చేరుకోవడమే అసలు పరీక్ష..!
రోడ్డెక్కని బస్సులు.. ఆందోళనలో విద్యార్థులు
నగరంలో నేడు ఏపీ ఎంసెట్
హాజరుకానున్న 26,948 మంది విద్యార్థులు
ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లే దిక్కు
సిటీబ్యూరో: నగరంలో ఏపీ ఎంసెట్ పరీక్ష రాసే విద్యార్థులకు తిప్పలు తప్పేలా లేవు. పరీక్ష రాయడం ఒకెత్తయితే.. పరీక్ష సెంటర్‌కు చేరుకోవడమే అసలు పరీక్షగా మారింది. శుక్రవారం నగరంలో ఏపీ ఎంసెట్ పరీక్ష జరగనుంది. దాదాపు 27 వేల మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు సన్నద్ధమయ్యారు. వీరందరికీ ఆయా ప్రాంతాల్లో కేటాయించిన కేంద్రాలకు ఎలా చేరుకోవాలని ఆందోళనలో పడ్డారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా మూడు రోజులుగా బస్సులు రోడ్లెక్కని విషయం తెలిసిందే . యథావిథిగా బస్సులు నడవడం, ప్రత్యేక బస్సులు వేస్తేనే నగరంలో పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకోవడం కష్టం. అసలు పూర్తిగా బస్సులు నడవకపోవడంతో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రైవేటు సిబ్బందిపైనే ఆర్టీసీ ఆధారపడింది. వారు ఎంత మంది విధులకు హాజరైతే.. ఆ మేరకు బస్సులు నడుపుతామని ఆర్టీసీ చెబుతోంది. ఏ రూట్లలో, ఎన్ని బస్సులు అనేది స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులపై విద్యార్థులు ఆధారపడకపోవడమే మంచిది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడమే ఉత్తమం.
ఎవరికివారు సొంత ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటే సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కావడంతో నగరంలో చదువుకున్న విద్యార్థులతో పాటు విజయవాడ, కర్నూల్ వంటి ప్రాంతాల్లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులంతా ఇక్కడే పరీక్ష రాయనున్నారు. వీరికీ కష్టాలు తప్పేలా లేవు. పరీక్ష సమయానికంటే గంట ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకోవాలని ఓ వైపు అధికారులు ఘంటాపథంగా చెబుతున్నప్పటికీ.. ఎలా వెళ్లాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అయోమయంలో పడ్డారు.
మెడికల్ విద్యార్థులే అధికం...
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నగరంలో మూడు జోన్లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ జోన్ల పరిధిలో మొత్తం 22 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇంజినీరింగ్, మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 5.30 గంటలకు మెడికల్ అండ్ అగ్రికల్చర్ పరీక్ష జరగనుంది. నగరంలో మొత్తం 26,948 మంది ఏపీ ఎంసెట్ రాస్తుండగా.. అందులో మెడికల్ విద్యార్థుల సంఖ్యే అధికం. ఇంజినీరింగ్‌కు 9,028 మంది, మెడికల్ అండ్ అగ్రికల్చర్ పరీక్షకు 17,718 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరితోపాటు మరో 101 మంది విద్యార్థులు ఇంజినీరింగ్, మెడికల్ అండ్ అగ్రికల్చర్ రెండు పరీక్షలు రాయనున్నారు.
కో ఆర్డినేటర్లు వీరే..
జోన్ 1 - రీజినల్ కో ఆర్డినేటర్:
డాక్టర్ బి. బాలు నాయక్, 9949499038
జోన్ 2 - రీజినల్ కో ఆర్డినేటర్:
డాక్టర్ పి. శ్రీనివాస రావు, 9949485554
జోన్ 3 - రీజినల్ కో ఆర్డినేటర్ :
డాక్టర్ ఏ ప్రభుకుమార్, 8008103810
పకడ్బందీగా ఏర్పాట్లు..
కేపీహెచ్‌బీకాలనీ: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏపీ ఎంసెట్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ బి.బాలు నాయక్ తెలిపారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు కనీసం అరగంట ముందే చేరుకునేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమన్నారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ముందస్తు రవాణా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఆన్‌లైన్ దరఖాస్తుల నకలు కాపీలు, ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు తమ కుల ధ్రువీకరణ పత్రాల నకలు కాపీలను తీసుకురావాలని డాక్టర్ బాలూనాయక్ తెలిపారు. పరీక్షల నిర్వహణకు పూర్తిస్థాయిలో భద్రతా చర్యలు తీసుకున్నామన్నారు. విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తమతో పాటు పరీక్షా కేంద్రాలకు తీసుకురాకూడదని చెప్పారు.
- డాక్టర్ బాలు నాయక్,
ఏపీ ఎంసెట్ రీజినల్ కో ఆర్డినేటర్
ఎంసెట్ విద్యార్థులకు విజ్ఞాన జ్యోతి కళాశాల బస్సులు
సిటీబ్యూరో: ఏపీ ఎంసెట్ పరీక్ష రాసే విద్యార్థుల పట్ల వీఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజినీరింగ్ కళాశాల ఉదారత చాటింది. ఆ కళాశాలకు చెందిన బాచుపల్లి, నిజాంపేట సెంటర్లలో ఏపీ ఎంసెట్ పరీక్ష రాసే విద్యార్థులకు బస్సు సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం ఉదయం 8.30 గంటలకు కూకట్‌పల్లి జేఎన్‌టీయూ వద్ద, మియాపూర్ జంక్షన్ వద్ద కళాశాలకు చెందిన బస్సులు సిద్ధంగా ఉంటాయి. మధ్యాహ్నం పరీక్ష రాసే మెడికల్ విద్యార్థుల కోసం ఆ ప్రాంతాల్లోనే మధ్యాహ్నం ఒంటి గంటకు బస్సులు అందుబాటులో ఉంటాయని విజ్ఞాన కళాశాల యాజమాన్యం పేర్కొంది.