ప్రభుత్వ భూమిలో ప్లాట్ల దందా
♦ అక్రమార్కులతో కుమ్మక్కైన ఓ ప్రజాప్రతినిధి?
♦ పక్షం రోజులుగా సాగుతున్న పనులు
బెల్లంపల్లి : బెల్లంపల్లి మునిసిపాలిటీ శివార్లలోని విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు రంగం సిద్ధమైంది. కొందరు వ్యాపారులు ఈ పనికి పాల్పడుతూ ఓ ప్రజాప్రతినిధిని తమతో కలుపుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. బెల్లంపల్లి శివారులోని బుధాకలాన్ గ్రామ సర్వే నంబర్ 170లో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల వెనకాల ఉన్న విలువైన ఖాళీ భూమిని ఆక్రమించేందుకు యత్నాలు జరుగుతున్నాయి. ఈ భూమిని ఇప్పటికే కొందరు నిరుపేదలకు ఇందిరమ్మ పథకం కింద కేటాయించగా పలువురు ఇళ్లు నిర్మించుకున్నారు.
అలాగే, మరోపక్క గురి జాలకు వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకుని ఐటీడీఏ ఆధ్వర్యంలో యూత్ ట్రైనింగ్ సెంటర్ నిర్మించారు. దీని పక్కనే తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులు సాగుతుండగా, ఇంకోపక్క ఏఆర్ పోలీసు హెడ్‌క్వార్టర్స్ ఉన్నాయి. ఇలా ప్రభు త్వ కార్యాలయాల నడుమ ఉన్న విలువైన ఖాళీ స్థలాన్ని ఆక్రమించేందుకు కబ్జాదారులు సిద్ధం కాగా.. పక్షం రోజులుగా ట్రాక్టర్లతో భూమి చదును చేయిస్తున్నాయి. అంతేకాకుండా గుంటన్నర చొప్పున ప్లాట్లు వేసి రూ. 20వేల చొప్పున వసూలు చేసి విక్రయాలకు తెర లేపినట్లు తెలుస్తోంది.
మంజూరు కాకముందే ఆక్రమణ?
బెల్లంపల్లిలోని ఓ సామాజికవర్గం ఇళ్ల స్థలాల కోసం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసినట్లు తెలిసింది. అయితే, ఈ విషయంలో కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయినప్పటికీ ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి ఆధ్వర్యంలో దరఖాస్తు చేసుకున్న సదరు సామాజికవర్గం నాయకులు ఎలాగూ మంజూరు చేస్తారనే ధీమాతో ప్రస్తుతం ఆక్రమణకు గురైన సర్వే నం.170లోని మి గతా ఖాళీ భూమిని కబ్జా చేశారు. ఆ భూమి చుట్టూరా ఫెన్సింగ్ కూడా వేశారు. అంతేకాకుండా 40మంది కుల స్తులకు ప్లాట్లు కేటాయించి కందకాలు తవ్వడం గమ నార్హం. ఇది పోను పునాది నిర్మాణానికి ఇసుక, బండరాయి తెప్పించడం గమనార్హం. ఈ విషయమై రెవెన్యూ యంత్రాంగం మేల్కొని ప్రభుత్వ భూమి ఆక్రమణలను అడ్డుకోవాలని పలువురు కోరుతున్నారు.
స్థలం మంజూరు కాలేదు
ఇళ్ల స్థలాల మంజూరు కోసం ఓ సామాజిక వర్గం నాయకులు కలెక్టర్‌కు వినతిపత్రం పంపించారు. అయితే, కలెక్టర్ నుంచి ఉత్తర్వులు రాకముందే భూమి ఆక్రమించుకున్నారు. ఆ స్థలంలో నిర్మాణాలు చేయకుండా చర్యలు తీసుకుంటాం. ఈ మేరకు రెవెన్యూ సిబ్బందిని అక్కడికి పంపించి పనులు నిలుపుదల చేయిస్తాం.
- కె.శ్యామలదేవి, తహశీల్దార్, బెల్లంపల్లి