Regulation land
-
నిలిచిన భూముల క్రమబద్ధీకరణ
♦ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల ♦ మధ్య కొరవడిన సమన్వయం సాక్షి, హైదరాబాద్: రెండు ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయలేమి.. భూముల క్రమబద్ధీకరణ రిజిస్ట్రేషన్లకు ప్రతిబంధకంగా మారింది. చెల్లింపు కేటగిరీలో భూముల క్రమబద్ధీకరణ నిమిత్తం రెవెన్యూ శాఖ జారీ చేసిన జీవో 59, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు కోసం ఇచ్చిన జీవో 12 ప్రతులను చూపినా సబ్ రిజిస్ట్రార్లు ససేమిరా అంటున్నారని తహసీల్దార్లు వాపోతున్నారు. స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు విషయమై తమ శాఖ ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి ఆదేశాల అందలేదని సబ్రిజిస్ట్రార్లు చెబుతున్నారు. దీంతో సొమ్ము చెల్లించి ఏడాది గడచినా భూముల రిజిస్ట్రేషన్ కాకపోవడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. రెవెన్యూ శాఖ ఉత్తర్వులు తమకు అందలేదని, దీంతో సబ్ రిజిస్ట్రార్లకు తాము ఆదేశాలివ్వలేదని రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పలు సాంకేతిక ఇబ్బందులతో అస్తవ్యస్తంగా తయారైన క్రమబద్ధీకరణ ప్రక్రియ, తాజాగా ఉన్నతాధికారుల సమన్వయలోపంతో మరింత అధ్వానంగా మారింది. మరో 10 రోజుల్లో గడువు ముగుస్తుండగా, భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోవడం లబ్ధిదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ‘‘స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ల ఫీజు మినహాయింపు విషయమై రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి సబ్ రిజిస్ట్రార్లకు ఎటువంటి ఆదేశాలందలేదు. రిజిస్ట్రేషన్ల శాఖ నోటిఫికేషన్లు వచ్చేవరకు క్రమబద్ధీకరణ రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని సబ్ రిజిస్ట్రార్లందరికీ సూచించాం’’ అని తెలంగాణ సబ్ రిజిస్ట్రార్ల సంఘం అధ్యక్షుడు కె.విజయ భాస్కర్‌రావు చెప్పారు. -
మరింత జాప్యం
♦ ఖరారుకాని పట్టాభిషేకం ♦ భూ క్రమబద్ధీకరణపై సందిగ్ధత ♦ కన్వియెన్స్డీడ్పై కొరవడిన స్పష్టత ♦ హక్కుల కోసం ఎదురుచూస్తున్న 6,779 మంది భూక్రమబద్ధీకరణ ప్రక్రియ రోజుకో మలుపు తిరుగుతోంది. ఫిబ్రవరి నాటికి మొత్తం సొమ్ము చెల్లించిన స్థలాలను రిజిస్ట్రేషన్ చేస్తామని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం.. అస్పష్ట విధానాలతో వాయిదాల పర్వాన్ని కొనసాగిస్తోంది. కన్వియెన్స్ డీడ్ (యాజ మాన్య హక్కులు)కు తుదిరూపుపై ఏకాభిప్రాయం రాకపోవడంతో జీఓ 59 (చెల్లింపు కేటగిరీ) కింద క్రమబద్ధీకరణకు అర్హత సాధించిన స్థలాలకు కూడా మోక్షం కలగడంలేదు. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లావ్యాప్తంగా జీఓ 59 కింద 11,846 దరఖాస్తులు రాగా, వీటిలో 6,779 అర్జీలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. క్రమబద్ధీకరణ అర్హమైనవిగా తేల్చినవారందరికీ నోటీసులు జారీచేసిన జిల్లా యంత్రాంగం.. నిర్దేశిత కనీస ధర చెల్లించమని సూచించింది. ఈ మేరకు రూ.100.53 కోట్ల మొత్తం డీడీల రూపేణా సర్కారు ఖజానాకు చేరింది. అయితే, కన్వియెన్స్ డీడ్ అంశంపై ఎటూ తేల్చకపోవడంతో క్రమబద్ధీకరణ ప్రక్రియకు బ్రేక్ పడింది. డీడ్‌కు సంబంధించి నమూనా, డిజిటల్ సిగ్నేచర్ తదితర సాంకేతిక పరిజ్ఞానాన్ని తహసీల్దార్లకు బదలాయించినప్పటికీ, వీటిలో కొన్ని లోటుపాట్లను గుర్తించిన యంత్రాంగం.. రిజిస్ట్రేషన్ల విషయంలో తొందరపాటు తగదని సంకేతాలు పంపింది. దీంతో జిల్లాలో భూ క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రారంభం కాలేదు. అదేసమయంలో చె ల్లింపు కేటగిరీ కిందకు మార్చిన జీఓ 58 (ఉచిత కేటగిరీ) దరఖాస్తులపై సందిగ్ధత నెలకొంది. బిల్టప్ ఏరియాలో కొంత మొత్తంలో చిన్న కొట్టు నిర్వహించుకున్నా లేదా మడిగ రూపంలో ఉన్నా భవనం మొత్తాన్ని కమర్షియల్ కింద పరిగణిస్తున్నారు. దీంతో 25శాతంతో క్రమబద్ధీకరణ జరిగే స్థలానికి వంద శాతం ఫీజు చెల్లించాల్సివస్తోంది. ఈ పరిణామంతో బిత్తెరపోయిన దరఖాస్తుదారులు ఆగమేఘాల మీద దుకాణాలు, మడిగలను తొలగించుకుంటున్నారు. తమ గృహాలను రె సిడెన్షియల్ బిల్డింగ్‌లుగా పరిగణనలోకి తీసుకోవాలని తాజా ఫొటోలతో తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కాగా, వచ్చేవారంలో కన్వియెన్స్ డీడ్లను జారీ చేస్తామని జాయింట్ కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ ’సాక్షి’కి తెలిపారు. రూ.46 కోట్లు వెనక్కి.. క్రమబద్ధీకరణకు నోచుకోని దరఖాస్తుదారులకు సొమ్ము వాపస్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగానికి లేఖ రాసింది. అయితే, నిధులను ట్రెజరీలలో జమచేసినందున.. సొమ్మును వెనక్కి తీసుకునేందుకు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే డీడీలను వాపస్ చేసే అంశంపై జిల్లా యంత్రాంగం ముందుకు వెళ్లడంలేదు. కాగా, జీఓ 59 కింద స్థలాలను క్రమబద్ధీకరించుకునేందుకు ముందుకొచ్చిన 11,846 మంది రూ.139.68 కోట్లను డీడీల రూపేణా ప్రభుత్వానికి జమ చేశారు. దీంట్లో కొందరు 25శాతమే చెల్లించగా, మరికొందరు 50%, ఇంకొందరు మొత్తం సొమ్ము చెల్లించారు. ఈ క్రమంలోనే దరఖాస్తులను పరిశీలించిన రెవెన్యూ అధికారులు.. వీటిలో కేవలం 6,779 మాత్రమే రెగ్యులరైజేషన్‌కు అనువుగా ఉన్నాయని తేల్చారు. ఈ స్థలాలపై హక్కులు పొందేందుకు నిర్దేశిత మొత్తాన్ని చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. దీంతో ఇప్పటివరకు రూ.100.53 కోట్ల ఆదాయం రాగా.. మిగతా రూ.46.36 కోట్లను తిరస్కరించిన 5,067 దరఖాస్తుదారులకు చెల్లించాల్సివుంది. ఈ మేరకు ఈ సొమ్మును తిరిగి ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా.. స్పష్టమైన విధానాన్ని ప్రకటించలేదు. దీనికితోడు కొన్ని దరఖాస్తులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి. అధికారుల తప్పిదాలు, సాంకేతిక కారణాలతో కొన్నింటిని పక్కనపెట్టారు. వీటిపై తుది నిర్ణయం తీసుకుంటే తప్ప దరఖాస్తుల తిరస్కరణపై స్పష్టత వస్తుంది. అప్పటివరకు డీడీల వాపస్ అనుమానమేనని అధికారవర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. -
రండి బాబూ.. రండి!
కబ్జాదారులకు బంపర్ ఆఫర్ స్థలాల క్రమబద్ధీకరణకు అధికారుల దండోరా మైకులు, కరపత్రాల ద్వారా జోరుగా ప్రచారం విస్తృతంగా అవగాహన సదస్సులు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఆక్రమణదారులకు ప్రభుత్వం రెడ్‌కార్పెట్ పరిచింది. భూముల క్రమబద్ధీకరణకు సాదరస్వాగతం పలుకుతోంది. ఆలసించిన ఆశాభంగం.. అంటూ బస్తీల్లో మైకులు, కరపత్రాలతో హోరెత్తిస్తోంది. స్థలాల క్రమబద్ధీకరణతో ఖజానా నింపుకోవాలని ఆశపడుతున్న సర్కారు.. ప్రభుత్వ స్థలాల్లోని ఇళ్లకు పట్టాలివ్వాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో కబ్జాదారులతో కూడా సమావేశాలు నిర్వహిస్తున్న రెవెన్యూ యంత్రాంగం.. ఆక్రమణలను రెగ్యులరైజ్ చేసుకోవాలని హితబోధ చేస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగించుకుంటే సరేసరి లేకపోతే స్థలాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తోంది. జిల్లావ్యాప్తంగా 6,202 ఎకరాల్లో ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించిన యంత్రాంగం.. వీటి క్రమబద్ధీకరణ ద్వారా భారీగా నిధులు సమకూరుతాయని అంచనా వేసింది. దీంతో క్రమబద్ధీకరణపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రభుత్వం కూడా దీనిపై గంపెడాశ పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే కబ్జాదారులకు అవగాహన కల్పించే పనిలో నిమగ్నమైంది. భవిష్యత్తులో ఆక్రమణలు తావివ్వకుండా వీలైనంతమేరకు స్థలాలను రెగ్యులరైజ్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో.. కాలనీలు, బస్తీల్లో విస్తృతంగా దండోరా వేయిస్తోంది. ఖరారుకాని మార్గదర్శకాలు ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడి ఐదు రోజులైనా.. ఇప్పటివరకు ప్రభుత్వం మార్గదర్శకాలు వెలువరించకపోవడంపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జీఓ విడుదల చేసిననాటి నుంచి 20 రోజుల వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రకటించిన సర్కారు.. ఇంకా గైడ్‌లైన్స్ ఖరారు, దరఖాస్తు ఫారాాలు ఇవ్వకపోవడంపై పెదవి విరుస్తున్నారు. మార్గదర్శకాల విడుదలలో జాప్యం జరిగినందున.. దరఖాస్తుల సమర్పణకు గడువును పొడగించే అవకాశముందనే ప్రచారమూ జరుగుతోంది. వేలానికి వేళాయే.. నగర శివార్లలోని ప్రధాన ప్రాంతాల్లోని 213 స్థలాలను వేలం వేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. అత్యంత విలువైన 930 ఎకరాలు అమ్మడం ద్వారా రూ.3వేల కోట్ల ఆదాయం పొందవచ్చని అంచనా వేసింది. అయితే, తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భూముల విక్రయం మాట దేవుడెరు గు.. కనీస అవసరాలకు కూడా భూమి దొరకని పరిస్థితి తలెత్తుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజోపయోగ అవసరాలకు కేటాయించిన పిమ్మట వేలం వేసే భూముల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర సర్కారు ఆదేశించింది. ఈ క్రమంలో కసరత్తు ప్రారంభించిన రెవెన్యూ యంత్రాంగానికి దిమ్మతిరిగింది. పలు సంస్థలు తమ కార్యాలయాల నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతూ ఇప్పటికే ప్రభుత్వం వద్ద దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడం, అంగన్వాడీ స్కూళ్లు, శ్మశానవాటికలు, కమ్యూనిటీ హాళ్లకు స్థలాలు నిర్దేశిస్తే వేలానికి మిగిలేది 30 నుంచి 40 శాతమేనని ప్రాథమికంగా తేలింది. కొన్ని మండలాల్లో అయితే అమ్మకానికి ప్రభుత్వ స్థలాల్లేని పరిస్థితి ఏర్పడింది. ఈ మేరకు నిర్దేశించిన ఫార్మెట్ ప్రకారం తహసీల్దార్ల నుంచి జిల్లా యంత్రాంగం వివరాలను సేకరిస్తోంది. గచ్చిబౌలికి కలెక్టరేట్ కలెక్టరేట్‌ను గ చ్చిబౌలికి తరలించాలని ప్రభుత్వం దాదాపుగా నిర్ణయించింది. శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 25,26లోని 20ఎకరాలను కలెక్టరేట్ సముదాయ నిర్మాణానికి వినియోగించునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. భవిష్యత్తులో వికారాబాద్ ప్రత్యేక జిల్లా కానున్నందున.. ఇది అన్ని ప్రాంతాలకు అనువుగా ఉంటుందని భావిస్తోంది. సెంట్రల్ యూనివర్సిటీ పక్కనే ఉన్న ఈ స్థలంలో శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయం కూడా ఉంది. ప్రతిపాదిత కలెక్టరేట్ స్థలాన్ని సోమవారం జాయింట్ కలెక్టర్ -1 చంపాలాల్ కూడా పరిశీలించారు. ఇదిలావుండగా, రాజేంద్రనగర్ మండలం అపార్డ్‌కు సమీపంలోని సర్వే నం 259లోని భూమిని కూడా కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అయితే, ఈ భూమిని హెచ్ఎండీఏకు కేటాయించినందున.. గచ్చిబౌలి వైపు మొగ్గు చూపుతున్నారు.