సాక్షి, కడప : అభివృద్ధి పేరిట గ్రామ పంచాయతీల్లో ఎడాపెడా పన్నులు బాదేందుకు రంగం సిద్ధమైంది. ఆస్తి పన్ను, నీటి పన్ను, వ్యాపార పన్నులే కాకుండా 48 రకాల పన్నులు వసూలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆదాయ వనరులను పెంచుకుని గ్రామాలను అభివ ృద్ధి చేసుకోవాలని ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. ఆయా గ్రామాలకు వచ్చే ఆదాయంతోనే పంచాయతీల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో అన్ని రకాల పన్నుల వసూలుకు యంత్రాంగం సిద్ధమవుతోంది.
జిల్లాలో 793 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు ఇళ్లు, ఆస్తి, కుళాయి పన్నులే ఆదాయ వనరులుగా ఉన్నాయి. వికేంద్రీకృత అభివృద్ధి ప్రణాళిక ద్వారా అదనపు ఆదాయ వనరులు ఏవిధంగా పొందాలనే దానిపై ఇప్పటికే ఒక నిర్దారణకు వచ్చారు. గ్రామ పంచాయతీ ఆదాయ వ్యయాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కొన్ని గ్రామ పంచాయతీల్లో నెట్ సమస్య వెంటాడుతోంది.
48 రకాల పన్నులు!
వికేంద్రీకృత అభివృద్ధి ప్రణాళిక అమలులో భాగంగా ఇంటి పన్ను, ప్రకటనల పన్ను, వ్యవసాయ భూమి పన్ను, ఖాళీ స్థలానికి పన్ను, వాహనాలకు పన్ను, నీటి పన్ను, వీధి దీపాల పన్ను, డ్రైనేజీ నిర్వహణ పన్ను, ప్రయివేట్ కుళాయి పన్ను, షాపులు, వ్యాపారాలకు లెసైన్సు ఫీ, కాటా రుసుం, లే అవుట్ అప్రూవల్ ఫీ, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ ఫీ, సెల్ టవర్లకు పన్ను, కూరగాయల అంగళ్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, కంపోస్ట్ యార్డు, పొరంబోకు ల్యాండ్స్, స్టాంప్ డ్యూటీ సర్‌ఛార్జి, ప్రొఫెషన్ ట్యాక్స్, వినోదపు పన్ను తదితర 48రకాల పన్నులు వేసేందుకు అధికారులు ప్రణాళికలు తయారు చేశారు.
ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే అవకాశం లేనందున ఈ నిర్ణయం తీసుకున్నారు. 13వ ఆర్థిక సంఘం ద్వారా వచ్చే నిధులను విద్యుత్ బిల్లులు చెల్లించడానికి ఉపయోగించుకుంటారు. మున్సిపాలిటీలలో సైతం ఆదాయ మార్గాలను పెంచడానికి అధికారులు అన్వేషణ ప్రారంభించారు. కనీసం 50 శాతం ఆదాయం పెంచుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
ముక్కు పిండుతారిక!
Published Tue, Apr 28 2015 2:30 AM | Last Updated on Sun, Sep 3 2017 12:59 AM
Advertisement