స్కూళ్లను పట్టించుకోని ఎంఈఓలు!
ఉన్నతాధికారుల తనిఖీల్లో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ‘ప్రభుత్వ పాఠశాలలను మండల విద్యాధికారులు (ఎంఈఓ) పట్టించుకోవడం లేదు. స్కూళ్లకు టీచర్లు సరిగ్గా వస్తున్నారా.. లేదా? చూడటం లేదు.. పోనీ వారు స్కూళ్లలో అందుబాటులో ఉంటున్నారా? అంటే అదీ సరిగ్గా లేదు. ఏమంటే తాను ఇన్‌ఛార్జి ఎంఈఓ మాత్రమేనని, మరో స్కూల్లో హెడ్ మాస్టర్‌నని చెబుతున్నారు. మరోవైపు స్కూళ్లలో విద్యా బోధన సరిగ్గా సాగడం లేదు. ఇంగ్లిషు బోధన అయితే మరీ అధ్వానం. ఉపాధ్యాయుల బోధనపై పర్యవేక్షణ లేదు’ ఇదీ క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి. మూడు వారాలుగా పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ చిరంజీవులు సహా విద్యాశాఖ అధికారులు, అదనపు డెరైక్టర్లు ఇటీవల పాఠశాలల్లో చేసిన ఆకస్మిక తనిఖీల్లో వెల్లడైన అంశాలు. బుధవారం పాఠశాల విద్యా డెరైక్టరేట్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో దీనిపై చర్చించారు.
క్షేత్ర స్థాయిలో పాఠశాలలు, విద్యా బోధన గాడిలో పెట్టేందుకు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని విద్యాశాఖ నిర్ణయానికి వచ్చింది. ఏటా వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోతుందని, ఇలాగే కొనసాగితే ప్రభుత్వ పాఠశాలలు మరింత అధ్వానంగా తయారవుతాయని అలాంటి పరిస్థితి తలెత్తకుండా చూడాలని భావించింది. ఇందులో భాగంగా పాఠశాలల నిర్వహణ, విద్యాబోధన, పర్యవేక్షణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలపై అవసరమైతే చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. పరిస్థితి మరీ దారుణంగా ఉంటే సస్పెండ్ చేసేందుకు కూడా వెనుకాడవద్దని తనిఖీ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది. మరోవైపు బోధన పద్ధతుల విషయంలో ఉపాధ్యాయులకు ఇచ్చే శిక్షణకు సంబంధించి చర్యలు చేపట్టాలని యోచిస్తున్నారు.