సాక్షి, అమరావతి: మోటారు సైకిల్ మీద పెద్ద మొత్తంలో ఇనుము తుక్కు తరలించడం సాధ్యమా అంటే.. కానేకాదని ఎవరైనా చెబుతారు. కానీ, విజయవాడ వన్‌టౌన్‌కు చెందిన ఒక తుక్కు వ్యాపారి (స్క్రాప్ డీలర్) మోటార్ సైకిళ్లపై టన్నులకొద్దీ తుక్కు ఇనుమును ఇతర రాష్ట్రాలకు తరలించేశారట.
ఆ సంస్థ లావాదేవీలు అసహజంగా ఉండటంతో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు లోతుగా పరిశీలించి, ఈ వాహన్ ద్వారా ఆ వాహనాలను పరిశీలిస్తే.. అవన్నీ మోటారు సైకిళ్లని, వాటిపైనే ఏకంగా 20 టన్నుల తుక్కు ఇనుము తరలించినట్లు వే బిల్లులు తీసుకున్నారని వెల్లడైంది. ఆ బిల్లులన్నీ నకిలీవేనని తేలింది. అంతేకాదు ఒడిశా నుంచి విశాఖకు సరుకు తరలించినట్లుగా పేర్కొన్న లారీ నంబర్‌ను పరిశీలించగా.. బిల్లులో పేర్కొన్న సమయంలో ఆ లారీ కేరళలో ఉన్నట్టు తేలింది.
ఇలా పలువురు వ్యాపారులు అసలు సరుకు రవాణా చేయకుండానే దొంగ వే బిల్లులు తీసుకొని ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేరుతో ప్రభుత్వం నుంచి ఎదురు డబ్బులు తీసుకుంటున్నారు. ఆ స్క్రాప్ వ్యాపారి దొంగ వే బిల్లులు సృష్టించినట్లు స్పష్టం కావడంతో కేసులు నమోదు చేశామని, ఆ లావాదేవీలపై పన్ను వసూలు చేయడంతో పాటు దానికి రెట్టింపు పెనాల్టీ విధించనున్నట్లు వాణిజ్యపన్నుల శాఖ చీఫ్ కమిషనర్ గిరిజా శంకర్ చెప్పారు.
తప్పు చేసిన వారు దొరికిపోతారిలా..
గతంలో వాణిజ్య పన్నుల శాఖ అంటే వ్యాపారులు తమను వేధించే విభాగంగా చూసేవారు. ఎక్కడికక్కడ వాహనాలు ఆపి తనిఖీలు చేయడం, చెక్ పోస్టు తనిఖీలు, మూకుమ్మడిగా వ్యాపారులపై తనిఖీల పేరుతో బెంబేలెత్తించేవారు. జీఎస్టీ వచ్చిన తర్వాత ఆ వాతావరణం కనిపించడంలేదు. దొంగ ఎక్కడున్నాడో గుర్తించి అక్కడే తనిఖీలు చేస్తున్నారు.
విజయవాడలో అనేక మంది స్క్రాప్ డీలర్లు ఉండగా దొంగ వ్యాపారం చేస్తున్న ఆ డీలరు దగ్గరకే నేరుగా వెళ్లడమే దీనికి నిదర్శనం. ఇందుకోసం వాణిజ్య పన్నుల శాఖ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వ్యాపారులపై వేధింపులు లేకుండా డేటా అనలిటిక్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో జరుగుతున్న వ్యాపార లావాదేవీలను నిరంతరం పర్యవేక్షిస్తోంది.
ఒక వ్యాపారి తీసుకుంటున్న ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్, వే బిల్లులు, వస్తువుల కొనుగోళ్లు, విక్రయాలు, పన్ను చెల్లింపులు వంటి అనేక అంశాలను పరిశీలించి వాటి మధ్య భారీ తేడాలు ఉంటే డేటా అనలిటిక్స్ ద్వారా సులభంగా గుర్తిస్తోంది. దీని ద్వారా గతంలోలా ప్రతి వ్యాపారినీ తనిఖీ చేయాల్సిన అవసరం లేదని, తప్పు ఎవరు చేస్తున్నారో నిర్ధారించుకొని, పూర్తి సాక్ష్యాధారాలతో దాడులు చేస్తున్నట్లు గిరిజా శంకర్ తెలిపారు.
ఈ విధంగా ఈ మధ్య కాలంలో జరిపిన తనిఖీల్లో విజయవాడలోని ఒక ప్రముఖ ఎలక్ట్రికల్ షోరూం ఎటువంటి బిల్లులు లేకుండా 80 శాతం పైగా నగదు రూపంలో లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఒకడ్రై ఫ్రూట్ వ్యాపారి రూ.35 కోట్ల మేర నగదు లావాదేవీలు నిర్వహించినట్లు గుర్తించారు.
కొంతమంది వ్యాపారులు సరుకు రవాణా అయిపోగానే కంప్యూటర్ నుంచి డేటా డిలీట్ చేయడం, వాట్సాప్ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తూ అయిపోయిన వెంటనే వాటిని డీల్‌ట్ చేస్తున్న విషయాన్ని అధికారులు గుర్తించారు. డిలీట్ చేసిన డేటాను మొత్తం తిరిగి రిట్రీవ్ చేసి ఆధారాలతో కేసులు నమోదు చేశారు. నిజాయితీగా వ్యాపారం చేస్తున్న వారికి అనవసరపు తనిఖీలు, దాడులు ఉండటంలేదు. ఈ విధానం పట్ల పలువరు వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తనిఖీలు తగ్గించడమే లక్ష్యం
రాష్ట్రంలో వ్యాపారులపై దాడులు లేకుండా చేయాలన్నదే మా ప్రభుత్వ విధానం. ఇందుకోసం పూర్తిస్థాయిలో డేటా అనలిటిక్స్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. దీనివల్ల తప్పుడు వ్యాపారం చేస్తున్న వారిని సులభంగా గుర్తించవచ్చు. చట్ట ప్రకారం వ్యాపారం చేస్తూ బాధ్యతగా పన్ను చెల్లించే వాతావరణం తీసుకువస్తాం. ఇందుకోసం వ్యాపారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి సూచనలు, సలహాలు తీసుకుంటాం.
– బుగ్గన రాజేంద్రనాథ్, ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి
‘తప్పు’ తేలితే తప్పదు శిక్ష
Published Sun, Nov 20 2022 3:26 AM | Last Updated on Sun, Nov 20 2022 7:10 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment