హన్మంతు, గంగామణి (ఫైల్)
బీర్కూర్ (బాన్సువాడ): కరోనా కారణంగా తల్లీకొడుకు గంటల వ్యవధిలోనే కన్నుమూశారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. బీర్కూర్ మాజీ ఎంపీపీ మల్లెల మీన, ఆమె భర్త హన్మంత్ (42), అత్త గంగామణి (65) వారం క్రితం అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం నిజామాబాద్‌కు వెళ్లి పరీక్ష చేయించుకోగా, కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ముగ్గురు ఇంటికి వచ్చి హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.
రెండ్రోజుల తర్వాత హన్మంత్ దంపతుల ఆరోగ్యం క్షీణించడంతో నిజామాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అయితే, ఇంట్లో ఉన్న గంగామణికి ఆదివారం రాత్రి శ్వాసకోశ సమస్యలు తలెత్తడంతో ఊపిరి ఆడక కన్ను మూసింది. దీంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు కోవిడ్ నిబంధనల ప్రకారం రాత్రి సమయంలోనే అంత్యక్రియలు పూర్తి చేశారు. మరోవైపు, ఆదివారం రాత్రి హన్మంత్ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేయగా, సోమవారం ఉదయం మృతి చెందారు. 12 గంటల వ్యవధిలోనే తల్లీకొడుకు మృతి చెందడంతో బీర్కూర్‌లో విషాద చాయలు నెలకొన్నాయి.
5 రోజుల వ్యవధిలో దంపతులు మృతి
బెల్లంపల్లి: మాయదారి కరోనా ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఐదు రోజుల వ్యవ ధిలో భార్యాభర్తల ఉసురుతీసింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్‌బస్తీకి చెందిన దంపతులకు వారం క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. భర్తకు తీవ్ర అస్వస్థత ఉండటంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. భార్య హోం ఐసోలేషన్‌లో ఉండి తీవ్ర మనోవేదనకు గురైంది. తన భర్తకు నయం అవుతుందో లేదోనని ఆందోళన చెందింది. సంతానం లేని సదరు గృహిణి.. ఈనెల 14న ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది. తాజాగా ఆమె భర్త కరోనాతో పోరాడుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. ఐదు రోజుల వ్యవధిలోనే దంపతులిద్దరూ చనిపోవడం స్థానికంగా విషాదం నింపింది.
Comments
Please login to add a commentAdd a comment