Regulatory Process
-
ఈ–గేమింగ్ కట్టడిపై కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ: దేశీయంగా ఆన్లైన్ గేమింగ్ రంగాన్ని కట్టడి చేసేందుకు స్వతంత్ర నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయడంపై కేంద్ర ఎల్రక్టానిక్స్, సమాచార మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా నేషనల్ లా యూనివర్సిటీ, ఈ–గేమింగ్ ఫెడరేషన్ కలిసి పరిశ్రమవర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వానికి నిర్దిష్ట ప్రతిపాదనలను సమర్పించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పరిశ్రమ మెరుగైన నిర్వహణ కోసం నియంత్రణ ఉండక తప్పదని ఎన్ఎల్యూ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాఘవ్ పాండే తెలిపారు. అయితే, ఇటు పరిశ్రమ వృద్ధికి దోహదపడటం, అటు నియంత్రించడం మధ్య సమతౌల్యం కూడా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమ, ఇతర నియంత్రణ సంస్థలతో సంప్రదింపులతో పాటు నియంత్రించాల్సిన అంశాలపై సమగ్ర అధ్యయనంతోనే తగిన విధానాలను రూపొందించడానికి వీలవుతుందని చెప్పారు. ఆన్లైన్ గేమింగ్‌కి సంబంధించి గేమింగ్ సంస్థలే స్వీయ నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలంటూ గతంలో చేసిన ప్రతిపాదనను కేంద్రం పక్కన పెట్టిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశీయంగా డ్రీమ్11, మొబైల్ ప్రీమియర్ లీగ్, డెల్టాటెక్ గేమింగ్, నజారా, గేమ్స్24 గీ7 వంటి పలు సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 3 బిలియన్ డాలర్ల మార్కెట్.. ప్రస్తుతం భారత గేమింగ్ మార్కెట్ దాదాపు 3 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. ఇందులో 80 శాతం వాటా రియల్ మనీ ప్లాట్‌ఫాంలదే ఉంటోంది. అమెరికా, బ్రెజిల్‌ను కూడా దాటేసి భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద గేమింగ్ మార్కెట్‌గా మారినట్లు గేమింగ్ కంపెనీ విన్జో ఇటీవల ఒక నివేదికలో పేర్కొంది. భారత్‌లో 56.8 కోట్ల మంది గేమర్స్ ఉండగా, 2023లో 950 కోట్ల పైచిలుకు గేమింగ్ యాప్ డౌన్లోడ్స్ నమోదైనట్లు వివరించింది. ఇంతటి భారీ స్థాయిలో విస్తరించిన ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ.. మనీలాండరింగ్ స్కాములు, భారీ పన్నుల భారం మొదలైన సమస్యలతో సతమతమవుతోంది. తమ పరిశ్రమకు నియంత్రణ సంస్థను ఏర్పాటు చేస్తే సక్రమంగా నడుస్తున్న వాటికి ఇలాంటి సమస్యలు తగ్గగలవని గేమింగ్ కంపెనీలు భావిస్తున్నాయి. దీంతో కంపెనీలు కలిసి స్వీయ నియంత్రణ సంస్థలను (ఎస్‌ఆర్‌బీలు) ఏర్పాటు చేసుకోవచ్చంటూ కేంద్రం ప్రతిపాదించింది. అయితే, బడా సంస్థలు సదరు ఎస్‌ఆర్‌బీలను ప్రభావితం చేయడానికి, అవి నిజంగానే స్వతంత్రంగా పని చేయడానికి అవకాశాలు తక్కువగా ఉండొచ్చని భావించి స్వతంత్ర నియంత్రణ సంస్థ ఏర్పాటుపై దృష్టి సారించింది. -
స్వీయ నియంత్రణ సంస్థ ఏర్పాటు అవశ్యం
ముంబై: ఫిన్‌టెక్ (ఫైనాన్షియల్ టెక్నాలజీ) కంపెనీలు పరిశ్రమ క్రమమైన వృద్ధి కోసం స్వీయ నియంత్రణా సంస్థ (ఎస్ఆర్ఓ– సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్)ను ఏర్పాటు చేసుకోవావాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ విజ్ఞప్తి చేశారు. ‘‘ఫిన్‌టెక్ ప్లేయర్లు దేశీయ చట్టాలకు అనుగుణంగా తమ పరిశ్రమలో చక్కటి నియమ నంబంధనావళిని ఏర్పరచుకోవాలి. గోప్యత, డేటా రక్షణ నిబంధనలను పటిష్టం చేసుకోవాలి’’ అని దాస్ పేర్కొన్నారు. దీనితోపాటు నైతిక వ్యాపార పద్ధతులను అనుసరించడం, ధరలో పారదర్శకత పాటించడం, ప్రమాణాలను పెంపొందించడం కీలకమని, దీనికి ఫిన్‌టెక్ సంస్థలు తమ వంతు కృషి చేయాలని ఇక్కడ జరుగుతున్న గ్లోబల్ ఫిన్‌టెక్ ఫీస్ట్ కార్యక్రమంలో పేర్కొన్నారు. ఏదైనా కంపెనీ ముఖ్యంగా ఫిన్‌టెక్ ప్లేయర్ల మన్నికైన, దీర్ఘకాలిక విజయానికి సుపరిపాలన నిబంధనావళి కీలకమైన అంశమని అన్నారు. ఫిన్‌టెక్ రంగ ఆదాయాలు 2030 నాటికి 200 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయన్న అంచనాలు ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. సీబీడీసీ పురోగతి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీపై (సీబీడీసీ) పురోగతి గురించి దాస్ మాట్లాడుతూ, పైలట్ ప్రాజెక్ట్ అమలు సందర్భంగా తలెత్తుతున్న సమస్యల పరిష్కారం జరుగుతోందని తెలిపారు. సీబీడీసీ రిటైల్ పైలట్ ప్రాజెక్ట్ ప్రస్తుతం 26 నగరాల్లోని 13 బ్యాంకుల ద్వారా నిర్వహించడం జరుగుతోందన్నారు. 2023 ఆగస్టు 31 నాటికి దాదాపు 1.46 మిలియన్ల వినియోగదారులు, 0.31 మిలియన్ల వ్యాపారులు ప్రస్తుతం పైలట్‌లో భాగమయ్యారని దాస్ తెలిపారు. యూపీఐ క్యూఆర్ కోడ్లతో సీబీడీసీ పూర్తి ఇంటర్–ఆపరేబిలిటీని కూడా ఆర్బీఐ ప్రారంభించినట్లు తెలిపారు. 2023 డిసెంబర్ నాటికి రోజుకు 10 లక్షల సీబీడీసీ లావాదేవీలను లక్ష్యంగా చేసుకోవడం జరిగిందని పేర్కొన్న ఆయన, కొత్త వ్యవస్థ విశ్లేషణ, అమలుకు తగిన డేటా పాయింట్లను ఈ లావాదేవీలు అందిస్తాయన్న భరోసాను ఇచ్చారు. ఇదిలావుండగా కార్యక్రమంలో ఫిన్‌టెక్ కన్వర్జెన్స్ కౌన్సిల్ కో–ఛైర్మన్ శ్రీనివాస్ జైన్ మాట్లాడుతూ, వీలైనంత త్వరగా ఒక స్వయం రెగ్యులేటరీ వ్యవస్థను రూపొందించుకోడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. -
బ్యాంకింగ్ పర్యవేక్షణ మరింత పటిష్టం: షార్ట్‌లిస్ట్‌లో 7 గ్లోబల్ కంపెనీలు
ముంబై: బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలపై (ఎన్బీఎఫ్సీ) నియంత్రణను మరింత పకడ్బందీగా అమలు చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా భారీ డేటాబేస్‌ను విశ్లేషించేందుకు, పర్యవేక్షణకు కృత్రిమ మేథ, మెషిన్ లెర్నింగ్‌ను వినియోగించుకునే క్రమంలో ఏడు అంతర్జాతీయ కన్సల్టెన్సీలను షార్ట్‌లిస్ట్ చేసింది. ప్రైస్‌వాటర్‌హౌస్ కూపర్స్, మెకిన్సే, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (ఇండియా) తదితర సంస్థలు వీటిలో ఉన్నాయి. కన్సల్టెంట్ల నియామకం కోసం ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆర్బీఐ ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను (ఈవోఐ) ఆహ్వానించింది. స్క్రూటినీ అనంతరం ప్రస్తుతం కొన్నింటిని షార్ట్‌లిస్ట్ చేసింది. బ్యాంకింగ్ రంగ పరిధిలోని సంస్థల ఆర్థిక స్థితిగతులు, అసెట్ క్వాలిటీ, లిక్విడిటీ తదితర అంశాలను ఆర్బీఐ పర్యవేక్షిస్తుంది. ఇప్పటికే కొన్ని అంశాల్లో ఏఐ, ఎంఎల్‌ను ఉపయోగిస్తోంది. వీటి వినియోగాన్ని మరింతగా విస్తరించేందుకు తాజా ప్రక్రియ చేపట్టింది. -
పట్టాల పంపిణీ ఇప్పట్లో లేనట్టే!
కంచికి చేరని క్రమబద్ధీకరణ కథ ⇒ అభ్యంతర భూములపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం ⇒ చేతులెత్తేసిన రెవెన్యూ యంత్రాంగం ⇒ నైరాశ్యంలో లక్షలమంది దరఖాస్తుదారులు ⇒ జూన్ 2న పట్టాలు పంపిణీ చేయాలని యోచన? సాక్షి, హైదరాబాద్: భూముల క్రమబద్ధీకరణ కథ ఇప్పట్లో కంచికి చేరేలా కనిపించడం లేదు. ప్రభుత్వానికి అందిన 3.66 లక్షల దరఖాస్తుల్లో అభ్యంతర కరమైన భూములకు చెందినవే అధికంగా ఉండడం ఈ ప్రక్రియకు ప్రధాన ఆటంకంగా మారింది. నిరభ్యంతరకరమైన భూములనే క్రమబద్ధీకరిస్తామని ఉత్తర్వుల్లో స్పష్టం చేసిన ప్రభుత్వం.. ఇప్పటి కిప్పుడు అభ్యంతరకరమైన భూములను కూడా నిరభ్యంతరకర కేటగిరీకి మార్చాలని రెవెన్యూ అధికారులపై ఒత్తిడి పెంచినట్లు సమాచారం. అయితే.. దీనికి అనుగుణంగా ప్రభుత్వం నుం చి ఎటువంటి ఉత్తర్వులు రాకపోవడంతో.. తామేమీ చేయలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు. పాలకులు, అధికారుల మధ్య జరుగుతున్న ప్రచ్ఛ న్నపోరుతో క్రమబద్ధీకరణ ప్రక్రియ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. పోనీ.. అభ్యంతరం లేని భూములకు చెందిన పేదలకైనా పట్టాలు ఎప్పుడు పంపిణీ చేస్తారనేది ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టం చేయట్లేదు. ముందుగా పట్టాల పంపిణీ జగ్జీవన్‌రామ్ జయంతి రోజున చేస్తారని, ఆ తర్వాత బీఆర్ అంబేద్కర్ జయంతి రోజున చేస్తారని ప్రకటనలు వెలువడినా, చివరికి అవన్నీ వట్టిదేనని తేలింది. దీంతో క్రమబద్ధీకరణ పక్రియ ద్వారా లక్షలాది మంది పేదలకు పట్టాలు పంపిణీ చేసి, ప్రజల మెప్పు పొందాలనుకున్న ప్రభుత్వ పెద్దల ఆశలకు గండిపడింది. ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రకారం ఈ నెలాఖరు కల్లా భూముల క్రమబద్ధీకరణ తంతు సంపూర్ణంగా ముగియాల్సి ఉంది. అయితే.. ఉచిత క్రమబద్ధీకరణ ఇంకా కొలిక్కి రాకపోవడం, చెల్లింపు కేటగిరీ దరఖాస్తుల పరిశీలన ఇంకా ప్రారంభం కాకపోవడం గమనార్హం. అభ్యంతరకరమైనవే అధికం.. క్రమబద్ధీకరణ ప్రక్రియకు రాష్ట్రవ్యాప్తంగా 3,66,150 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. వీటిలో ఉచిత కేటగిరీ కింద 3,36,869 దరఖాస్తులు రాగా, చెల్లింపు కేటగిరీలో కేవలం 29,281 దరఖాస్తులే వచ్చాయి. క్రమబద్ధీకరణ ప్రక్రియలో ముందుగా ఉచిత కేటగిరీలో దరఖాస్తులను పరిశీలించి మార్చి నుంచే పట్టాలను పంపిణీ చేయాలని సర్కారు సంకల్పించింది. అయితే.. క్రమబద్దీకరణకు వచ్చిన దరఖాస్తుల్లో కనీసం 30 శాతం మందికైనా పట్టాలను ఇవ్వలేని పరిస్థితులు ఎదురు కావడం సర్కారును సైతం షాక్‌కు గురిచేసింది. మొత్తం దరఖాస్తుల్లో అభ్యంతరం లేని భూములకు చెందినవి కేవలం 95,034 మాత్రమే ఉన్నాయని అధికారులు తేల్చారు. అభ్యంతరకర భూములకు చెందిన దరఖాస్తుల్లో అధికంగా కేంద్ర ప్రభుత్వ, రైల్వే మిలటరీ.. తదితర సంస్థల భూములకు చెందినవి 93,770 దరఖాస్తులు ఉన్నట్లు నిర్ధారించారు. అభ్యంతరాలన్నీ తొలగే వరకూ నిరీక్షణే... అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే.. ఇప్పటికే పట్టా ఉన్నవి, మున్సిపల్ భూములు, దేవాలయ/దర్గా భూములు, మురుగు కాలువలు, రహదారుల వెంబడి, శ్మశానవాటికల, శిఖం భూములు, కోర్టు కేసుల్లో ఉన్నవి, హౌసింగ్‌బోర్డు, జీపీడబ్ల్యూడీ, నిజాం నవాబువి, నాన్ ఐఎస్ఎఫ్, విద్యాశాఖ, దేవాదాయశాఖ.. తదితర 21 రకాల అభ్యంతరకరమైన భూములకు చెందిన దరఖాస్తులు సుమారు లక్ష వరకు ఉన్నట్లు తెలిసింది. రాష్ట్ర పరిధిలోని అభ్యంతరకర భూముల్లోని ఆక్రమణలను క్రమబద్ధీకరించాలన్నా.. ప్రభుత్వం వేరుగా ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. ఇప్పటికే క్రమబద్ధీకరణ అంశంపై హైకోర్టులో కేసు నడుస్తున్నందున ప్రభుత్వం మరోసారి మార్గదర్శకాలను సవరిస్తూ వేరొక ఉత్తర్వులు ఇచ్చే అవకాశం లేకపోయిందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. అభ్యంతరాలన్నీ తొలగిపోతే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న పట్టాలను పంపిణీ చేయాలని సర్కారు యోచిస్తున్నట్లు తెలిసింది. అందాక లక్షలాది మంది దరఖాస్తుదారులకు నిరీక్షణ తప్పదేమో మరి.