Collecting taxes
-
ఇచ్చారు.. తీసుకున్నారు..!
సాక్షి, మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలో గురువారం స్థానిక పోస్టాఫీసు వద్ద ఆసరా పింఛన్ లబ్ధిదారులకు డబ్బులు చెల్లించారు. ఆ వెంటనే పోస్టాఫీసు పక్కనే గ్రామ పంచాయతీ ఉద్యోగి ఒకరు కూర్చొని గ్రామ పంచాయతీ పన్నులను వసూలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు ఇచ్చే సమయంలో ఎలాంటి పన్నులు వసూలు చేయొద్దని గతంలోనే స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అయినప్పటికీ గ్రామ పంచాయతీ అధికారులు అందుకు విరుద్ధంగా ఇలా పన్నులు వసూలు చేయడం గమనార్హం. -
అప్పట్లోనూ నల్లకుబేరులు..
నల్లడబ్బు బెడద ఇప్పుడే కాదు, పదిహేడో శతాబ్దం నాటికే ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా ఉండేది. రహస్యంగా డబ్బు కూడబెట్టుకుని, బయటకు సామాన్యంగా కనిపించే ‘పెద్ద’మనుషుల నుంచి పన్నులు వసూలు చేయడం మరింత గడ్డు సమస్యగా ఉండేది. ఇలాంటి వాళ్ల నుంచి ప్రభుత్వానికి ఆదాయాన్ని రాబట్టేందుకు 1696లో అప్పటి ఇంగ్లాండ్ ప్రభుత్వం ‘కిటికీ పన్ను’ను అమలులోకి తెచ్చింది. భవంతులకు ఉన్న కిటికీల సంఖ్య ఆధారంగా పన్ను వసూలు చేసేవారు. ఇంగ్లాండ్ బాటలోనే స్కాట్లాండ్, ఫ్రాన్స్ కూడా ఈ పన్నును అమలులోకి తెచ్చాయి. ఎక్కువ కిటికీలు ఉన్న ఇళ్లలో నివసించేవారు సహజంగానే ధనవంతులై ఉంటారని అప్పటి సర్కారు నమ్మకమే కాదు, అది కొంతవరకు నిజం కూడా! అయితే, శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అన్నట్లు తెలివి మీరిన నల్లకుబేరులు తమ భారీ భవంతులకు పరిమితికి మించి ఉన్న కిటికీలను పూర్తిగా మూసేయించుకునే వారు. కిటికీలపై పన్ను విధించడమంటే ప్రజలకు ఆరోగ్యంగా జీవించే హక్కును దారుణంగా కాలరాయడమేననే విమర్శలు రావడంతో చివరకు ఇంగ్లాండ్ ప్రభుత్వమే దిగివచ్చి, ఈ పన్నును 1851లో రద్దు చేసింది. -
మా ఇళ్లను కూల్చకండి
- సభా సమితి సభ్యుల ఎదుట - బాధితుల ఆక్రోశం సాక్షి, బెంగళూరు: ‘ప్రభుత్వమే మాకు హక్కు పత్రాలను ఇచ్చి ఇళ్లను నిర్మించుకునేందుకు అధికారాన్ని కల్పించింది. ఇంతకాలంగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన అన్ని రకాల పన్నులు చెల్లిస్తూనే ఉన్నాం. ఇప్పుడు చెరువులను ఆక్రమించారంటూ మా ఇళ్లను కూల్చేస్తే పిల్లలతో కలిసి ఎక్కడికి వెళ్లాలి. మా ఇళ్లను కూల్చకండి’ అంటూ వివిధ ప్రాంతాల్లోని నివాసితులు సభా సమితి సభ్యుల ఎదుట తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. నగరం చుట్టుపక్కల ప్రాం తాల్లో చెరువుల ఆక్రమణలకు సంబంధించిన అధ్యయ నం కోసం ఏర్పాటు చేసిన కె.వి.కోళివాడ నేతృత్వంలోని సభా సమితి రెండో రోజైన బుధవారం సైతం నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించింది. నగరంలోని విజినాపుర చెరువుతోపాటు కౌదేనహళ్లి, బి.నారాయణపుర, బాణసవాడి చెరువులను సమితి సభ్యులు బుధవారం పరిశీలించారు. సమితి సభ్యులు ఆయా ప్రాంతాలకు చేరుకోగానే తమ ఇళ్లను కూల్చేందుకే అధికారులు వచ్చారని భావించిన స్థానికులు సభాసమితి సభ్యులను చుట్టుముట్టారు. తమకు ఆయా స్థలాలను అమ్మిన వారిని వదిలేసి ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న డబ్బుతో స్థలాలను కొని ఇళ్లు కట్టుకుంటే ఇలా బలవంతంగా ఖాళీ చేయించాలని చూడడం ఎంత వరకు సమంజసమని ఆయా ప్రాంతాల ప్రజలు సభా సమితి సభ్యులను నిలదీశారు. ఇక కౌదేనహళ్లి చెరువుకు సంబంధించి సర్వే నెం.37లో 34.10 ఎకరాలు కబ్జాకు గురికాగా, బి.నారాయణపుర చెరువులో 7.05 ఎకరాలు, విజినాపుర చెరువులో 10.37 ఎకరాలు, బాణసవాడిలో ఒక ఎకరా ఆక్రమణకు గురయ్యాయని సభా సమితి సభ్యులకు అధికారులు వివరించారు. -
ముక్కు పిండుతారిక!
