Government guidelines
-
అవినీతికి కాంట్రాక్టు!
* కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అవినీతి గ్రహణం * భారీగా సొమ్ము చేసుకుంటున్న ఉన్నతాధికారులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ‘అవినీతి’ గ్రహణం పట్టింది. దొరికిందే తడవంటూ అందినకాడికి దండుకోవాలని చూస్తున్న ‘అధికార భూతం’... వేలాది మంది ఆశలను పట్టి మింగేస్తోంది. క్రమబద్ధీకరణ ఫైళ్లను ఎక్కడికక్కడ తొక్కిపెట్టి కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఆందోళన నింపుతోంది. కొర్రీలు పెట్టేందుకు ప్రభుత్వ మార్గదర్శకాలకే సరికొత్త భాష్యాలు చెబుతోంది. ఎంతో కొంత ‘సమర్పించు’కుంటే పనవుతుందంటూ బేరసారాలూ మొదలుపెట్టింది. దీంతో ఎప్పుడెప్పుడు తమ ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయా.. అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పంపింది రెండు విభాగాలే రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రాథమిక గణాంకాల ప్రకారం 47 విభాగాల పరిధిలోని 13,671 మంది కాంట్రాక్టు ఉద్యోగులు క్రమబద్ధీకరణకు తగిన అర్హతలు కలిగి ఉన్నట్లు సమాచారం. ఏప్రిల్ 24వ తేదీకల్లా అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులందరి వివరాలతో ప్రతిపాదనలు పంపించాలని ప్రభుత్వం అన్ని శాఖలకు గతంలోనే లేఖలు రాసింది. స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశమై ఏప్రిల్ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించారు కూడా. కానీ ఆ గడువు దాటి రెండు వారాలు కావస్తున్నా కేవలం రెండు విభాగాల నుంచే ప్రతిపాదనలు అందాయని... అందులోనూ పది మందికి మించి అర్హులైన వారు లేరని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. మరి మిగతా విభాగాలన్నీ ఉలుకూ పలుకు లేనట్లుగా వ్యవహరించడానికి కారణం తెర వెనుక సాగుతున్న అవినీతి భాగోతమేననే ఆరోపణలు వినవస్తున్నాయి. కొన్ని విభాగాల్లో బడా అధికారులే అవినీతికి ద్వారాలు తెరిచారని, పలు చోట్ల సిబ్బంది ఏకంగా బేరసారాల కోసం కౌంటర్లు తెరిచారని చెబుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో ఎన్నో మాయలు! ఎక్కువ సంఖ్యలో కాంట్రాక్టు ఉద్యోగులున్న వైద్యారోగ్య శాఖ క్రమబద్ధీకరణ ప్రక్రియలో చిత్ర విచిత్రాలకు పాల్పడుతోంది. ప్రభుత్వం జారీ చేసిన చెక్‌లిస్టుకు భిన్నంగా... ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం ఉన్నతాధికారులు కేవలం పారా మెడికల్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు, ఎంపీహెచ్‌ఏల క్రమబద్ధీకరణకు మాత్రమే ప్రతిపాదనలు పంపాలని జిల్లాలకు లేఖలు రాశారు. దీంతో ఎన్నో ఏళ్లుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు అయోమయంలో పడ్డారు. ప్రజారోగ్య విభాగం పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 280 మంది కాంట్రాక్టు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు పనిచేస్తున్నారు. వారిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం 148 మంది అర్హులున్నట్లు సమాచారం. కానీ వారి జాబితాలను పంపకపోవడం వెనుక మతలబేమిటనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇదే శాఖ పరిధిలోని వైద్య విధాన పరిషత్ పరిధిలో పనిచేస్తున్న 147 మంది కాంట్రాక్టు సివిల్ అసిస్టెంట్ సర్జన్ల క్రమబద్ధీకరణ ప్రతిపాదనల తయారీ వేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎవరిని ప్రసన్నం చేసుకుంటే తమ ఫైలు వేగంగా కదులుతుందోనని కాంట్రాక్టు ఉద్యోగులు సెక్రటేరియట్‌లోని విభాగాల అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల ఆత్రుతను, ఆరాటాన్ని అదనుగా చేసుకొని.. కొందరు ఉద్యోగులు అందిన కాడికి వసూలు చేసుకుంటున్నారు. చేద్దాం... చూద్దాం..! కొన్ని శాఖల అధికారులు ఉద్దేశపూర్వకంగానే క్రమబద్ధీకరణ ఫైళ్లకు అవినీతి గ్రహణం పట్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ‘ఇంకా నిబంధనలు రాలేదు.. మీ విషయం ఇంకా తేలలేదు.. మీకిస్తే మిగతా వాళ్లు నష్టపోతారు కదా.. అందరినీ రెగ్యులరైజ్ చేద్దామని అనుకుంటున్నాం..’ అంటూ కొందరు ఉన్నతాధికారులు తమకు తోచిన సమాధానాలతో కాంట్రాక్టు ఉద్యోగులను వేధిస్తున్నారు. మరి కొందరు విభాగాధిపతులు ఫైలుపై ఏవో కొర్రీలు రాసి నిలిపేస్తున్నారు. ‘ఎంతో కొంత ముట్టజెపితే ఫైలు ముందుకు కదులుతుంది.. లేకుంటే చూద్దాం.. ఇంకొంత కాలం వేచి చూద్దాం..’ అంటూ అవినీతికి తలుపులు తెరుస్తున్నారు. ఇదే అదనుగా కిందిస్థాయి ఉద్యోగులు నేరుగానే బేరసారాలు మొదలుపెట్టేస్తున్నారు. నిబంధనలకు కొత్త అర్థం ఇంటర్ విద్య విభాగంలో అత్యధికంగా 5,757 మంది, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగంలో 2,473 మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో జూనియర్ లెక్చరర్లు, పీహెచ్‌సీల్లో పనిచేసే మెడికల్ ఆఫీసర్లు, పారా మెడికల్ సిబ్బంది ఉన్నారు. వీరిలో క్రమబద్ధీకరణ కోసం ఎవరి జాబితాలు పంపాలి, ఎవరివి అవసరం లేదనే షరతులేమీ ప్రభుత్వం విధించలేదు. ఆయా శాఖల పరిధిలోని అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులందరి ప్రతిపాదనలు విడివిడిగా పంపాలని మాత్రమే ఆదేశించింది. ఈ మేరకు అర్హులందరి ప్రతిపాదనలు పంపాల్సిన శాఖాధిపతులు, కార్యదర్శులు మాత్రం చెక్‌లిస్టుల తయారీలో చక్రం తిప్పుతున్నారు. అందుకే ఫైళ్లు ఆయా శాఖలు దాటి ముందుకు కదలటం లేదు. -
ముక్కు పిండుతారిక!
సాక్షి, కడప : అభివృద్ధి పేరిట గ్రామ పంచాయతీల్లో ఎడాపెడా పన్నులు బాదేందుకు రంగం సిద్ధమైంది. ఆస్తి పన్ను, నీటి పన్ను, వ్యాపార పన్నులే కాకుండా 48 రకాల పన్నులు వసూలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆదాయ వనరులను పెంచుకుని గ్రామాలను అభివ ృద్ధి చేసుకోవాలని ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. ఆయా గ్రామాలకు వచ్చే ఆదాయంతోనే పంచాయతీల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో అన్ని రకాల పన్నుల వసూలుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. జిల్లాలో 793 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు ఇళ్లు, ఆస్తి, కుళాయి పన్నులే ఆదాయ వనరులుగా ఉన్నాయి. వికేంద్రీకృత అభివృద్ధి ప్రణాళిక ద్వారా అదనపు ఆదాయ వనరులు ఏవిధంగా పొందాలనే దానిపై ఇప్పటికే ఒక నిర్దారణకు వచ్చారు. గ్రామ పంచాయతీ ఆదాయ వ్యయాలను ఆన్లైన్లో నమోదు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కొన్ని గ్రామ పంచాయతీల్లో నెట్ సమస్య వెంటాడుతోంది. 48 రకాల పన్నులు! వికేంద్రీకృత అభివృద్ధి ప్రణాళిక అమలులో భాగంగా ఇంటి పన్ను, ప్రకటనల పన్ను, వ్యవసాయ భూమి పన్ను, ఖాళీ స్థలానికి పన్ను, వాహనాలకు పన్ను, నీటి పన్ను, వీధి దీపాల పన్ను, డ్రైనేజీ నిర్వహణ పన్ను, ప్రయివేట్ కుళాయి పన్ను, షాపులు, వ్యాపారాలకు లెసైన్సు ఫీ, కాటా రుసుం, లే అవుట్ అప్రూవల్ ఫీ, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ ఫీ, సెల్ టవర్లకు పన్ను, కూరగాయల అంగళ్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, కంపోస్ట్ యార్డు, పొరంబోకు ల్యాండ్స్, స్టాంప్ డ్యూటీ సర్‌ఛార్జి, ప్రొఫెషన్ ట్యాక్స్, వినోదపు పన్ను తదితర 48రకాల పన్నులు వేసేందుకు అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే అవకాశం లేనందున ఈ నిర్ణయం తీసుకున్నారు. 13వ ఆర్థిక సంఘం ద్వారా వచ్చే నిధులను విద్యుత్ బిల్లులు చెల్లించడానికి ఉపయోగించుకుంటారు. మున్సిపాలిటీలలో సైతం ఆదాయ మార్గాలను పెంచడానికి అధికారులు అన్వేషణ ప్రారంభించారు. కనీసం 50 శాతం ఆదాయం పెంచుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. -
రండి బాబూ.. రండి!
కబ్జాదారులకు బంపర్ ఆఫర్ స్థలాల క్రమబద్ధీకరణకు అధికారుల దండోరా మైకులు, కరపత్రాల ద్వారా జోరుగా ప్రచారం విస్తృతంగా అవగాహన సదస్సులు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఆక్రమణదారులకు ప్రభుత్వం రెడ్‌కార్పెట్ పరిచింది. భూముల క్రమబద్ధీకరణకు సాదరస్వాగతం పలుకుతోంది. ఆలసించిన ఆశాభంగం.. అంటూ బస్తీల్లో మైకులు, కరపత్రాలతో హోరెత్తిస్తోంది. స్థలాల క్రమబద్ధీకరణతో ఖజానా నింపుకోవాలని ఆశపడుతున్న సర్కారు.. ప్రభుత్వ స్థలాల్లోని ఇళ్లకు పట్టాలివ్వాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో కబ్జాదారులతో కూడా సమావేశాలు నిర్వహిస్తున్న రెవెన్యూ యంత్రాంగం.. ఆక్రమణలను రెగ్యులరైజ్ చేసుకోవాలని హితబోధ చేస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగించుకుంటే సరేసరి లేకపోతే స్థలాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తోంది. జిల్లావ్యాప్తంగా 6,202 ఎకరాల్లో ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించిన యంత్రాంగం.. వీటి క్రమబద్ధీకరణ ద్వారా భారీగా నిధులు సమకూరుతాయని అంచనా వేసింది. దీంతో క్రమబద్ధీకరణపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రభుత్వం కూడా దీనిపై గంపెడాశ పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే కబ్జాదారులకు అవగాహన కల్పించే పనిలో నిమగ్నమైంది. భవిష్యత్తులో ఆక్రమణలు తావివ్వకుండా వీలైనంతమేరకు స్థలాలను రెగ్యులరైజ్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో.. కాలనీలు, బస్తీల్లో విస్తృతంగా దండోరా వేయిస్తోంది. ఖరారుకాని మార్గదర్శకాలు ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడి ఐదు రోజులైనా.. ఇప్పటివరకు ప్రభుత్వం మార్గదర్శకాలు వెలువరించకపోవడంపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జీఓ విడుదల చేసిననాటి నుంచి 20 రోజుల వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రకటించిన సర్కారు.. ఇంకా గైడ్‌లైన్స్ ఖరారు, దరఖాస్తు ఫారాాలు ఇవ్వకపోవడంపై పెదవి విరుస్తున్నారు. మార్గదర్శకాల విడుదలలో జాప్యం జరిగినందున.. దరఖాస్తుల సమర్పణకు గడువును పొడగించే అవకాశముందనే ప్రచారమూ జరుగుతోంది. వేలానికి వేళాయే.. నగర శివార్లలోని ప్రధాన ప్రాంతాల్లోని 213 స్థలాలను వేలం వేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. అత్యంత విలువైన 930 ఎకరాలు అమ్మడం ద్వారా రూ.3వేల కోట్ల ఆదాయం పొందవచ్చని అంచనా వేసింది. అయితే, తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భూముల విక్రయం మాట దేవుడెరు గు.. కనీస అవసరాలకు కూడా భూమి దొరకని పరిస్థితి తలెత్తుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజోపయోగ అవసరాలకు కేటాయించిన పిమ్మట వేలం వేసే భూముల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర సర్కారు ఆదేశించింది. ఈ క్రమంలో కసరత్తు ప్రారంభించిన రెవెన్యూ యంత్రాంగానికి దిమ్మతిరిగింది. పలు సంస్థలు తమ కార్యాలయాల నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతూ ఇప్పటికే ప్రభుత్వం వద్ద దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడం, అంగన్వాడీ స్కూళ్లు, శ్మశానవాటికలు, కమ్యూనిటీ హాళ్లకు