బడ్జెట్ | Budget | Sakshi
Sakshi News home page

బడ్జెట్

Published Tue, Mar 1 2016 5:05 AM | Last Updated on Sun, Sep 3 2017 6:42 PM

బడ్జెట్

బడ్జెట్

బడ్జెట్
స్థూలంగా ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయ, వ్యయపట్టిక. సర్కారు ఆర్థిక, విధాన పత్రం. ప్రజల నుంచి పన్నుల రూపేణా వసూలు చేసిన ధనాన్ని వారికోసం ఎలా వినియోగించబోతున్నారో వివరించే కార్యాచరణ ప్రణాళిక.
 
మూలధన బడ్జెట్:
     మూలధన ఆదాయ, వ్యయ పట్టికగా చెప్పుకోవచ్చు. వార్షిక బడ్జెట్‌లో మూలధన బడ్జెట్‌తోపాటు రెవెన్యూ బడ్జెట్ కూడా ఉంటుంది. ప్రభుత్వానికి మూలధన ఖాతాలో వసూలయ్యే ఆదాయం, ఖర్చులు మూలధన బడ్జెట్‌లో ఉంటాయి. ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ వసూళ్లు, ఖర్చులకు సంబంధించిన వివరాలు రెవెన్యూ బడ్జెట్‌లో ఉంటాయి.
 
మూలధన వ్యయం
ఆస్తులు సమకూర్చుకునేందుకు, వాటాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చేసే ఖర్చు ఇది. మరో మాటలో చెప్పాలంటే ఆదాయ వనరులు సృష్టించుకునేందుకు లాభాపేక్షతో ప్రభుత్వం చేసే ఖర్చు ఇది.
 
ప్రణాళికా వ్యయం:
     ప్రభుత్వం ఆదాయ వనరులను, ఆస్తులను సృష్టించుకునేందుకు చేసే వ్యయం ఇది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రణాళికలకు చేసే కేటాయింపులు ఈ ఖాతాలో ఉంటాయి.
 
ప్రణాళికేతర వ్యయం
     ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపులు, రక్షణ, పోలీసు వ్యవస్థల నిర్వహణ, ఎన్నికల నిర్వహణ, కళలు, క్రీడలు, కుటుంబ సంక్షేమం, సమాచార ప్రసార, పర్యాటక రంగాలు, విదేశీ వ్యవహారాలు, కార్మిక సంక్షేమం, వ్యవసాయ రంగాలకు వెచ్చించే నిధులు, వడ్డీలు, రుణ చెల్లింపులు ప్రణాళికేతర ఖాతాలోకి వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే ప్రణాళికేతర గ్రాంటులు కూడా ఈ ఖాతాలోనే ఉంటాయి.
 
సంచిత నిధి
     అన్ని రకాల వసూళ్లు, ఆదాయాలు, రుణాల ద్వారా వచ్చిన సొమ్ము ఈ నిధి కింద జమ అవుతుంది. ఈ నిధి నుంచి ఖర్చు చేయడానికి పార్లమెంటు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులో రెండు పద్దులుంటాయి. 1. రెవెన్యూ వసూళ్లు-రెవెన్యూ వ్యయం. 2. మూలధన వసూళ్లు-మూలధన వ్యయం.
 
ప్రభుత్వ ఖాతా
     సంచిత నిధిలో జమయ్యే వసూళ్లు మినహా ప్రభుత్వం వద్దకు వచ్చే ఇతర అన్ని రకాల నిధులు ఈ ఖాతాలో జమ అవుతాయి. పార్లమెంటు అనుమతి లేకుండానే ఈ ఖాతాలోని నిధులను ఉపయోగించుకోవచ్చు. రిజర్వ్ బ్యాంకు నుంచి, పీఎఫ్ (భవిష్య నిధి) నుంచి తీసుకునే రుణాలను ఈ ఖాతా కింద ఖర్చు చేస్తారు. ఈ సొమ్మును మళ్లీ చెల్లించాల్సి ఉంటుంది.
 
రెవెన్యూ వసూళ్లు
     పన్నులు, సుంకాల ద్వారా వసూలయ్యే ఆదాయమే రెవెన్యూ వసూళ్లు. ఎగుమతి, దిగుమతి సుంకాలు (కస్టమ్స్), ఎక్సైజ్ డ్యూటీ, కార్పొరేట్ టాక్స్, ఇతరత్రా పన్నుల రూపంలో వచ్చే సొమ్మంతా ఈ ఖాతాలోకే చేరుతుంది. ప్రభుత్వ పెట్టుబడులపై వడ్డీలు, డివిడెండ్ల రూపంలో వచ్చే ఆదాయం, ప్రభుత్వ సేవలపై వసూలు చేసే చార్జీలు.. ఇవన్నీ వీటి కిందకే వస్తాయి.
 
రెవెన్యూ వ్యయం
     ప్రభుత్వ నిర్వహణ, ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు, బదిలీలపై చేసే ఖర్చును రెవెన్యూ వ్యయంగా పేర్కొంటారు. ఇది ప్రభుత్వానికి ఎలాంటి ఆస్తులను సృష్టించదు.

రెవెన్యూ లోటు
     రెవెన్యూ వసూళ్లు, వ్యయానికి మధ్య తేడా.
 
ప్రత్యక్ష పన్నులు     
     ప్రభుత్వానికి మనం నేరుగా చెల్లించే పన్నులు ఇవి. ఆదాయ పన్ను, సంపద పన్ను, ఫ్రింజ్ బెని ఫిట్ టాక్స్ మొదలైనవన్నీ ఈ కోవలోకే వస్తాయి.
 
పరోక్ష పన్నులు
     మనం చేసే వ్యయాలపై పరోక్షంగా విధించే పన్ను. కస్టమ్స్, ఎక్సైజ్, సర్వీస్ టాక్స్‌లన్నీ దీని పరిధిలోకే వస్తాయి.
 
బడ్జెట్ అనే మాట ‘బొగెట్టీ’ అనే ఫ్రెంచి పదం నుంచి ఆవిర్భవించింది. బొగెట్టీ అంటే తోలుసంచి అని అర్థం. పూర్వం ఆదాయ వ్యయాలకు సంబంధించిన లెక్కల పత్రాల్ని సభకు తోలు సంచిలో తీసుకువచ్చేవారు కాబట్టే ఈ మాట వాడుకలోకి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement