేసేందుకు విద్యాశాఖ కార్యాచరణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 26 నాటికి మూల్యాంకనాన్ని ముగించడానికి ఏర్పాట్లు చేస్తోంది. మే మొదటి వారానికల్లా ఫలితాలను విడుదల చేయాలనే కృతనిశ్చయంతో ఉంది. పదో తరగతి తర్వాత విద్యార్థులు పై తరగతుల్లోకి వెళ్లేందుకు ఆలస్యం కాకుండా ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేపట్టింది.
ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పరీక్షలు..
పదో తరగతి పబ్లిక్ పరీక్షలను ఏప్రిల్ 3 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. గతంలో 11 పేపర్లుగా ఈ పరీక్షలను నిర్వహించేవారు. కరోనా సమయంలో వీటిని ఏడింటికి తగ్గించారు. 2021–22లో సైన్స్ సబ్జెక్టులోని భౌతిక, రసాయన శాస్త్రాలు (పీఎస్), జీవశాస్త్రం (ఎన్‌ఎస్)లకు వేర్వేరుగా కాకుండా ఒకే పేపర్, ఒకే పరీక్షగా మార్పు చేశారు. దీంతో పదో తరగతిలో పబ్లిక్ పరీక్షల పేపర్ల సంఖ్య ఆరుకు తగ్గింది. ఈ ఏడాది (2022–23) కూడా ఆరు పేపర్లలోనే పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్ సబ్జెక్టులో పీఎస్, ఎన్‌ఎస్ పేపర్‌ను రెండు భాగాలుగా విభజించి ఇస్తారు. రెండు బుక్‌లెట్లలో వీటికి సమాధానాలు రాయాలి. ముందుగా భౌతిక, రసాయన శాస్త్రాల ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అనంతరం జీవశాస్త్రం ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.
మొత్తం 6.6 లక్షల మంది విద్యార్థులు
కాగా పదో తరగతి పరీక్షలకు ఇప్పటికే 6.6 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరు రాసే సమాధానాల పత్రాలు 50 లక్షల వరకు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో ఏజెన్సీ జిల్లాలను మినహాయించి తక్కిన 23 జిల్లాల్లో మూల్యాంకన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఒక్కో కేంద్రానికి కేటాయించే పరీక్షల సమాధాన పత్రాల సంఖ్య 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు మాత్రమే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
గతంలో 13 జిల్లాల్లో మాత్రమే మూల్యాంకన కేంద్రాలు ఉండేవి. దీనివల్ల ఒక్కో జిల్లా కేంద్రంలో 4.5 లక్షల సమాధానాల పత్రాలను మూల్యాంకనం చేయాల్సి వచ్చేది. దీంతో భారీ ఎత్తున టీచర్లు అవసరమయ్యేవారు. అలాగే ఫలితాల వెల్లడిలోనూ ఆలస్యమయ్యేది. కేంద్రాల పెంపు వల్ల మూల్యాంకనాన్ని త్వరగా ముగించొచ్చని అధికారులు చెబుతున్నారు.
ఏప్రిల్ 18న పదో తరగతి పరీక్షలు ముగియగానే అదే నెల 19 నుంచి 26 వరకు ఈ మూల్యాంకనాన్ని నిర్వహించేలా ఎస్‌ఎస్‌సీ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 22న రంజాన్ ఉండటంతో ఆ రోజు మూల్యాంకనం నుంచి ముస్లిం సిబ్బందికి మినహాయింపు ఇవ్వనున్నారు. మూల్యాంకనాన్ని 26న ముగించాక రెండు వారాల్లో వాటిని కంప్యూటరీకరించి ఫలితాల విడుదలకు చర్యలు చేపట్టనున్నారు.
తత్కాల్ ఫీజుతో పరీక్ష దరఖాస్తుకు అవకాశం..
కాగా పదో తరగతి పరీక్షలకు తత్కాల్ స్కీమ్ కింద పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నామని ప్రభుత్వ పరీక్షల డైరక్టర్ డి.దేవానందరెడ్డి తెలిపారు. ఈ నెల 23 నుంచి 26 వరకు తత్కాల్ స్కీమ్ కింద రూ.500 అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అలాగే రూ.1,000 అపరాధ రుసుముతో ఈ నెల 27 నుంచి 31 వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇదే చివరి అవకాశమని మరోసారి పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. ఏప్రిల్‌లో పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే వారికి మాత్రమే ఆ తర్వాత నిర్వహించే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అవకాశం ఉంటుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment