బంజారాహిల్స్: వారంరోజుల్లో పదోతరగతి పరీక్షలు.. ఈలోగా స్నేహితులతో సరదాగా గడుపుదామనుకున్నాడు.. అంతలోనే ఓ విద్యార్థి రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బోరబండకు చెందిన ఆటోడ్రైవర్ జగదీశ్ కుమారుడు భరణిసాయి లోకేష్(15) అదే ప్రాంతంలోని ఎస్‌వీఎస్ పబ్లిక్ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు.
ఈ నెల 18వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండగా ఆదివారం ఉదయం నలుగురి స్నేహితులతో కలిసి బైక్‌లపై బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కుకు బయలుదేరారు. శ్రీనగర్‌కాలనీ టీవీ9 జంక్షన్‌లో సాయిలోకేశ్ బైక్‌ను టర్న్ చేసే క్రమంలో అదుపుతప్పింది. దీంతో రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టి ఎగిరి స్ట్రీట్‌లైట్ స్తంభానికి తగలడంతో సాయిలోకేశ్ తల పగిలి అక్కడికక్కడే చనిపోయాడు. పక్కనే బైక్‌లు నడుపుతున్న స్నేహితులు ఒక్కసారిగా వచి్చన పెద్ద శబ్దం విని షాక్‌కు గురయ్యారు. రెప్పపాటులో రక్తపుమడుగులో ఉన్న స్నేహితుడిని చూసి కన్నీరుమున్నీరయ్యారు.
ఒక్కగానొక్క కొడుకు కళ్లముందే విగతజీవిగా మారడంతో జగదీశ్‌తోపాటు కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. శనివారం రాత్రే కొడుకును తీసుకెళ్లి రహమత్‌నగర్‌లో పరీక్షాకేంద్రాన్ని చూసి వచ్చానని, ఇంతలోనే ఈ ఘటన చోటుచేసుకుందని తండ్రి బోరున విలపించాడు. బంజారాహిల్స్ పోలీసులు ఘటనాస్థలంలో సీసీ ఫుటేజీలను సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హెల్మెట్ ధరించి ఉంటే ఆ బాలుడు బతికి ఉండేవాడని పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment