బడ్జెట్ అంటే కేవలం ఆదాయం, వ్యయం లెక్కలే కాదు.. వేటి ధరలు తగ్గబోతున్నాయి? ఏవి పెరగబోతున్నాయి? పన్నులేమైనా తగ్గిస్తారా, పెంచుతారా? కొత్తగా వచ్చే ప్రయోజనాలేంటన్న ఆసక్తి అందరిలో ఉంటుంది. కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టేదాకా ఇవన్నీ రహస్యమే. ఎందుకంటే ముందే బడ్జెట్ ప్రతిపాదనలు బయటికి తెలిస్తే... చాలా తేడాలు వచ్చేస్తాయి.
ధరలు పెరిగిపోయేవి ముందే కొని దాచేసుకోవడం, తగ్గిపోయేవాటిని మార్కెట్లోకి వదిలేయడం, స్టాక్ మార్కెట్లలో కంపెనీల షేర్ల కొనుగోళ్లు, అమ్మకాలు.. ఇలా మరెన్నో. కొన్నిసార్లు మోసాలకూ, అవకతవకలకూ చాన్స్ ఉంటుంది. ఇలా మన దేశ బడ్జెట్ ఓసారి ముందే లీకై, కేంద్ర ఆర్థిక మంత్రి రాజీనామాకు దారి తీయడంతోపాటు... బడ్జెట్‌కు రూపకల్పన చేసే ప్రక్రియనే మార్చేసింది తెలుసా?
అది 1950వ సంవత్సరం.. జాన్ మథాయ్ కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆయన, వివిధ శాఖల ఉన్నతాధికారులు కూర్చుని కేంద్ర బడ్జెట్ రూపకల్పన పూర్తిచేశారు. ప్రింట్ చేసి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టడమే తరువాయి. అప్పట్లో రాష్ట్రపతిభవన్‌లోని ప్రెస్‌లో బడ్జెట్ ప్రతులను ముద్రించేవారు. ఇప్పుడున్నంత కఠినంగా సెక్యూరిటీ ఉండేది కాదు. దీనితో బడ్జెట్ పత్రాలు లీకయ్యాయి. రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన కొందరు జర్నలిస్టుల చేతికి చిక్కాయి. జాన్ మథాయి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టేలోపే జనానికి అందులోని అంశాలు తెలిసిపోయాయి.
ధనికులు, పెద్దలకు ప్రయోజనం కలిగించేలా బడ్జెట్ ఉందన్న విమర్శలు చెలరేగాయి. ఈ దెబ్బకు బడ్జెట్ పత్రాల ప్రింటింగ్‌ను ఢిల్లీలోని మింటో రోడ్‌లో ఉన్న ప్రభుత్వ ప్రెస్‌కు మార్చారు. తర్వాత 1980లో కేంద్ర సెక్రటేరియట్ ఉన్న నార్త్ బ్లాక్ భవనంలోని బేస్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రింటింగ్‌లో ముద్రించడం ప్రారంభించారు. ఇప్పుడు బడ్జెట్ పత్రాల రూపకల్పన, ప్రింటింగ్ అంటే... అధికారులు, సిబ్బంది క్వారంటైన్‌లో ఉన్నట్టే. ఎవరూ వారం పాటు కాలు బయటపెట్టడానికి వీల్లేదు, ఫోన్లు వాడటానికి అస్సలు వీల్లేదు.
Comments
Please login to add a commentAdd a comment