స్వతంత్ర నియంత్రణ వ్యవస్థ ఏర్పాటుకు యోచన
న్యూఢిల్లీ: దేశీయంగా ఆన్‌లైన్ గేమింగ్ రంగాన్ని కట్టడి చేసేందుకు స్వతంత్ర నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయడంపై కేంద్ర ఎల్రక్టానిక్స్, సమాచార మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా నేషనల్ లా యూనివర్సిటీ, ఈ–గేమింగ్ ఫెడరేషన్ కలిసి పరిశ్రమవర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వానికి నిర్దిష్ట ప్రతిపాదనలను సమర్పించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
పరిశ్రమ మెరుగైన నిర్వహణ కోసం నియంత్రణ ఉండక తప్పదని ఎన్‌ఎల్‌యూ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాఘవ్ పాండే తెలిపారు. అయితే, ఇటు పరిశ్రమ వృద్ధికి దోహదపడటం, అటు నియంత్రించడం మధ్య సమతౌల్యం కూడా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
పరిశ్రమ, ఇతర నియంత్రణ సంస్థలతో సంప్రదింపులతో పాటు నియంత్రించాల్సిన అంశాలపై సమగ్ర అధ్యయనంతోనే తగిన విధానాలను రూపొందించడానికి వీలవుతుందని చెప్పారు. ఆన్‌లైన్ గేమింగ్‌కి సంబంధించి గేమింగ్ సంస్థలే స్వీయ నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలంటూ గతంలో చేసిన ప్రతిపాదనను కేంద్రం పక్కన పెట్టిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశీయంగా డ్రీమ్11, మొబైల్ ప్రీమియర్ లీగ్, డెల్టాటెక్ గేమింగ్, నజారా, గేమ్స్24 గీ7 వంటి పలు సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి.
3 బిలియన్ డాలర్ల మార్కెట్..
ప్రస్తుతం భారత గేమింగ్ మార్కెట్ దాదాపు 3 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. ఇందులో 80 శాతం వాటా రియల్ మనీ ప్లాట్‌ఫాంలదే ఉంటోంది. అమెరికా, బ్రెజిల్‌ను కూడా దాటేసి భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద గేమింగ్ మార్కెట్‌గా మారినట్లు గేమింగ్ కంపెనీ విన్‌జో ఇటీవల ఒక నివేదికలో పేర్కొంది. భారత్‌లో 56.8 కోట్ల మంది గేమర్స్ ఉండగా, 2023లో 950 కోట్ల పైచిలుకు గేమింగ్ యాప్ డౌన్‌లోడ్స్ నమోదైనట్లు వివరించింది.
ఇంతటి భారీ స్థాయిలో విస్తరించిన ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ.. మనీలాండరింగ్ స్కాములు, భారీ పన్నుల భారం మొదలైన సమస్యలతో సతమతమవుతోంది. తమ పరిశ్రమకు నియంత్రణ సంస్థను ఏర్పాటు చేస్తే సక్రమంగా నడుస్తున్న వాటికి ఇలాంటి సమస్యలు తగ్గగలవని గేమింగ్ కంపెనీలు భావిస్తున్నాయి. దీంతో కంపెనీలు కలిసి స్వీయ నియంత్రణ సంస్థలను (ఎస్‌ఆర్‌బీలు) ఏర్పాటు చేసుకోవచ్చంటూ కేంద్రం ప్రతిపాదించింది. అయితే, బడా సంస్థలు సదరు ఎస్‌ఆర్‌బీలను ప్రభావితం చేయడానికి, అవి నిజంగానే స్వతంత్రంగా పని చేయడానికి అవకాశాలు తక్కువగా ఉండొచ్చని భావించి స్వతంత్ర నియంత్రణ సంస్థ ఏర్పాటుపై దృష్టి సారించింది.
Comments
Please login to add a commentAdd a comment