
కొత్తగా నియమించుకున్న ఉద్యోగులకు ఐటీ సంస్థ విప్రో ఝలక్ ఇచ్చింది. మొదట్లో ఆఫర్ చేసిన జీతంలో సగానికి పనిచేయాలని కోరింది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత ఆర్థిక పరిస్థితులు, క్లయింట్ల నుంచి డీల్స్ జాప్యం అవుతున్న నేపథ్యంలో సగం జీతంతో ప్రాజెక్ట్‌లను అంగీకరించాలని కోరింది. రూ. 6.5 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగంలో చేరి శిక్షణ పూర్తి చేసుకుని ప్రాజెక్ట్‌ల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు రూ. 3.5 లక్షల ప్యాకేజీతో ప్రాజెక్ట్‌లను టేకప్ చేస్తారా అని యాజమాన్యం ఈ-మెయిల్స్ ద్వారా అడిగింది.
(ఇదీ చదవండి: ఓలా, ఉబర్, రాపిడోలకు భారీ షాక్, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు)
పరిశ్రమలో ఇతరుల మాదిరిగానే తాము కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు, కస్టమర్ అవసరాలను అంచనా వేసి అందుకు అనుగుణంగా నియామకాలు చేపడుతుంటామని విప్రో పేర్కొంది. ప్రస్తుతం తమకు రూ.3.5 లక్షల వార్షిక ప్యాకేజీతో పనిచేసే ప్రాజెక్ట్ ఇంజనీర్ల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని అభ్యర్థులకు పంపించిన ఈ-మెయిల్‌లో వివరించింది.
2023 బ్యాచ్‌లోని వెలాసిటీ గ్రాడ్యుయేట్స్ కేటగిరీ అభ్యర్థులకు కంపెనీ ఈ ఆఫర్ చేసింది.ఇది కూడా ఫిబ్రవరి 20 వరకు మాత్రమే. ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులను బోర్డింగ్‌లోకి తీసుకునే కసరత్తు మార్చి నుంచి ప్రారంభం కానుంది. శిక్షణ కాలం తర్వాత అసెస్‌మెంట్‌లలో పేలవమైన పనితీరు కనబరిచిన 425 మంది ఫ్రెషర్‌లను తొలగించిన నేపథ్యంలో ఈ సగం ఆఫర్ విషయం బయటకు రావడం చర్చనీయాంశమైంది.
(ఇదీ చదవండి: Layoffs: ట్విటర్‌లో మరిన్ని కోతలు.. ఈసారి వారి వంతు!)