నీలగిరి : జిల్లాలో ప్రజాపంపిణీ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందనే ఆరోపణలు వినవస్తున్నాయి. డీలర్లు కాకుండా రేషన్‌దుకాణాలపై బినామీలు పెత్తనం చెలాయిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించేవారు లేకపోవడంతో వారే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బినామీలుగా చెలామణి కావడమేగాక డీలర్ల సంఘానికి నాయకత్వం వహిస్తున్నా, జిల్లా పౌరసరఫరాశాఖ అధికారులు నోరు మెదపడం లేదు. దీంతో గ్రామస్థాయిలో ప్రజాపంపిణీ వ్యవస్థపై అజమాయిషీ లేకుండా పోయింది. ఏడాది కాలం తర్వాత శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ టి.చిరంజీవులు అధ్యక్షతన జరిగిన జిల్లా ఆహార సలహాసంఘం సమావేశంలో పలువురు సభ్యులు గగ్గోలు పెట్టారు. ప్రజాపంపిణీ వ్యవస్థ, రేషన్‌కార్డులు, ఆధార్ సీడింగ్, ఐకేపీ, ఆహార పదార్థాల్లో కల్తీ వ్యవహారం, గ్యాస్ ఏజెన్సీల నిర్వాహణపై చర్చించారు. ప్రధానంగా రేషన్ డీలర్ల పనితీరుపై సభ్యులు మండిపడ్డారు. దుకాణాలు తెరవడంతో డీలర్లు సమయపాలన పాటించడం లేదన్నారు. ఆలేరులో ఓ డీలరు ఒకే ఇంట్లో రెండు దుకాణాలు నడుపుతున్నాడని ఎమ్మెల్యే గొంగడి సునీత ఫిర్యాదు చేశారు. భువనగిరి డివిజన్ పరిధిలో 35 దుకాణాలు బినామీ చేతుల్లో నడుస్తున్నాయని మరో సభ్యుడు అహ్మద్ అలీ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
భార్య డీలర్‌గా ఉన్న ప్రతిచోట భర్త పెత్తనం ఎక్కువగా ఉందని, దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. భువనగిరి పట్టణంలో ఐదుగురు రేషన్‌డీలర్లు బినామీలుగా పనిచేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. యాదగిరిగుట్ట మండలం మోటకొండూరు రేషన్‌డీలర్ అయితే విదేశాల్లో ఉంటూ ఇక్కడి వ్యవహారాలు చక్కపెడుతున్నారు. ఈ విషయమై సివిల్ సప్లై అధికారులకు అనేకమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. భువనగిరి డివిజన్ ఏఎస్‌ఓ డిప్యుటేషన్ మీద హైదరాబాద్ కే పరిమితమయ్యారని...స్థానికంగా జరుగుతున్న అక్రమాల వైపు కనీసం కన్నెత్తికూడా చూడడం లేదని తెలిపారు. వీరిపై చర్య తీసుకోవాల్సిన తహసీల్దార్లు డీలర్లకు కొమ్ముకాస్తున్నారని, ఆర్డీఓకు ఏ మాత్రం సహకరించడం లేదని కలెక్టర్‌కు వివరించారు.
బియ్యం పంపిణీలో అక్రమాలు...
సంస్థాన్‌నారాయణపురం మండలంలో అంత్యోదయ కింద మృతిచెందిన కుటుంబాల పేరు మీద డీలర్లు బియ్యం పంపిణీ చేస్తున్నారని జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రసూల్ తెలిపారు. దీనిపై కొద్ది మాసాల క్రితం అధికారులు విచారణ కూడా నిర్వహించి, ఎలాంటి చర్యలు తీసుకోకుండా పక్కన పడేశారని చెప్పారు. పాలలో యూరియా, సోయాబీన్ పిండి కలిపి కల్తీ చేస్తున్నారని సభ్యులు ఆరోపించారు. అయితే దీనిపై స్పందించిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్ పాలల్లో ఎలాంటి కల్తీ జరగడం లేదని చెప్పారు.
రేషన్‌కార్డులు రద్దుకావు
ఆధార్ సీడింగ్ నమోదు చేసుకోని రేషన్‌కార్డుదారులను తొలగిస్తారని వార్తలు వస్తున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి నంద్యాల నర్సింహారెడ్డి ప్రశ్నించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ నిజమైన లబ్ధిదారులను తొలగించబోమని చెప్పారు. ఈ నెల 15వ తేదీలోగా లబ్ధిదారులు ఆధార్ సీడింగ్ నమోదు చే యించుకోవాలని తెలిపారు. లేకపోతే అలాంటి వారిపై పూర్తిస్థాయి విచారణ జరిపిన అనంతరం వాటిని తొలగిస్తామని చెప్పారు.
మండల, గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు
ప్రత్యేక అధికారుల పాలనలో సమావేశాలు నిర్వహించకుండా నిలిచిపోయిన ఆహార సలహా సంఘం కమిటీలను తిరిగి ఏర్పాటు చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. ఈ కమిటీలకు డివిజన్‌స్థాయిలో ఆర్డీఓ చైర్మన్‌గా, గ్రామ కమిటీలకు సర్పంచ్, మండల కమిటీలకు కోచైర్మన్లుగా ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు వ్యవహరిస్తారు. గ్రామ సలహాసంఘం కమిటీ సమావేశం నెలకోసారి, మండలస్థాయి కమిటీ సమావేశాలు రెండు మాసాలకోసారి నిర్వహిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలు, ఫిర్యాదులపై వచ్చే సమావేశం నాటికి చర్యలు చేపట్టాలని సివిల్ సప్లయ్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రీతిమీనా, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, సలహా సంఘం కమిటీ సభ్యులు, డీఎస్ నాగేశ్వర్‌రావు, ఏఎస్‌ఓ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
బినామీ డీలర్లు..!
Published Sun, Sep 7 2014 2:35 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 PM
Advertisement
Advertisement