సాక్షి, అమరావతి: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో గత నాలుగేళ్లలో కొత్త వనరులతో పాటు సంపద సృష్టి జరిగిందని, జీఎస్టీ గణాంకాలే ఇందుకు నిదర్శనమని ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. 2021–22లో రూ.23,386 కోట్లుగా ఉన్న జీఎస్టీ వసూళ్లు (పరిహారం లేకుండా) 2022–23లో 25 శాతం వృద్ధితో రూ.28,103 కోట్లకు చేరాయన్నారు.
కేంద్ర జీఎస్టీ కంటే రాష్ట్ర జీఎస్టీ ఆదాయం నాలుగు శాతం అధికంగా నమోదైనట్లు వెల్లడించారు. జీఎస్టీ వసూళ్లు అత్యధికంగా ఉండే కర్ణాటక, మహారాష్ట్రల్లో సైతం ఇది కేవలం ఒక్క శాతానికి మాత్రమై పరిమితమైందన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ఆదాయం, సంక్షేమ పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. శుక్రవారం విజయవాడలో జీఎస్టీ ప్రాంతీయ కార్యాలయాన్ని (ఆడిట్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ) ప్రారంభించిన అనంతరం మంత్రి బుగ్గన విలేకరులతో మాట్లాడారు.
2014–19 మధ్య టీడీపీ హయాంతో పోలిస్తే ఇప్పుడు రెండేళ్లు కరోనా ఇబ్బందులు ఎదురైనా అధిక సంపద, వనరులను సృష్టించామని చెప్పారు. దీనిపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, మాజీ మంత్రి యనమలతో బహిరంగ చర్చకు సిద్ధమని బుగ్గన ప్రకటించారు. ఆదాయం తగ్గిందని యనమల విమర్శిస్తుంటే.. చంద్రబాబు మాత్రం పెరిగిందంటూ పరస్పర విరుద్ధంగా మాట్లాడుతున్నారని చెప్పారు. నిజంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుంటే గత నాలుగేళ్లలో పన్ను వసూళ్లు ఎలా పెరిగాయని ప్రశ్నించారు.
డీలర్ ఫ్రెండ్లీ విధానం
వాణిజ్య పన్నుల శాఖలో పారదర్శకంగా నిర్ణయాలు అమలు కావాలనే ఉద్దేశంతో ఎన్నడూ లేని విధంగా సంస్కరణలు తెచ్చినట్లు బుగ్గన పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. తమది డీలర్ల ఫ్రెండ్లీ విధానమని వివరించారు. స్టేట్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ ఎం.గిరిజాశంకర్, కమిషనర్ రవిశంకర్, అడిషనల్ కమిషనర్ ఎస్‌ఈ కృష్ణమోహన్‌రెడ్డి, కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment