సాక్షి, అమరావతి: కోవిడ్ కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలకు సాయం చేసేందుకు అప్పు చేశామని, రాబడి తగ్గినా ప్రజలకు నవరత్నాల ద్వారా సాయం ఆపలేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. కోవిడ్ క్లిష్ట సమయంలోనూ లక్షలాది మందికి నవరత్నాల్లోని పథకాల ద్వారా అవినీతికి తావు లేకుండా వేల కోట్ల రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. ఈ నేపథ్యంలో చెప్పడానికి ఏమీ లేకే ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పాటు కొన్ని పత్రికలు అప్పులను ప్రస్తావిస్తున్నాయని ఆయన ఎద్దేవా చేశారు.
ఈ విషయమై శుక్రవారం ఆయన ఆర్ అండ్ బి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కోవిడ్ కట్టడి, చికిత్సల కోసం ఈ ఆర్థిక ఏడాది తొలి మూడు నెలలు రోజుకు వందల కోట్లు వ్యయం చేయాల్సి వచ్చిందని తెలిపారు. కోవిడ్ లాక్ డౌన్‌తో పేదలు, మధ్య తరగతి ప్రజల జీవనోపాధి దెబ్బతిందని, మరో పక్క రాష్ట్ర రాబడి తగ్గిపోయిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజల చేతుల్లోకి డబ్బులు పంపడం ద్వారా వారి జీవనోపాధి మెరుగు పరచడటమే కాకుండా దెబ్బతిన్న ఆర్థిక రంగం క్రమంగా పుంజుకుంటుందని విచక్షణతో ఆలోచించి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని మంత్రి వివరించారు. మంత్రి బుగ్గన ఇంకా ఏం చెప్పారంటే..
పేదలను ఆదుకునేందుకే..
♦కోవిడ్ కష్టకాలంలో ప్రజలకు సాయం చేయడంలో భాగంగానే అప్పులు ఎక్కువగా చేయాల్సి వచ్చింది. ఇందులో దాపరికం, తప్పు ఏమీ లేదు.
♦అప్పులు చేసి విలాసాలకు, ఆర్భాటాలకు వ్యయం చేయలేదు. కోవిడ్‌తో జీవనోపాధి కోల్పోయిన పేద, మధ్య తరగతి ప్రజలకు సాయం చేశాం. చంద్రబాబు ఐదేళ్ల హయాంలోనూ రాష్ట్రం రెవెన్యూ లోటులోనే ఉంది.
♦కోవిడ్‌తో దేశంతో పాటు ప్రపంచం అంతా ఆర్థికంగా దెబ్బతింది. అందువల్లే కేంద్ర ప్రభుత్వం జీఎస్‌డీపీలో అప్పులను మూడు శాతం నుంచి ఐదు శాతానికి పెంచింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఆర్థిక ఏడాది రూ.6 లక్షల కోట్లు అప్పు చేయాలని అంచనా వేయగా, ఇప్పటికే 12 లక్షల కోట్లకు అప్పు చేరింది. ఇలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ అంచనాల కంటే అప్పు ఎక్కువగా చేయాల్సి వచ్చింది.
ఇప్పుడు ఆర్థిక రంగం క్రమంగా కోలుకుంటోంది
♦ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఇప్పుడు రాష్ట్ర జీఎస్‌టీ ఆదాయం కూడా మెరుగైంది. ఇప్పుడు దేశంలో రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. గత ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్ర జీఎస్‌టీ ఆదాయం –78.6 శాతం ఉండగా, దేశ జీఎస్‌టీ ఆదాయం –71.6 శాతంగా ఉండింది. అయితే క్రమంగా పుంజుకుని గత ఏడాది డిసెంబర్ నాటికి రాష్ట్ర జీఎస్‌టీ ఆదాయం 14 శాతం వృద్ధిలోకి, దేశ జీఎస్‌టీ ఆదాయం 11.5 శాతం వృద్ధిలోకి వచ్చింది.
♦2019–2020 ఆర్థిక ఏడాదిలో జూన్ నుంచి డిసెంబర్ వరకు జీఎస్‌టీ ఆదాయం రూ.14,940 కోట్లు ఉండగా, 2020–21 ఆర్థిక ఏడాదిలో జూన్ నుంచి డిసెంబర్ వరకు జీఎస్‌టీ ఆదాయం రూ.16,169 కోట్లు వచ్చింది.
♦రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై లాక్‌డౌన్ ప్రభావాన్ని తగ్గించే చర్యలను తీసుకోవడం వల్లే జీఎస్‌డీపీలో వ్యవసాయ వృద్ధి రేటు 4.6 శాతం ఉంటే, దేశంలో మూడు శాతమే ఉంది. పారిశ్రామిక రంగంలో రాష్ట్రం వృద్ధి రేటు –3.6 శాతానికే పరిమితం అయితే దేశంలో –8.2 శాతం ఉంది.
♦సర్వీసు రంగంలో రాష్ట్ర వృద్ధి రేటు –6.7 శాతానికే పరిమితం అయితే దేశంలో –8.1 శాతం ఉంది. 2019–20లో కేపిటల్ వ్యయం రూ.6,800 కోట్లు ఉంటే ఈ ఆర్థిక ఏడాది జనవరి వరకు 19,000 కోట్లకు పెరిగింది. ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో జీఎస్‌డీపీలో ద్రవ్య లోటు –12.96 శాతం ఉంటే క్రమంగా తగ్గుతూ నాల్గో త్రైమాసికానికి –3.15 శాతానికి వచ్చింది.
♦రెవెన్యూ లోటు జీఎస్‌డీపీలో తొలి త్రైమాసికంలో –10.494 శాతం ఉంటే నాల్గో త్రైమాసికంలో–2.484 శాతానికి తగ్గింది. గత ఆర్థిక ఏడాదితో పోల్చితే ఈ ఆర్థిక ఏడాది పన్ను, పన్నేతర ఆదాయం పెరిగింది. కేంద్రం నుంచి గ్రాంట్ల రాబడి కూడా పెరిగింది. అయితే అదే స్థాయిలో ఖర్చులు పెరిగాయి.
♦రాష్ట్ర జీఎస్‌డీపీలో అప్పు 32.7 శాతం ఉంది. పంజాబ్‌లో 38.7 శాతం, గుజరాత్‌లో 34.5 శాతం అప్పులున్నాయి.
ఎవరి అవినీతి ఎంతో తేలుద్దాం.. చర్చకు వస్తారా?
ఎవరి అవినీతి ఎంతో తెలుద్దాం చర్చకు వస్తారా.. అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు సవాల్ విసిరారు. కర్నూలులో బీజేపీ నేత కుమారుడిని పక్కన పెట్టుకుని స్థానిక ఎన్నికల ప్రచారానికి వచ్చి, ఎవరో స్లిప్ రాసిస్తే దాన్ని మాట్లాడం సరికాదని, వాస్తవాలను గమనించాలన్నారు. కర్నూలుకు ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రెండెకరాలతో వచ్చి దోపిడీ సొమ్ముతో హైదరాబాద్‌లో రూ.100 కోట్లతో బంగ్లా నిర్మించుకున్న చంద్రబాబు.. తాను మైనింగ్‌లో అక్రమంగా సంపాదిస్తున్నాననడంలో వాస్తవం లేదన్నారు. వందేళ్ల క్రితం నుంచే తన ముత్తాతకు మైనింగ్ వ్యాపారం ఉందన్నారు. ఇప్పటికీ తాను పాత కారులోనే తిరుగుతానని, అపార్ట్‌మెంట్‌లోనే ఉంటానని అన్నారు. ఇంకా ఏమన్నారంటే..
కర్నూలుకు ఈ ప్రభుత్వం చేసినవి..
►1937లో శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు పెట్టాలి. కానీ అప్పటి నుంచి ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ ప్రకటించిన విషయం చంద్రబాబుకు గుర్తు లేదా? అది కూడా హైకోర్టు అనుమతితోనే కర్నూలులో ఏర్పాటు చేస్తాం.
►హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ నుంచి 300 టీఎంసీల నీటిని గాజులదిన్నె ప్రాజెక్టుకు తీసుకువెళ్లింది ఈ ప్రభుత్వమే. కర్నూలులో 1972లో ఏర్పాటైన సిల్వర్ జూబ్లి కాలేజీకి కొత్త భవనాలు నిర్మిస్తున్నాం.
►రూ.200 కోట్లతో తుంగభద్ర పుష్కరాలు కోవిడ్ జాగ్రత్తలతో నిర్వహించాం.
►ఓర్వకల్లులో విమానాశ్రయం నిర్మించాం. ఓర్వకల్లులో పారిశ్రామిక ఎస్టేట్ ఏర్పాటు చేస్తున్నాం. ఇలా చెప్పుకుంటే కర్నూలుకు ఈ ప్రభుత్వం చాలా చేసింది. ఇవన్నీ చంద్రబాబుకు కనిపించవు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment