- టీఎస్ ఆర్‌జేసీ పరీక్ష కేంద్రానికి చేరుకోవడానికి హైరానా
- తల్లిదండ్రుల్లో ఆందోళన
- 216 మంది గైర్హాజరు
సంగారెడ్డి మున్సిపాలిటీ: ఆర్టీసీ కార్మికుల సమ్మె విద్యార్థుల పాలిట శాపంగా మారింది. వారి తల్లిదండ్రులకు ఆందోళన కలిగించింది. గురుకుల పాఠశాలల్లో, కళాశాలల్లో ప్రవేశ పరీక్షలు ఉండడం, కేంద్రాలు దూర ప్రాంతాల్లో ఉండడంతో అక్కడికి చేరుకోవడానికి విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. ఒక్కో దశలో గమ్యం చేరుకోలేమోనని భయాందోళనకు గురవుతున్నారు. పిల్లల బాధలు చూసిన తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఏంటి ఈ పరిస్థితి దేవుడా అంటూ మదన పడుతున్నారు. ఇదే అదనుగా భావించిన ప్రైవేట్ వాహన యజమానులు అడ్డగోలుగా దోచుకుంటున్నారు.
ఆదివారం సంగారెడ్డిలో గురుకుల కళాశాల ప్రవేశ పరీక్ష నిర్వహించారు. సిద్దిపేట, మెదక్, గజ్వేల్, నారాయణఖేడ్, జహీరాబాద్ వంటి దూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పరీక్ష రాసేందుకు వచ్చారు. ఆర్టీసీ సమ్మె కారణంగా బస్సులు నడవకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొందరు సొంత వాహనాల్లో సంగారెడ్డికి రాగా మరి కొందరు ప్రైవేటు వాహనాలను సమకూర్చుకొని వచ్చారు. పేద విద్యార్థులు మాత్రం పరీక్ష కేంద్రానికి చేరుకోవడానికి పడరాని పాట్లు పడ్డారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు మూడు నాలుగు రెట్లు అధికమైనా చార్జీలను భరించారు.
పరీక్ష ప్రశాంతం
తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ గురుకుల కళాశాలలో ప్రవేశం కోసం ఆదివారం నిర్వహించిన అర్హత పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్‌రావు తెలిపారు. సంగారెడ్డిలో 15 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించామని, విద్యార్థులకు ఇబ్బందులు లేకుం డా చర్యలు తీసుకున్నామన్నారు. పరీక్షలకు 3,443 మందికి హాజరుకావాల్సి ఉండగా 3,227 వచ్చినట్లు తెలిపారు.
విద్యార్థులపై ఆర్టీసీ సమ్మె ప్రభావం
Published Sun, May 10 2015 11:59 PM | Last Updated on Sun, Sep 3 2017 1:48 AM
Advertisement