స్థలాలు నిర్దేశిస్తే వేలానికి మిగిలేది 30 నుంచి 40 శాతమేనని ప్రాథమికంగా తేలింది. కొన్ని మండలాల్లో అయితే అమ్మకానికి ప్రభుత్వ స్థలాల్లేని పరిస్థితి ఏర్పడింది. ఈ మేరకు నిర్దేశించిన ఫార్మెట్ ప్రకారం తహసీల్దార్ల నుంచి జిల్లా యంత్రాంగం వివరాలను సేకరిస్తోంది. గచ్చిబౌలికి కలెక్టరేట్ కలెక్టరేట్‌ను గ చ్చిబౌలికి తరలించాలని ప్రభుత్వం దాదాపుగా నిర్ణయించింది. శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 25,26లోని 20ఎకరాలను కలెక్టరేట్ సముదాయ నిర్మాణానికి వినియోగించునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. భవిష్యత్తులో వికారాబాద్ ప్రత్యేక జిల్లా కానున్నందున.. ఇది అన్ని ప్రాంతాలకు అనువుగా ఉంటుందని భావిస్తోంది. సెంట్రల్ యూనివర్సిటీ పక్కనే ఉన్న ఈ స్థలంలో శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయం కూడా ఉంది. ప్రతిపాదిత కలెక్టరేట్ స్థలాన్ని సోమవారం జాయింట్ కలెక్టర్ -1 చంపాలాల్ కూడా పరిశీలించారు. ఇదిలావుండగా, రాజేంద్రనగర్ మండలం అపార్డ్‌కు సమీపంలోని సర్వే నం 259లోని భూమిని కూడా కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అయితే, ఈ భూమిని హెచ్ఎండీఏకు కేటాయించినందున.. గచ్చిబౌలి వైపు మొగ్గు చూపుతున్నారు. -
‘సంక్షేమ’ దరఖాస్తులు 14 లక్షలు
* అర్హులకే ఆహార భద్రత కార్డుల జారీ * ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల * కలెక్టర్ ఎం.కె.మీనా వెల్లడి సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లా పరిధిలో ఈ నెల 13 నుండి 20వ తేదీ వరకు నిర్వహించిన ‘సంక్షేమ’ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో మొత్తం 14 లక్షల మంది దరఖాస్తులు అందచేశారని కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియను తహసీల్దార్లకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫించన్ల కోసం దాదాపు లక్షా 35 వేల దరఖాస్తులు, ఇతరత్రా నాలుగు లక్షల 40 వేల దరఖాస్తులు అందాయన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఫ్రొఫెషనల్స్, కాంట్రాక్టర్లు, స్వయం ఉపాధి కలిగిన వారు, వ్యాపారులు, ప్రభుత్వ ఫించన్‌దారులు, స్వాతంత్య్ర సమరయోధులు, ఫోర్ వీలర్, ఏసీ కలిగిన వారు, నాలుగు లేదా అంతకన్నా ఎక్కువ గదులు కలిగిన ఇంటి యజమానులు, ఆదాయ పన్ను కట్టేవారు ఆహార భద్రతకార్డు పొందేందుకు అనర్హులని పేర్కొన్నారు. మూడు గదుల్లో నివసించే/స్వంత ఇల్లు కలిగిన వారు, రెగ్యులర్ ఆదాయం లేని వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు చెందిన వారు, ఇంట్లో మంచినీటి, మరుగుదొడ్డి సదుపాయం లేని వారు, వితంతువుల వంటి అంశాలను ఆహార భద్రత కార్డు మంజూరీకి పరిగణలోకి తీసుకోవచ్చన్నారు. ఆయా ప్రయోజనాల మంజూరీకి నిర్దేశించిన ప్రమాణాలను పరిశీలించేటప్పుడు క్షేత్రస్థాయి బృందాలు అనర్హులు లబ్ది పొందకుండా, అదే క్రమంలో అర్హులకు అన్యాయం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తహసీల్దార్లకు సూచించారు. ఈ సమావేశంలో చీఫ్ రేషనింగ్ అధికారి పద్మ, జిల్లా రెవెన్యూ అధికారి అశోక్‌కుమార్, జిల్లా ప్రణాళిక అధికారి బలరామ్, ఆర్డీవోలు నిఖిల, రఘురామ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.