
దేశంలోని ప్రముఖ ఐటీ సేవల సంస్థల్లో ఒకటైన విప్రోలో గత దశాబ్ద కాలంగా ఫ్రెషర్ల వార్షిక వేతనం రూ. 3-4 లక్షలుగానే ఉంటోంది. ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఫ్రెషర్లకు ఇచ్చే వేతనాలు అలాగే తక్కువ స్థాయిలోనే ఉండటంపై చాలా కాలంగా కంపెనీ విమర్శలను ఎదుర్కొంటోంది. అయితే ఫ్రెషర్ల వేతన స్థాయి తక్కువగా ఉండటంపై కంపెనీ యాజమాన్యం తాజాగా వివరణ ఇచ్చింది.
ఇది విప్రో సమస్య మాత్రమే కాదు
ఇటీవలి ఆదాయ ప్రకటన అనంతర పత్రికా సమావేశంలో కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ ఈ సమస్యపై మాట్లాడారు. జీతాలు స్థిరంగా ఉండటానికి మార్కెట్ ఆధారిత డిమాండ్-సప్లై డైనమిక్స్ కారణమని పేర్కొన్నారు. “ఇది విప్రోకు సంబంధించిన సమస్య కాదు. ఇది మార్కెట్, పరిశ్రమ ఆధారిత సమస్య” అని గోవిల్ తెలిపారు. విప్రో అన్ని స్థాయిల ఉద్యోగులకు పోటీతత్వ వేతనాలను అందిస్తుందని, మార్కెట్ పరిస్థితులు మారినప్పుడు జీతాలను సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ఎక్కువ మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు
భారత ఐటీ సెక్టార్ ఏటా 15 లక్షలకు పైగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలకు అధిక సరఫరా ఏర్పడుతోంది. ఈ అధిక సరఫరా, అధిక ఆరంభ జీతాలకు పరిమిత డిమాండ్‌తో కలిసి, పరిశ్రమ వ్యాప్తంగా ఫ్రెషర్ జీతాలను మార్పులేనివిగా ఉంచింది. విప్రో తన పోటీదారులతో సమానంగా, ఆర్థిక అనిశ్చితులు, క్లయింట్ డిమాండ్ హెచ్చుతగ్గుల మధ్య ఖర్చులను నియంత్రించే వ్యూహాన్ని అనుసరిస్తుంది. అయితే, 2023లో కొందరు అభ్యర్థులకు రూ. 6.5 లక్షల నుంచి రూ. 3.5 లక్షలకు వేతన ఆఫర్‌లను తగ్గించడం వంటి చర్యలకు సంస్థ విమర్శలను ఎదుర్కొంది. దీనికి వ్యాపార అవసరాల మార్పు కారణమని పేర్కొంది.
ద్రవ్యోల్బణం, జీవన వ్యయాల పెరుగుతున్న నేపథ్యంలో వేతనాలు ఇలాగే ఉంటే ఉత్తమ ప్రతిభను ఆకర్షించడంలో ఇబ్బందులు ఏర్పడతాయని విమర్శకులు వాదిస్తున్నారు. అయితే విప్రో మాత్రం తాము ఇస్తున్న వేతనాలు పోటీతత్వంగానే ఉన్నాయని, దీంతోపాటు శిక్షణ కార్యక్రమాలు, కెరీర్ వృద్ధి అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొంది. భారత ఐటీ పరిశ్రమ గ్లోబల్ ఆర్థిక సవాళ్లను, అభివృద్ధి చెందుతున్న నైపుణ్య అవసరాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఫ్రెషర్ జీతాలపై చర్చ ప్రతిభ నిర్వహణ, మార్కెట్ డైనమిక్స్‌కు సంబంధించిన విస్తృత సమస్యలను హైలైట్ చేస్తోంది.
పెంచుతాంలే..
ఫ్రెషర్ల వేతన స్థాయిని పెంచే విషయంలో ప్రస్తుతానికి, విప్రో మేనేజ్‌మెంట్ ఆశాజనకంగానే ఉంది. భవిష్యత్ మార్కెట్ మార్పులకు అనుగుణంగా వేతనాలను సర్దుబాటు చేస్తామని హామీ ఇస్తోంది. పెరుగుతున్న పోటీ, సాంకేతిక పురోగతులు దగ్గర భవిష్యత్తులో ఎంట్రీ-లెవల్ వేతనాల పునఃపరిశీలనకు దారితీస్తాయా అన్నదానిపై పరిశ్రమ పరిశీలకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.