వాణిజ్య పన్నుల శాఖలో పన్ను బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో ఖజానాకు భారీగా గండి పడుతోంది. ఒక్క నందిగామ డివిజన్‌లోనే రూ. 50 కోట్ల పన్నులు వసూలు కావాల్సిఉంది.
విజయవాడ : వాణిజ్య పన్నుల శాఖలో బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోతున్నాయి. పన్నుల వసూలులో అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది. బకాయిలతో పాటు ప్రతి నెలా జమ పడాల్సిన పన్నులను వసూలుచేసే నాథుడే కనిపించడంలేదు. నెలవారీ మామూళ్లు దండిగా వసూలు చేసుకుంటున్న అధికారులు ప్రభుత్వ ఆదాయానికి మాత్రం గండి కొడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విజయవాడ 1వ డివిజన్ పరిధిలో ఉన్న నందిగామ సర్కిల్‌లో భవానీపురం, కంచికచర్ల, జగ్గయ్యపేట యూనిట్ల వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాల నుంచి మూడేళ్లుగా దాదాపు రూ.50 కోట్ల పన్నులు ప్రభుత్వానికి జమకాలేదు. నందిగామ సర్కిల్‌లో మెత్తం నాలుగు వేల మంది వ్యాట్ డీలర్లు, 2,500 మంది టర్నోవర్ టాక్స్ డీలర్లు ఉన్నారు. వ్యాట్ డీలర్లు ప్రతి నెలా తమ లావాదేవీలకు సంబంధించి రిటర్న్‌లు ఫైల్ చేయాలి. టర్నోవర్ టాక్స్ డీలర్లు మూడు నెలలకోసారి ఫైల్ చేస్తారు.
డీసీటీవోలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో డీలర్లు సరిగా రిటర్న్‌లు ఫైల్ చేయడం లేదని సమాచారం. నందిగామ సర్కిల్ ప్రతి నెలా రూ.12 కోట్ల పన్నులు ప్రభుత్వానికి జమ కావాలి. అయితే అధికారులు ఏ నెలకు ఆ నెల వసూలు చేయకుండా బకాయిలను మరుగున పడేయడంతో అవి పేరుకుపోతున్నాయి. ఇటీవల నందిగామ సర్కిల్ పరిధిలో వెయ్యి మంది డీలర్లు రిటర్న్‌లు ఫైలు చేయకుండా రూ.12 కోట్ల మొత్తానికి ఎగనామం పెట్టి అదృశ్యమయ్యారు.
ఇదిలా ఉండగా రిటర్న్‌లు దాఖలు చేసిన డీలర్లు కూడా సక్రమంగా పన్నులు చెల్లించక పోయినా సంబంధిత యూనిట్ల అధికారులకు చీమకూడా కుట్టడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. భవానీపురం, కంచికచర్ల, జగ్గయ్యపేట యూనిట్లలో రూ.36 కోట్ల రిటర్న్‌లు ఫైల్ చేసిన డీలర్లు ప్రభుత్వానికి టాక్స్ బకాయి పడ్డారు. పాతబకాయిలు, రన్నింగ్ బకాయిలు కలిపి తడిసి మోపెడయ్యాయి.
భవానీపురం యూనిట్లో ఫైళ్లు గల్లంతు
భవానీపురం యూనిట్లో పాత బకాయిలకు సంబంధించి ఫైళ్లు గల్లంతయ్యాయని సమాచారం. దశాబ్దకాలంగా భవానీపురం యూనిట్‌లో బినామీ వ్యాపారాలు నకిలీ సంస్థలను స్థాపించి కోట్ల రూపాయల పన్నులు ఎగనామం పెట్టినట్లు తెలుస్తోంది. వారి ఆచూకీ తెలుసుకునేందుకు కనీసం ఫైళ్లు కూడా దొరకడం లేదని చెపుతున్నారు. ఇటీవల పాత ఇనుము అక్రమ రవాణా వ్యవహారానికి సంబంధించి నందిగామ సర్కిల్ పరిధిలోని అధికారుల పనితీరుపై ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
విజయవాడ భవానీపురం ఏరియాలో పాత ఇనుము వ్యాపారి గంగాధర్ ప్రభుత్వానికి రూ.25 కోట్ల పన్ను ఎగనామం పెట్టిన విషయం విదితమే. ఈ కేసులో నందిగామ సర్కిల్ పరిధిలో ముగ్గురు వాణిజ్యపన్నుల శాఖ అధికారులను ఆ శాఖ కమిషనర్ శ్యామలరావు సస్పెండ్ చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో తాజాగా నందిగామ సర్కిల్ పరిధిలో పేరుకుపోయిన బకాయిలపై ఉన్నతాధికారులు దృష్టి సారించడంతో బకాయిల వ్యవహారం బట్టబయలైంది.
బకాయిల బండ
Published Mon, Apr 20 2015 4:36 AM | Last Updated on Sun, Sep 3 2017 12:32 AM
Advertisement