సాక్షి, హైదరాబాద్: బోధన్ కుంభకోణంలో ఆరోపణలెదుర్కొంటున్న మొత్తం 42 మంది అధికారులు, సిబ్బందిని తాము విచారించాలని చెబుతూ సీఐడీ అధికారులు ఇటీవల వాణిజ్య పన్నుల విభాగం ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఈ లేఖకు ముందు ఆరోపణలెదుర్కొంటున్న అధికారుల పే రోల్స్‌కు సంబంధించిన వివరాలివ్వాలని సీఐడీ ఐదుసార్లు లేఖలు రాసినా పెద్దగా స్పందన రాలేదు. కాగా 2017 నుంచి పురోగతి లేని కేసు మళ్లీ తెరమీదకు రావడంతో వారంతా ప్రభుత్వంలో తమకు వత్తాసు పలుకుతున్న కీలక ఉన్నతాధికారిని ఆశ్రయించారు.
దీంతో ఆయన తాను చెప్పినా వినకుండా దర్యాప్తులో దూకుడు పెంచడం ఏంటని సీఐడీపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. ఇకపై ఈ కేసులో ఎలాంటి విచారణలు,. అరెస్టులు అవసరం లేదని, ఇప్పటివరకు అరెస్టయిన వారిపై చార్జిషీట్ దాఖలు చేసుకోవాలంటూ సలహాలు ఇచ్చినట్టుగా వాణిజ్య పన్నుల శాఖ వర్గాలే చర్చించుకుంటున్నాయి. ఈ అధికారి మొదట్లో దర్యాప్తుకు బాగా సహకరించారని, ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నారో అర్ధం కావడం లేదని సీఐడీ అంటోంది. నిందితులు ఎంతటివారైనా అరెస్టు చేయాల్సిందేనని ప్రభుత్వం పదే పదే చెప్తుంటే.. సంబంధిత అధికారి దర్యాప్తును అడ్డుకోవడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సర్వర్లు అప్పగించని అధికారులు
ప్రతి మూడు నెలలకోసారి, ఆరునెలలకోసారి బోధన్ సర్కిల్ కార్యాలయంలో వ్యాపారులు, వాణిజ్య సంస్థలు చెల్లించినట్టు సృష్టించిన నకిలీ చలాన్ల విషయమై సీఐడీ నివేదిక అందినట్టు తెలిసింది. మొత్తంగా 70 శాతం మేర నకిలీ చలాన్లు సృష్టించినట్టు రిపోర్ట్ రావడంతో, వాణిజ్య పన్నుల శాఖ అధికారుల లాగిన్ వివరాలు, పన్ను చెల్లింపు వివరాలు, వ్యాపారుల పేర్లతో అప్‌లోడ్ చేసిన వారిని విచారించేందుకు వీలుగా సర్వర్లను తమకు అప్పగించాలని సీఐడీ కోరినా వాణిజ్య పన్నుల శాఖ స్పందించడం లేదని దర్యాప్తు వర్గాల ద్వారా తెలిసింది.
ఒకవేళ ఇస్తే తాము కూడా దొరికిపోతామని సంబంధిత అధికారులు ఇవ్వకుండా ఒత్తిడి చేస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో కీలక సూత్రధారులుగా ఉన్న వారి డేటా డిలిట్ చేసే అవకాశం ఉందని, అదే జరిగితే కుంభకోణాన్ని బయటపెట్టేందుకు కీలకంగా ఉన్న సాంకేతిక ఆధారాలు సేకరించడం కష్టసాధ్యమవుతుందని దర్యాప్తు విభాగం కలవరపడుతోంది.
ఇదీ కుంభకోణం..
నిందితులు రెండురకాల పద్ధతుల్లో కుంభకోణానికి పాల్పడినట్లు గుర్తించారు. బోధన్ సర్కిల్‌లోని వ్యాపారుల నుంచి పన్ను సంబంధిత సొమ్ము వసూలు చేసిన కన్సల్టెంట్ శివరాజు పన్ను చెల్లించిన వ్యాపారుల పేరిట సగం పన్నే జమ చేశాడు. మిగతా సొమ్ము నొక్కేశాడు. అయితే వ్యాపారులు మొత్తం పన్ను చెల్లించినట్టుగా నకిలీ చలాన్లు సృష్టించి ఇచ్చాడు. అంతే మొత్తానికి అధికారులతో కుమ్మక్కై వ్యాట్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసినట్టుగా సీఐడీ గుర్తించింది.
మరోవైపు వ్యాపారులు చెల్లించాల్సిన పన్నులో సగం మాత్రమే వసూలు చేసి మొత్తం సొమ్ము చెల్లించినట్టుగా నకిలీ చలాన్లతో పోర్టల్‌లో అప్‌లోడ్ చేశాడు. వ్యాపారులు చెల్లించాల్సిన మిగతా పన్నులో ఎంతో కొంత వసూలు చేసుకుని తన జేబులతో పాటు అధికారుల జేబులు నింపాడు. ఇలా మొత్తంగా రూ.275 కోట్లకు పైగా కుంభకోణం జరిగినట్టు సీఐడీ అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment