నిందితులు శిల్పా చౌదరి, కృష్ణ శ్రీనివాస్ ప్రసాద్
సాక్షి, హైదరాబాద్: కిట్టీ పార్టీల పేరుతో సంపన్నులతో పరిచయాలు పెంచుకుంది. సినీ నిర్మాతగా పరిశ్రమలోని పెద్దలను ప్రసన్నం చేసుకుంది. అందమైన ఆహార్యంతో ఆకర్షించింది.. సంపన్న వర్గాల మహిళలు ఒక్క దగ్గర చేరడంతో తన ప్లాన్‌ను అమలుపర్చింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించింది. నిజమేనని నమ్మిన మహిళలు రూ.100 కోట్లకు పైగానే సమర్పించుకున్నారు. ఆఖరికి మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీస్ స్టేషన్ల మెట్లెక్కుతున్నారు. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తన కార్యాలయంలో ఏసీపీ రఘునందన్‌తో కలిసి వివరాలు వెల్లడించారు.
వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ వెంకటేశ్వర్లు
వడ్డీతో సహా ఇచ్చేస్తానంటూ..: తెల్ల శిల్ప అలియాస్ శిల్పా చౌదరి. ఆమె భర్త తెల్లా కృష్ణ శ్రీనివాస్ ప్రసాద్. గండిపేటలోని సిగ్నేచర్ విల్లాస్‌లో వీరి నివాసం. ఉన్నత కుటుంబాల మహిళలతో తరచూ కిట్టీ పార్టీలు చేస్తుండేది. తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని నమ్మబలికేది. తన వద్ద పెట్టుబడులు పెడితే లాభాలు వచ్చాక వాటాలు ఇస్తానని, ఒకవేళ రాకపోతే పెట్టిన పెట్టుబడులకు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానని చెబుతుండేది. తనకి సినిమా పరిశ్రమలో పెద్ద వాళ్లతో పరిచయాలు ఉన్నాయనేది. ఈ క్రమంలో మహిళల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసింది.
ఇద్దరు నిందితులు కస్టడీకి..
♦బాధితురాలు దివ్య, భర్త ప్రదీప్‌రెడ్డితో కలిసి గత నెల 13న నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాన నిందితులు శిల్పా చౌదరి, ఆమె భర్త కృష్ణ శ్రీనివాస్ ప్రసాద్‌పై 406, 420, 341, 506 కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఏ–3 సందీప్, ఏ–4 రానా ఇద్దరు పరారీలో ఉన్నారు. ఇద్దరు ప్రధాన నిందితులను 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలిస్తూ రాజేంద్రనగర్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిందితులను జైలుకు తరలించారు. బెయిల్ పిటిషన్‌ను కోర్టు రద్దు చేసింది. తదుపరి విచారణ నిమిత్తం ఇద్దరు నిందితులను పోలీసులు కస్టడీలోకి కోరుతూ పోలీసులు కోర్టుకు పిటిషన్ దాఖలు చేశారు. సోమవారానికి కేసు వాయిదా పడింది.
♦ఓ ప్రముఖ సినీ నటుడి సమీప బంధువు కూడా శిల్పా చౌదరి బాధితుల జాబితాలో ఉన్నట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. సినీ పరిశ్రమ లో పెద్దవాళ్లతో తనకి పరిచయాలు ఉన్నాయని నమ్మించి ఒక్కొక్కరి నుంచి రూ.కోటి నుంచి రూ.5 కోట్ల వరకూ వసూలు చేసినట్లు సమాచారం. బాధితుల సంఖ్య చూస్తుంటే సుమారు రూ. 100 కోట్ల వరకు వసూలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
♦శిల్ప మోసాలు వెలుగులోకి రావటంతో బాధితులు నార్సింగి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటివరకు ఆరుగురు బాధితులు ఫిర్యాదులు చేశారు. మరో నలుగురైదుగురు బాధితులు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లలోనూ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
మోసాలిలా బయటికి..
♦పుప్పాలగూడలోని క్రిన్స్ విల్లాస్‌లో నివా సం ఉండే దివ్యారెడ్డికి శిల్పతో పదేళ్ల స్నే హం. కిట్టీ పార్టీలో వీరు తరచూ కలుసు కునేవారు. ఈ క్రమంలో కొత్తగా తాను రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభిం చనున్నట్లు, పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని దివ్యకు ఆశ చూపిం చింది. నిజమేనని నమ్మిన దివ్య తన భర్త ప్రదీప్ రెడ్డి, ఇతర మిత్రుల దగ్గర అప్పు చే సి రూ.1.5 కోట్లను శిల్పా చౌదరికి ఇచ్చింది.
♦ఏడాది గడచినా వ్యాపారం మొదలు పెట్టకపోవటంతో.. నిరాశ చెందిన దివ్య తన డబ్బు తిరిగి ఇచ్చేయాలని శిల్పను కోరింది. కానీ ఆమె నుంచి నిరాశే ఎదురైంది. కనీసం ఫోన్ కాల్స్, మెసేజ్‌లకు స్పందించడం మానేసింది. దీంతో గత నెల 8న దివ్యారెడ్డి, తన భర్తతో కలిసి సిగ్నేచర్ విల్లాస్‌లోని శిల్ప ఇంటికి వెళ్లింది. వీరిని విల్లాలోకి రాకుండా బౌన్సర్లతో అడ్డుకుంది. డబ్బుల కోసం ఇంటికి వచ్చినా, అడిగినా చంపేస్తానని బెదిరింపులకు పాల్పడింది.
Comments
Please login to add a commentAdd a comment