రండి బాబూ.. రండి!
- కబ్జాదారులకు బంపర్ ఆఫర్
- స్థలాల క్రమబద్ధీకరణకు అధికారుల దండోరా
- మైకులు, కరపత్రాల ద్వారా జోరుగా ప్రచారం
- విస్తృతంగా అవగాహన సదస్సులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఆక్రమణదారులకు ప్రభుత్వం రెడ్‌కార్పెట్ పరిచింది. భూముల క్రమబద్ధీకరణకు సాదరస్వాగతం పలుకుతోంది. ఆలసించిన ఆశాభంగం.. అంటూ బస్తీల్లో మైకులు, కరపత్రాలతో హోరెత్తిస్తోంది. స్థలాల క్రమబద్ధీకరణతో ఖజానా నింపుకోవాలని ఆశపడుతున్న సర్కారు.. ప్రభుత్వ స్థలాల్లోని ఇళ్లకు పట్టాలివ్వాలని భావిస్తోంది.
ఈ నేపథ్యంలో కబ్జాదారులతో కూడా సమావేశాలు నిర్వహిస్తున్న రెవెన్యూ యంత్రాంగం.. ఆక్రమణలను రెగ్యులరైజ్ చేసుకోవాలని హితబోధ చేస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగించుకుంటే సరేసరి లేకపోతే స్థలాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తోంది. జిల్లావ్యాప్తంగా 6,202 ఎకరాల్లో ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించిన యంత్రాంగం.. వీటి క్రమబద్ధీకరణ ద్వారా భారీగా నిధులు సమకూరుతాయని అంచనా వేసింది.
దీంతో క్రమబద్ధీకరణపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రభుత్వం కూడా దీనిపై గంపెడాశ పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే కబ్జాదారులకు అవగాహన కల్పించే పనిలో నిమగ్నమైంది. భవిష్యత్తులో ఆక్రమణలు తావివ్వకుండా వీలైనంతమేరకు స్థలాలను రెగ్యులరైజ్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో.. కాలనీలు, బస్తీల్లో విస్తృతంగా దండోరా వేయిస్తోంది.
ఖరారుకాని మార్గదర్శకాలు
ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడి ఐదు రోజులైనా.. ఇప్పటివరకు ప్రభుత్వం మార్గదర్శకాలు వెలువరించకపోవడంపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జీఓ విడుదల చేసిననాటి నుంచి 20 రోజుల వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రకటించిన సర్కారు.. ఇంకా గైడ్‌లైన్స్ ఖరారు, దరఖాస్తు ఫారాాలు ఇవ్వకపోవడంపై పెదవి విరుస్తున్నారు. మార్గదర్శకాల విడుదలలో జాప్యం జరిగినందున.. దరఖాస్తుల సమర్పణకు గడువును పొడగించే అవకాశముందనే ప్రచారమూ జరుగుతోంది.
వేలానికి వేళాయే..
నగర శివార్లలోని ప్రధాన ప్రాంతాల్లోని 213 స్థలాలను వేలం వేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. అత్యంత విలువైన 930 ఎకరాలు అమ్మడం ద్వారా రూ.3వేల కోట్ల ఆదాయం పొందవచ్చని అంచనా వేసింది. అయితే, తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భూముల విక్రయం మాట దేవుడెరు గు.. కనీస అవసరాలకు కూడా భూమి దొరకని పరిస్థితి తలెత్తుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజోపయోగ అవసరాలకు కేటాయించిన పిమ్మట వేలం వేసే భూముల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర సర్కారు ఆదేశించింది.
ఈ క్రమంలో కసరత్తు ప్రారంభించిన రెవెన్యూ యంత్రాంగానికి దిమ్మతిరిగింది. పలు సంస్థలు తమ కార్యాలయాల నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతూ ఇప్పటికే ప్రభుత్వం వద్ద దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడం, అంగన్‌వాడీ స్కూళ్లు, శ్మశానవాటికలు, కమ్యూనిటీ హాళ్లకు స్థలాలు నిర్దేశిస్తే వేలానికి మిగిలేది 30 నుంచి 40 శాతమేనని ప్రాథమికంగా తేలింది. కొన్ని మండలాల్లో అయితే అమ్మకానికి ప్రభుత్వ స్థలాల్లేని పరిస్థితి ఏర్పడింది. ఈ మేరకు నిర్దేశించిన ఫార్మెట్ ప్రకారం తహసీల్దార్ల నుంచి జిల్లా యంత్రాంగం వివరాలను సేకరిస్తోంది.
గచ్చిబౌలికి కలెక్టరేట్
కలెక్టరేట్‌ను గ చ్చిబౌలికి తరలించాలని ప్రభుత్వం దాదాపుగా నిర్ణయించింది. శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 25,26లోని 20ఎకరాలను కలెక్టరేట్ సముదాయ నిర్మాణానికి వినియోగించునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. భవిష్యత్తులో వికారాబాద్ ప్రత్యేక జిల్లా కానున్నందున.. ఇది అన్ని ప్రాంతాలకు అనువుగా ఉంటుందని భావిస్తోంది. సెంట్రల్ యూనివర్సిటీ పక్కనే ఉన్న ఈ స్థలంలో శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయం కూడా ఉంది.
ప్రతిపాదిత కలెక్టరేట్ స్థలాన్ని సోమవారం జాయింట్ కలెక్టర్ -1 చంపాలాల్ కూడా పరిశీలించారు. ఇదిలావుండగా, రాజేంద్రనగర్ మండలం అపార్డ్‌కు సమీపంలోని సర్వే నం 259లోని భూమిని కూడా కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అయితే, ఈ భూమిని హెచ్‌ఎండీఏకు కేటాయించినందున.. గచ్చిబౌలి వైపు మొగ్గు చూపుతున్నారు.