సజావుగా ఎంసెట్
95 శాతం హాజరు
ముందు రోజే నగరానికి చేరుకున్న విద్యార్థులు
ఫలించిన రెవెన్యూ యంత్రాంగం ముందస్తు చర్యలు
యూనివర్సిటీ : ఎంసెట్-2015 రాత పరీక్షలు జిల్లాలో సజావుగా ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. శుక్రవారం ఉదయం జరిగిన ఇంజనీరింగ్ ప్రవేశాల రాత పరీక్ష 17 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. మెత్తం 8, 275 మంది (95.6శాతం) అభ్యర్థులు హాజరుకాగా, 385 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన మెడిసిన్ అండ్ అగ్రికల్చర్ కోర్సు ప్రవేశాల రాత పరీక్షలు 6 కేంద్రాలలో నిర్వహించారు.
మెత్తం 3058 (93.2 శాతం) మంది అభ్యర్థులు హాజరుకాగా 226 మంది గైర్హాజరయ్యారు. ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ కోర్సులకు రెండు కలిపి 95శాతం హాజరు నమోదు అయిందని రీజనల్ కో ఆర్డినేటర్ ఆచార్య బి. ప్రహ్లాదరావు వెల్లడించారు. పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు. జేఎన్‌టీయూ అనంతపురం సెంటర్‌లో జామర్లు ఏర్పాటు చేశారు.
సమ్మె నేపధ్యంలో ముందస్తు జాగ్రత్తలు:
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపధ్యంలో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో జిల్లా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎంసెట్‌కు హాజరయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో సఫలీకృతులయ్యారు. దీంతో తాజాగా ఊహాగానాల నడుమ జరిగిన ఎంసెట్ విజయవంతంగా నిర్వహించడంలో అధికారులు అంకితభావంతో విధులు నిర్వహించారు.
ఎంసెట్ పరీక్షలకు అరగంట ఆలస్యమైనా అనుమతించండని జిల్లా కలెక్టర్ కోనశశిధర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఎవరూ ఈ వెసులుబాటును ఉపయోగించుకోలేదు. సమ్మె ప్రభావం, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతిచ్చిలేదనే ముందస్తు హెచ్చరికలతో ముందు రోజే నగరానికి చేరుకున్నారు.
ప్రవేటు కళాశాలల ఉచిత తాయిలాలు:
ఎంసెట్‌కు గణనీయ స్థాయిలో అభ్యర్థులు హాజరుకావడంతో అనుబంధ కళాశాలల యాజమాన్యాల అంచనాలు రెట్టింపయ్యాయి. గత ఏడాది ఏర్పడ్డ రాజకీయ అనిశ్చితి, లోకల్ క్యాటగిరి వివాదం, సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ఆలస్యంగా ఎంసెట్ నిర్వహణ, కౌన్సెలింగ్ దృష్ట్యా పొరుగు రాష్ట్రాల వైపు విద్యార్థులు మళ్లారు. ఇందుకు భిన్నంగా తాజా ఎంసెట్ జరగడంతో ప్రవేటు కళాశాలలో గత ఏడాదితో పోలిస్తే ప్రవేశాలు ఆశాజనకంగా ఉండే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
శుక్రవారం ఉదయం ఇంజనీరింగ్ రాత పరీక్ష ముగిసిన వెంటనే అనుబంధ ఇంజనీరింగ్ కళాశాలలు తాయిలాలు మెదలెట్టాయి. కళాశాలలో అడ్మిషన్ పొందితే ఉచిత ల్యాప్‌టాప్ కంప్యూటర్‌లు, బస్ ఫీజు ప్రీ, హాస్టల్ ప్రీ అంటూ ఎన్నికల ప్రచారాన్ని తలపించే విధంగా తాయిలాలు ఇస్తుండడం విశేషం.
మెడిసిన్‌కు ఎండ దెబ్బ:
ఉదయం జరిగిన ఇంజనీరింగ్ పరీక్షల కంటే మధ్యాహ్నం జరిగిన మెడిసిన్ ఎంట్రెన్స్ టెస్ట్‌కు హాజరయ్యే వారికి అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల ఇబ్బందులకు గురయ్యారు. కొన్ని పరీక్ష కేంద్రాలలో ఇందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అవస్థలు పడ్డారు.