Revenue Budget
-
అందుకే అప్పులు చేశాం: మంత్రి బుగ్గన
-
అందుకే అప్పులు చేశాం: మంత్రి బుగ్గన
సాక్షి, అమరావతి: కోవిడ్ కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలకు సాయం చేసేందుకు అప్పు చేశామని, రాబడి తగ్గినా ప్రజలకు నవరత్నాల ద్వారా సాయం ఆపలేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. కోవిడ్ క్లిష్ట సమయంలోనూ లక్షలాది మందికి నవరత్నాల్లోని పథకాల ద్వారా అవినీతికి తావు లేకుండా వేల కోట్ల రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. ఈ నేపథ్యంలో చెప్పడానికి ఏమీ లేకే ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పాటు కొన్ని పత్రికలు అప్పులను ప్రస్తావిస్తున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. ఈ విషయమై శుక్రవారం ఆయన ఆర్ అండ్ బి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కోవిడ్ కట్టడి, చికిత్సల కోసం ఈ ఆర్థిక ఏడాది తొలి మూడు నెలలు రోజుకు వందల కోట్లు వ్యయం చేయాల్సి వచ్చిందని తెలిపారు. కోవిడ్ లాక్ డౌన్‌తో పేదలు, మధ్య తరగతి ప్రజల జీవనోపాధి దెబ్బతిందని, మరో పక్క రాష్ట్ర రాబడి తగ్గిపోయిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజల చేతుల్లోకి డబ్బులు పంపడం ద్వారా వారి జీవనోపాధి మెరుగు పరచడటమే కాకుండా దెబ్బతిన్న ఆర్థిక రంగం క్రమంగా పుంజుకుంటుందని విచక్షణతో ఆలోచించి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని మంత్రి వివరించారు. మంత్రి బుగ్గన ఇంకా ఏం చెప్పారంటే.. పేదలను ఆదుకునేందుకే.. ♦కోవిడ్ కష్టకాలంలో ప్రజలకు సాయం చేయడంలో భాగంగానే అప్పులు ఎక్కువగా చేయాల్సి వచ్చింది. ఇందులో దాపరికం, తప్పు ఏమీ లేదు. ♦అప్పులు చేసి విలాసాలకు, ఆర్భాటాలకు వ్యయం చేయలేదు. కోవిడ్‌తో జీవనోపాధి కోల్పోయిన పేద, మధ్య తరగతి ప్రజలకు సాయం చేశాం. చంద్రబాబు ఐదేళ్ల హయాంలోనూ రాష్ట్రం రెవెన్యూ లోటులోనే ఉంది. ♦కోవిడ్‌తో దేశంతో పాటు ప్రపంచం అంతా ఆర్థికంగా దెబ్బతింది. అందువల్లే కేంద్ర ప్రభుత్వం జీఎస్డీపీలో అప్పులను మూడు శాతం నుంచి ఐదు శాతానికి పెంచింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఆర్థిక ఏడాది రూ.6 లక్షల కోట్లు అప్పు చేయాలని అంచనా వేయగా, ఇప్పటికే 12 లక్షల కోట్లకు అప్పు చేరింది. ఇలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ అంచనాల కంటే అప్పు ఎక్కువగా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆర్థిక రంగం క్రమంగా కోలుకుంటోంది ♦ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఇప్పుడు రాష్ట్ర జీఎస్టీ ఆదాయం కూడా మెరుగైంది. ఇప్పుడు దేశంలో రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. గత ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం –78.6 శాతం ఉండగా, దేశ జీఎస్టీ ఆదాయం –71.6 శాతంగా ఉండింది. అయితే క్రమంగా పుంజుకుని గత ఏడాది డిసెంబర్ నాటికి రాష్ట్ర జీఎస్టీ ఆదాయం 14 శాతం వృద్ధిలోకి, దేశ జీఎస్టీ ఆదాయం 11.5 శాతం వృద్ధిలోకి వచ్చింది. ♦2019–2020 ఆర్థిక ఏడాదిలో జూన్ నుంచి డిసెంబర్ వరకు జీఎస్టీ ఆదాయం రూ.14,940 కోట్లు ఉండగా, 2020–21 ఆర్థిక ఏడాదిలో జూన్ నుంచి డిసెంబర్ వరకు జీఎస్టీ ఆదాయం రూ.16,169 కోట్లు వచ్చింది. ♦రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై లాక్డౌన్ ప్రభావాన్ని తగ్గించే చర్యలను తీసుకోవడం వల్లే జీఎస్డీపీలో వ్యవసాయ వృద్ధి రేటు 4.6 శాతం ఉంటే, దేశంలో మూడు శాతమే ఉంది. పారిశ్రామిక రంగంలో రాష్ట్రం వృద్ధి రేటు –3.6 శాతానికే పరిమితం అయితే దేశంలో –8.2 శాతం ఉంది. ♦సర్వీసు రంగంలో రాష్ట్ర వృద్ధి రేటు –6.7 శాతానికే పరిమితం అయితే దేశంలో –8.1 శాతం ఉంది. 2019–20లో కేపిటల్ వ్యయం రూ.6,800 కోట్లు ఉంటే ఈ ఆర్థిక ఏడాది జనవరి వరకు 19,000 కోట్లకు పెరిగింది. ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో జీఎస్డీపీలో ద్రవ్య లోటు –12.96 శాతం ఉంటే క్రమంగా తగ్గుతూ నాల్గో త్రైమాసికానికి –3.15 శాతానికి వచ్చింది. ♦రెవెన్యూ లోటు జీఎస్డీపీలో తొలి త్రైమాసికంలో –10.494 శాతం ఉంటే నాల్గో త్రైమాసికంలో–2.484 శాతానికి తగ్గింది. గత ఆర్థిక ఏడాదితో పోల్చితే ఈ ఆర్థిక ఏడాది పన్ను, పన్నేతర ఆదాయం పెరిగింది. కేంద్రం నుంచి గ్రాంట్ల రాబడి కూడా పెరిగింది. అయితే అదే స్థాయిలో ఖర్చులు పెరిగాయి. ♦రాష్ట్ర జీఎస్డీపీలో అప్పు 32.7 శాతం ఉంది. పంజాబ్‌లో 38.7 శాతం, గుజరాత్లో 34.5 శాతం అప్పులున్నాయి. ఎవరి అవినీతి ఎంతో తేలుద్దాం.. చర్చకు వస్తారా? ఎవరి అవినీతి ఎంతో తెలుద్దాం చర్చకు వస్తారా.. అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు సవాల్ విసిరారు. కర్నూలులో బీజేపీ నేత కుమారుడిని పక్కన పెట్టుకుని స్థానిక ఎన్నికల ప్రచారానికి వచ్చి, ఎవరో స్లిప్ రాసిస్తే దాన్ని మాట్లాడం సరికాదని, వాస్తవాలను గమనించాలన్నారు. కర్నూలుకు ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రెండెకరాలతో వచ్చి దోపిడీ సొమ్ముతో హైదరాబాద్‌లో రూ.100 కోట్లతో బంగ్లా నిర్మించుకున్న చంద్రబాబు.. తాను మైనింగ్‌లో అక్రమంగా సంపాదిస్తున్నాననడంలో వాస్తవం లేదన్నారు. వందేళ్ల క్రితం నుంచే తన ముత్తాతకు మైనింగ్ వ్యాపారం ఉందన్నారు. ఇప్పటికీ తాను పాత కారులోనే తిరుగుతానని, అపార్ట్మెంట్లోనే ఉంటానని అన్నారు. ఇంకా ఏమన్నారంటే.. కర్నూలుకు ఈ ప్రభుత్వం చేసినవి.. ►1937లో శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు పెట్టాలి. కానీ అప్పటి నుంచి ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ ప్రకటించిన విషయం చంద్రబాబుకు గుర్తు లేదా? అది కూడా హైకోర్టు అనుమతితోనే కర్నూలులో ఏర్పాటు చేస్తాం. ►హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి 300 టీఎంసీల నీటిని గాజులదిన్నె ప్రాజెక్టుకు తీసుకువెళ్లింది ఈ ప్రభుత్వమే. కర్నూలులో 1972లో ఏర్పాటైన సిల్వర్ జూబ్లి కాలేజీకి కొత్త భవనాలు నిర్మిస్తున్నాం. ►రూ.200 కోట్లతో తుంగభద్ర పుష్కరాలు కోవిడ్ జాగ్రత్తలతో నిర్వహించాం. ►ఓర్వకల్లులో విమానాశ్రయం నిర్మించాం. ఓర్వకల్లులో పారిశ్రామిక ఎస్టేట్ ఏర్పాటు చేస్తున్నాం. ఇలా చెప్పుకుంటే కర్నూలుకు ఈ ప్రభుత్వం చాలా చేసింది. ఇవన్నీ చంద్రబాబుకు కనిపించవు. చదవండి: ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్.. ఆ హక్కు ఎవరికీ లేదు: సీఎం జగన్ -
బడ్జెట్
► బడ్జెట్ స్థూలంగా ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయ, వ్యయపట్టిక. సర్కారు ఆర్థిక, విధాన పత్రం. ప్రజల నుంచి పన్నుల రూపేణా వసూలు చేసిన ధనాన్ని వారికోసం ఎలా వినియోగించబోతున్నారో వివరించే కార్యాచరణ ప్రణాళిక. ►మూలధన బడ్జెట్: మూలధన ఆదాయ, వ్యయ పట్టికగా చెప్పుకోవచ్చు. వార్షిక బడ్జెట్లో మూలధన బడ్జెట్‌తోపాటు రెవెన్యూ బడ్జెట్ కూడా ఉంటుంది. ప్రభుత్వానికి మూలధన ఖాతాలో వసూలయ్యే ఆదాయం, ఖర్చులు మూలధన బడ్జెట్లో ఉంటాయి. ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ వసూళ్లు, ఖర్చులకు సంబంధించిన వివరాలు రెవెన్యూ బడ్జెట్లో ఉంటాయి. ► మూలధన వ్యయం ఆస్తులు సమకూర్చుకునేందుకు, వాటాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చేసే ఖర్చు ఇది. మరో మాటలో చెప్పాలంటే ఆదాయ వనరులు సృష్టించుకునేందుకు లాభాపేక్షతో ప్రభుత్వం చేసే ఖర్చు ఇది. ► ప్రణాళికా వ్యయం: ప్రభుత్వం ఆదాయ వనరులను, ఆస్తులను సృష్టించుకునేందుకు చేసే వ్యయం ఇది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రణాళికలకు చేసే కేటాయింపులు ఈ ఖాతాలో ఉంటాయి. ► ప్రణాళికేతర వ్యయం ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపులు, రక్షణ, పోలీసు వ్యవస్థల నిర్వహణ, ఎన్నికల నిర్వహణ, కళలు, క్రీడలు, కుటుంబ సంక్షేమం, సమాచార ప్రసార, పర్యాటక రంగాలు, విదేశీ వ్యవహారాలు, కార్మిక సంక్షేమం, వ్యవసాయ రంగాలకు వెచ్చించే నిధులు, వడ్డీలు, రుణ చెల్లింపులు ప్రణాళికేతర ఖాతాలోకి వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే ప్రణాళికేతర గ్రాంటులు కూడా ఈ ఖాతాలోనే ఉంటాయి. ► సంచిత నిధి అన్ని రకాల వసూళ్లు, ఆదాయాలు, రుణాల ద్వారా వచ్చిన సొమ్ము ఈ నిధి కింద జమ అవుతుంది. ఈ నిధి నుంచి ఖర్చు చేయడానికి పార్లమెంటు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులో రెండు పద్దులుంటాయి. 1. రెవెన్యూ వసూళ్లు-రెవెన్యూ వ్యయం. 2. మూలధన వసూళ్లు-మూలధన వ్యయం. ► ప్రభుత్వ ఖాతా సంచిత నిధిలో జమయ్యే వసూళ్లు మినహా ప్రభుత్వం వద్దకు వచ్చే ఇతర అన్ని రకాల నిధులు ఈ ఖాతాలో జమ అవుతాయి. పార్లమెంటు అనుమతి లేకుండానే ఈ ఖాతాలోని నిధులను ఉపయోగించుకోవచ్చు. రిజర్వ్ బ్యాంకు నుంచి, పీఎఫ్ (భవిష్య నిధి) నుంచి తీసుకునే రుణాలను ఈ ఖాతా కింద ఖర్చు చేస్తారు. ఈ సొమ్మును మళ్లీ చెల్లించాల్సి ఉంటుంది. ► రెవెన్యూ వసూళ్లు పన్నులు, సుంకాల ద్వారా వసూలయ్యే ఆదాయమే రెవెన్యూ వసూళ్లు. ఎగుమతి, దిగుమతి సుంకాలు (కస్టమ్స్), ఎక్సైజ్ డ్యూటీ, కార్పొరేట్ టాక్స్, ఇతరత్రా పన్నుల రూపంలో వచ్చే సొమ్మంతా ఈ ఖాతాలోకే చేరుతుంది. ప్రభుత్వ పెట్టుబడులపై వడ్డీలు, డివిడెండ్ల రూపంలో వచ్చే ఆదాయం, ప్రభుత్వ సేవలపై వసూలు చేసే చార్జీలు.. ఇవన్నీ వీటి కిందకే వస్తాయి. ► రెవెన్యూ వ్యయం ప్రభుత్వ నిర్వహణ, ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు, బదిలీలపై చేసే ఖర్చును రెవెన్యూ వ్యయంగా పేర్కొంటారు. ఇది ప్రభుత్వానికి ఎలాంటి ఆస్తులను సృష్టించదు. ► రెవెన్యూ లోటు రెవెన్యూ వసూళ్లు, వ్యయానికి మధ్య తేడా. ► ప్రత్యక్ష పన్నులు ప్రభుత్వానికి మనం నేరుగా చెల్లించే పన్నులు ఇవి. ఆదాయ పన్ను, సంపద పన్ను, ఫ్రింజ్ బెని ఫిట్ టాక్స్ మొదలైనవన్నీ ఈ కోవలోకే వస్తాయి. ► పరోక్ష పన్నులు మనం చేసే వ్యయాలపై పరోక్షంగా విధించే పన్ను. కస్టమ్స్, ఎక్సైజ్, సర్వీస్ టాక్స్‌లన్నీ దీని పరిధిలోకే వస్తాయి. ► బడ్జెట్ అనే మాట ‘బొగెట్టీ’ అనే ఫ్రెంచి పదం నుంచి ఆవిర్భవించింది. బొగెట్టీ అంటే తోలుసంచి అని అర్థం. పూర్వం ఆదాయ వ్యయాలకు సంబంధించిన లెక్కల పత్రాల్ని సభకు తోలు సంచిలో తీసుకువచ్చేవారు కాబట్టే ఈ మాట వాడుకలోకి వచ్చింది. -
ఢీ అంటే ఢీ
బడ్జెట్‌పై పాలక, ప్రతిపక్షాల ఫైట్ రూ.486 కోట్లతో ఆమోదం విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ రెవెన్యూ బడ్జెట్ సమావేశంలో అధికార, ప్రతిపక్షాలు ఢీ అంటే ఢీ అన్నాయి. పన్ను భారాలతో ప్రజల నడ్డి విరుస్తున్నారంటూ విపక్షాలు మండిపడ్డాయి. పన్నుల బాదుడు లేకుండానే అదనపు ఆదాయాన్ని తెచ్చి చూపిస్తానని మేయర్ కౌంటర్ ఇచ్చారు. కార్పొరేషన్ రెవెన్యూ బడ్జెట్ సమావేశం బుధవారం మేయర్ కోనేరు శ్రీధర్ అధ్యక్షతన కౌన్సిల్ హాల్లో జరిగింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.486 కోట్ల 94 లక్షల 27 వేల 327 బడ్జెట్‌ను కౌన్సిల్ ఆమోదించింది. ఈ సమావేశం పాలక, ప్రతిపక్షాల మాటల తూటాల నడుమ వాడీవేడిగా సాగింది. వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ బి.నాగేంద్ర పుణ్యశీల మాట్లాడుతూ.. ఆస్తి పన్ను రూ.74 కోట్ల నుంచి రూ.132 కోట్లకు పెంచడాన్ని తప్పుబట్టారు. పన్నుల బాదుడుకు మేయర్ శ్రీకారం చుడుతున్నారని ఆరోపించారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.120 కోట్లు చూపారు కదా.. ఇప్పటివరకు ఎంత వసూలుచేశారని ప్రశ్నించారు. డిప్యూటీ కమిషనర్ డి.వెంకటలక్ష్మి మాట్లాడుతూ రూ.74 కోట్ల సాధారణ డిమాండ్‌లో రూ.55 కోట్లు వసూలయ్యాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ. 30 కోట్లు, వివిధ కోర్టు కేసుల పరిష్కారం అయితే రూ.8 కోట్లు వసూలవుతాయన్నారు. వీటన్నింటినీ గత బడ్జెట్లో చూపామన్నారు. మీరు పాతవే సక్రమంగా వసూలు చేయకుండా కొత్తగా రూ.132 కోట్లు వస్తోందని అంచనాల్లో చూపడం వల్ల ఉపయోగం ఏమిటని పుణ్యశీల ప్రశ్నించారు. దొడ్డిదారిన పన్నులు పెంచేందుకు పాలకపక్షం పన్నిన కుట్రగా దీన్ని అభివర్ణించారు. ఆదాయం పెంచుతాం ప్రతిపక్షాలది పసలేని వాదనగా మేయర్ కొట్టిపారేశారు. రాజధానిగా నగరం అభివృద్ధి చెందుతున్న క్రమంలో బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్మెంట్ల నిర్మాణం జరుగుతాయన్నారు. తద్వారా ఆస్తిపన్ను పెరుగుతుందన్నారు. నగరంలో చేపట్టిన సమగ్ర సర్వేలో లొసుగులు బయటపడుతున్నాయన్నారు. ఇప్పటివరకు 31,158 అసెస్మెంట్లను సర్వే చేస్తే 648 గృహాల వారు పన్ను చెల్లించడం లేదని, 7,699 మంది చెల్లించాల్సిన దానికంటే తక్కువ చెల్లిస్తున్నారని తేలిందన్నారు. వీటిన్నింటినీ సరిచేస్తే ఆదాయం ఎందుకు పెరగదన్నారు. గతంలో 27 వేల డీఅండ్‌వో ట్రేడ్ లెసైన్స్‌ల ద్వారా రూ.3.50 కోట్ల ఆదాయం వచ్చేదన్నారు. తాను బాధ్యతలు చేపట్టాక 32,700 ట్రేడ్స్ నుంచి రూ.6 కోట్ల ఆదాయం వస్తోందన్నారు. వాణిజ్య పన్నుల శాఖ లెక్కల ప్రకారం నగరంలో 65 వేల ట్రేడ్స్ ఉన్నాయన్నారు. వీటన్నింటి నుంచి పన్నులు రాబట్టగలిగితే రూ.10 కోట్ల ఆదాయం కచ్చితంగా వస్తుందని చెప్పారు. సింగ్‌నగర్, జక్కంపూడి, వన్‌టౌన్ ప్రాంతాల్లో యూజీడీ కనెక్షన్ల ద్వారా ఆదాయాన్ని రాబడతామన్నారు. నగరంలో 31 వేల ఖాళీ స్థలాలు ఉండగా ప్రస్తుతం 12 వేల స్థలాల నుంచే పన్నులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎలా పెరిగాయో చెప్పండి! సీపీఎం ఫ్లోర్ లీడర్ గాదె ఆదిలక్ష్మి మాట్లాడుతూ తాజా బడ్జెట్లో రూ.148 కోట్ల మేర ప్రజలపై భారాలు వేశారని ఆరోపించారు. దీనిపై మేయర్ ఆగ్రహించారు. ఆ మేర పన్నులు ఎలా పడ్డాయో సభకు వివరించాలన్నారు. అనూహ్య పరిణామంతో సీపీఎం సభ్యురాలు కంగుతిన్నారు. కార్పొరేషన్లో మాట్లాడటం, ప్రెస్‌మీట్ పెట్టడం చాలా తేలిక, నోరుంది కదా అని ఆరోపణలు చేయొద్దంటూ మేయర్ ఎదురుదాడికి దిగారు. రూ.600 కోట్లు తూచ్ సమగ్ర సర్వే ద్వారా రూ.600 కోట్ల ఆదాయం వస్తుందని ఎలా ప్రకటించారో చెప్పాలని పుణ్యశీల నిలదీశారు. తాను ఎప్పుడూ అలా చెప్పలేదని మేయర్ సమాధానమిచ్చారు. అధికారులు మాత్రమే ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారన్నారు. సకాలంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంలో పాలకపక్షం విఫలమైందని, వాస్తవ విరుద్ధంగా ఉన్న బడ్జెట్‌ను తాము ఆమోదించడం లేదని పుణ్యశీల, ఆదిలక్ష్మి అన్నారు. టీడీపీ సభ్యుడు జాస్తి సాంబశివరావు మాట్లాడుతూ.. ఇది ప్రజారంజక బడ్జెట్ అని అభివర్ణించారు. కావాలనే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. క్యాపిటల్ బడ్జెట్లో సంక్షేమం, అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయిస్తామన్నారు. పాలకపక్షం సభ్యులు బడ్జెట్‌ను ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. కమిషనర్ జి.వీరపాండియన్, టీడీపీ ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబు, టీడీపీ, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ముప్పా వెంకటేశ్వరరావు, వీరమాచినేని లలిత, షేక్ బీజాన్బీ, కోఆప్షన్ సభ్యులు సిద్ధం నాగేంద్రరెడ్డి, సి.ఉషారాణి తదితరులు మాట్లాడారు.