పట్టాల పంపిణీ ఇప్పట్లో లేనట్టే!
కంచికి చేరని క్రమబద్ధీకరణ కథ
⇒ అభ్యంతర భూములపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం
⇒ చేతులెత్తేసిన రెవెన్యూ యంత్రాంగం
⇒ నైరాశ్యంలో లక్షలమంది దరఖాస్తుదారులు
⇒ జూన్ 2న పట్టాలు పంపిణీ చేయాలని యోచన?
సాక్షి, హైదరాబాద్: భూముల క్రమబద్ధీకరణ కథ ఇప్పట్లో కంచికి చేరేలా కనిపించడం లేదు. ప్రభుత్వానికి అందిన 3.66 లక్షల దరఖాస్తుల్లో అభ్యంతర కరమైన భూములకు చెందినవే అధికంగా ఉండడం ఈ ప్రక్రియకు ప్రధాన ఆటంకంగా మారింది.
నిరభ్యంతరకరమైన భూములనే క్రమబద్ధీకరిస్తామని ఉత్తర్వుల్లో స్పష్టం చేసిన ప్రభుత్వం.. ఇప్పటి కిప్పుడు అభ్యంతరకరమైన భూములను కూడా నిరభ్యంతరకర కేటగిరీకి మార్చాలని రెవెన్యూ అధికారులపై ఒత్తిడి పెంచినట్లు సమాచారం. అయితే.. దీనికి అనుగుణంగా ప్రభుత్వం నుం చి ఎటువంటి ఉత్తర్వులు రాకపోవడంతో.. తామేమీ చేయలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు. పాలకులు, అధికారుల మధ్య జరుగుతున్న ప్రచ్ఛ న్నపోరుతో క్రమబద్ధీకరణ ప్రక్రియ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. పోనీ.. అభ్యంతరం లేని భూములకు చెందిన పేదలకైనా పట్టాలు ఎప్పుడు పంపిణీ చేస్తారనేది ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టం చేయట్లేదు.
ముందుగా పట్టాల పంపిణీ జగ్జీవన్‌రామ్ జయంతి రోజున చేస్తారని, ఆ తర్వాత బీఆర్ అంబేద్కర్ జయంతి రోజున చేస్తారని ప్రకటనలు వెలువడినా, చివరికి అవన్నీ వట్టిదేనని తేలింది. దీంతో క్రమబద్ధీకరణ పక్రియ ద్వారా లక్షలాది మంది పేదలకు పట్టాలు పంపిణీ చేసి, ప్రజల మెప్పు పొందాలనుకున్న ప్రభుత్వ పెద్దల ఆశలకు గండిపడింది. ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రకారం ఈ నెలాఖరు కల్లా భూముల క్రమబద్ధీకరణ తంతు సంపూర్ణంగా ముగియాల్సి ఉంది. అయితే.. ఉచిత క్రమబద్ధీకరణ ఇంకా కొలిక్కి రాకపోవడం, చెల్లింపు కేటగిరీ దరఖాస్తుల పరిశీలన ఇంకా ప్రారంభం కాకపోవడం గమనార్హం.
అభ్యంతరకరమైనవే అధికం..
క్రమబద్ధీకరణ ప్రక్రియకు రాష్ట్రవ్యాప్తంగా 3,66,150 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. వీటిలో ఉచిత కేటగిరీ కింద 3,36,869 దరఖాస్తులు రాగా, చెల్లింపు కేటగిరీలో కేవలం 29,281 దరఖాస్తులే వచ్చాయి. క్రమబద్ధీకరణ ప్రక్రియలో ముందుగా ఉచిత కేటగిరీలో దరఖాస్తులను పరిశీలించి మార్చి నుంచే పట్టాలను పంపిణీ చేయాలని సర్కారు సంకల్పించింది. అయితే.. క్రమబద్దీకరణకు వచ్చిన దరఖాస్తుల్లో కనీసం 30 శాతం మందికైనా పట్టాలను ఇవ్వలేని పరిస్థితులు ఎదురు కావడం సర్కారును సైతం షాక్‌కు గురిచేసింది. మొత్తం దరఖాస్తుల్లో అభ్యంతరం లేని భూములకు చెందినవి కేవలం 95,034 మాత్రమే ఉన్నాయని అధికారులు తేల్చారు. అభ్యంతరకర భూములకు చెందిన దరఖాస్తుల్లో అధికంగా కేంద్ర ప్రభుత్వ, రైల్వే మిలటరీ.. తదితర సంస్థల భూములకు చెందినవి 93,770 దరఖాస్తులు ఉన్నట్లు నిర్ధారించారు.
అభ్యంతరాలన్నీ తొలగే వరకూ నిరీక్షణే...
అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే.. ఇప్పటికే పట్టా ఉన్నవి, మున్సిపల్ భూములు, దేవాలయ/దర్గా భూములు, మురుగు కాలువలు, రహదారుల వెంబడి, శ్మశానవాటికల, శిఖం భూములు, కోర్టు కేసుల్లో ఉన్నవి, హౌసింగ్‌బోర్డు, జీపీడబ్ల్యూడీ, నిజాం నవాబువి, నాన్ ఐఎస్‌ఎఫ్, విద్యాశాఖ, దేవాదాయశాఖ.. తదితర 21 రకాల అభ్యంతరకరమైన భూములకు చెందిన దరఖాస్తులు సుమారు లక్ష వరకు ఉన్నట్లు తెలిసింది.
రాష్ట్ర పరిధిలోని అభ్యంతరకర భూముల్లోని ఆక్రమణలను క్రమబద్ధీకరించాలన్నా.. ప్రభుత్వం వేరుగా ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. ఇప్పటికే క్రమబద్ధీకరణ అంశంపై హైకోర్టులో కేసు నడుస్తున్నందున ప్రభుత్వం మరోసారి మార్గదర్శకాలను సవరిస్తూ వేరొక ఉత్తర్వులు ఇచ్చే అవకాశం లేకపోయిందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. అభ్యంతరాలన్నీ తొలగిపోతే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న పట్టాలను పంపిణీ చేయాలని సర్కారు యోచిస్తున్నట్లు తెలిసింది. అందాక లక్షలాది మంది దరఖాస్తుదారులకు నిరీక్షణ తప్పదేమో మరి.