సాక్షి, కడప : అభివృద్ధి పేరిట గ్రామ పంచాయతీల్లో ఎడాపెడా పన్నులు బాదేందుకు రంగం సిద్ధమైంది. ఆస్తి పన్ను, నీటి పన్ను, వ్యాపార పన్నులే కాకుండా 48 రకాల పన్నులు వసూలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆదాయ వనరులను పెంచుకుని గ్రామాలను అభివ ృద్ధి చేసుకోవాలని ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. ఆయా గ్రామాలకు వచ్చే ఆదాయంతోనే పంచాయతీల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో అన్ని రకాల పన్నుల వసూలుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. జిల్లాలో 793 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు ఇళ్లు, ఆస్తి, కుళాయి పన్నులే ఆదాయ వనరులుగా ఉన్నాయి. వికేంద్రీకృత అభివృద్ధి ప్రణాళిక ద్వారా అదనపు ఆదాయ వనరులు ఏవిధంగా పొందాలనే దానిపై ఇప్పటికే ఒక నిర్దారణకు వచ్చారు. గ్రామ పంచాయతీ ఆదాయ వ్యయాలను ఆన్లైన్లో నమోదు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కొన్ని గ్రామ పంచాయతీల్లో నెట్ సమస్య వెంటాడుతోంది. 48 రకాల పన్నులు! వికేంద్రీకృత అభివృద్ధి ప్రణాళిక అమలులో భాగంగా ఇంటి పన్ను, ప్రకటనల పన్ను, వ్యవసాయ భూమి పన్ను, ఖాళీ స్థలానికి పన్ను, వాహనాలకు పన్ను, నీటి పన్ను, వీధి దీపాల పన్ను, డ్రైనేజీ నిర్వహణ పన్ను, ప్రయివేట్ కుళాయి పన్ను, షాపులు, వ్యాపారాలకు లెసైన్సు ఫీ, కాటా రుసుం, లే అవుట్ అప్రూవల్ ఫీ, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ ఫీ, సెల్ టవర్లకు పన్ను, కూరగాయల అంగళ్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, కంపోస్ట్ యార్డు, పొరంబోకు ల్యాండ్స్, స్టాంప్ డ్యూటీ సర్‌ఛార్జి, ప్రొఫెషన్ ట్యాక్స్, వినోదపు పన్ను తదితర 48రకాల పన్నులు వేసేందుకు అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే అవకాశం లేనందున ఈ నిర్ణయం తీసుకున్నారు. 13వ ఆర్థిక సంఘం ద్వారా వచ్చే నిధులను విద్యుత్ బిల్లులు చెల్లించడానికి ఉపయోగించుకుంటారు. మున్సిపాలిటీలలో సైతం ఆదాయ మార్గాలను పెంచడానికి అధికారులు అన్వేషణ ప్రారంభించారు. కనీసం 50 శాతం ఆదాయం పెంచుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. -
బకాయిల బండ
వాణిజ్య పన్నుల శాఖలో పన్ను బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో ఖజానాకు భారీగా గండి పడుతోంది. ఒక్క నందిగామ డివిజన్‌లోనే రూ. 50 కోట్ల పన్నులు వసూలు కావాల్సిఉంది. విజయవాడ : వాణిజ్య పన్నుల శాఖలో బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోతున్నాయి. పన్నుల వసూలులో అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది. బకాయిలతో పాటు ప్రతి నెలా జమ పడాల్సిన పన్నులను వసూలుచేసే నాథుడే కనిపించడంలేదు. నెలవారీ మామూళ్లు దండిగా వసూలు చేసుకుంటున్న అధికారులు ప్రభుత్వ ఆదాయానికి మాత్రం గండి కొడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయవాడ 1వ డివిజన్ పరిధిలో ఉన్న నందిగామ సర్కిల్లో భవానీపురం, కంచికచర్ల, జగ్గయ్యపేట యూనిట్ల వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాల నుంచి మూడేళ్లుగా దాదాపు రూ.50 కోట్ల పన్నులు ప్రభుత్వానికి జమకాలేదు. నందిగామ సర్కిల్లో మెత్తం నాలుగు వేల మంది వ్యాట్ డీలర్లు, 2,500 మంది టర్నోవర్ టాక్స్ డీలర్లు ఉన్నారు. వ్యాట్ డీలర్లు ప్రతి నెలా తమ లావాదేవీలకు సంబంధించి రిటర్న్‌లు ఫైల్ చేయాలి. టర్నోవర్ టాక్స్ డీలర్లు మూడు నెలలకోసారి ఫైల్ చేస్తారు. డీసీటీవోలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో డీలర్లు సరిగా రిటర్న్‌లు ఫైల్ చేయడం లేదని సమాచారం. నందిగామ సర్కిల్ ప్రతి నెలా రూ.12 కోట్ల పన్నులు ప్రభుత్వానికి జమ కావాలి. అయితే అధికారులు ఏ నెలకు ఆ నెల వసూలు చేయకుండా బకాయిలను మరుగున పడేయడంతో అవి పేరుకుపోతున్నాయి. ఇటీవల నందిగామ సర్కిల్ పరిధిలో వెయ్యి మంది డీలర్లు రిటర్న్‌లు ఫైలు చేయకుండా రూ.12 కోట్ల మొత్తానికి ఎగనామం పెట్టి అదృశ్యమయ్యారు. ఇదిలా ఉండగా రిటర్న్‌లు దాఖలు చేసిన డీలర్లు కూడా సక్రమంగా పన్నులు చెల్లించక పోయినా సంబంధిత యూనిట్ల అధికారులకు చీమకూడా కుట్టడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. భవానీపురం, కంచికచర్ల, జగ్గయ్యపేట యూనిట్లలో రూ.36 కోట్ల రిటర్న్‌లు ఫైల్ చేసిన డీలర్లు ప్రభుత్వానికి టాక్స్ బకాయి పడ్డారు. పాతబకాయిలు, రన్నింగ్ బకాయిలు కలిపి తడిసి మోపెడయ్యాయి. భవానీపురం యూనిట్లో ఫైళ్లు గల్లంతు భవానీపురం యూనిట్లో పాత బకాయిలకు సంబంధించి ఫైళ్లు గల్లంతయ్యాయని సమాచారం. దశాబ్దకాలంగా భవానీపురం యూనిట్లో బినామీ వ్యాపారాలు నకిలీ సంస్థలను స్థాపించి కోట్ల రూపాయల పన్నులు ఎగనామం పెట్టినట్లు తెలుస్తోంది. వారి ఆచూకీ తెలుసుకునేందుకు కనీసం ఫైళ్లు కూడా దొరకడం లేదని చెపుతున్నారు. ఇటీవల పాత ఇనుము అక్రమ రవాణా వ్యవహారానికి సంబంధించి నందిగామ సర్కిల్ పరిధిలోని అధికారుల పనితీరుపై ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. విజయవాడ భవానీపురం ఏరియాలో పాత ఇనుము వ్యాపారి గంగాధర్ ప్రభుత్వానికి రూ.25 కోట్ల పన్ను ఎగనామం పెట్టిన విషయం విదితమే. ఈ కేసులో నందిగామ సర్కిల్ పరిధిలో ముగ్గురు వాణిజ్యపన్నుల శాఖ అధికారులను ఆ శాఖ కమిషనర్ శ్యామలరావు సస్పెండ్ చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో తాజాగా నందిగామ సర్కిల్ పరిధిలో పేరుకుపోయిన బకాయిలపై ఉన్నతాధికారులు దృష్టి సారించడంతో బకాయిల వ్యవహారం బట్టబయలైంది.