కామారెడ్డి టౌన్: కరోనాపై పోరులో ఎంతో మంది ప్రాణాలకు తెగించి పని చేశారు. వైరస్ వ్యాపిస్తున్నా భయపడకుండా విధులు నిర్వహించారు. అలాంటి వారిలో 108 సిబ్బంది కూడా ఉన్నారు. కరోనా సోకిన రోగులను అంబులెన్సుల్లో ఆస్పత్రులకు తరలించారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలకు సేవలందించారు. అయితే, వారిని ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. తొలి విడతలోనే ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు టీకాలు ఇచ్చిన ప్రభుత్వం.. 108 సిబ్బందిని మాత్రం మరిచింది.
వెలకట్టలేని సేవలు..
కరోనా వైరస్ నియంత్రణలో వైద్యారోగ్య, రెవెన్యూ, మున్సిపల్, పోలీసు తదితర శాఖలు కీలకంగా వ్యవహరించాయి. ఆశలు, అంగన్‌వాడీలు, పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బంది, రెవెన్యూ, పోలీసు, 108 సిబ్బంది ప్రాణాలకు తెగించి పని చేశారు. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే తొలి విడతలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు టీకాలు ఇచ్చా రు. ప్రస్తుతం 60 ఏళ్ల పైబడిన వారితో పాటు 45 నుంచి 59 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న సాధారణ పౌరులకు వ్యాక్సిన్ ఇస్తున్నారు.
అయితే, కరోనా సమయంలో ముందుండి సేవలందించిన 108 సిబ్బందికి మాత్రం టీకాలు ఇవ్వక పోవడంతో వారు ఆవేదనకు గురవుతున్నారు. ఫోన్ రాగానే ఆగమేఘాల మీద ప్రజలకు సేవలందింన తమను గుర్తించలేక పోయారని మనోవేదన చెందుతున్నారు. కరోనా నియంత్రణకు పాటు పడిన నిర్లక్ష్యం చేస్తున్నారని వాపోతున్నారు.
పట్టించుకోని యంత్రాంగం
జిల్లాలో 108 అంబులెన్సులు 12 ఉన్నాయి. డ్రైవర్లు, పైలెట్, సిబ్బంది కలిపి మొత్తం 60 మందికి పైగా విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో కామారెడ్డి, బాన్సువాడ పట్టణ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న ఆరుగురికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారు. మిగతా వారిని మాత్రం మరిచారు. ఆన్‌లైన్‌లో కూడా వీరి వివరాలను నమోదు చేయలేదు. ఇప్పటికైనా అధికారులు తమను గుర్తించాలని 108 సిబ్బంది వేడుకుంటున్నారు.
చాలా బాధగా ఉంది
అత్యవసర సమయాల్లో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలందిస్తున్నాం. కరోనా సోకిన వారిని ఆస్పత్రులకు తరలించాం. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా సేవలందిస్తున్న మమ్మల్ని గుర్తించక పోవడం బాధగా ఉంది. సాధారణ పౌరులకు టీకా ఇస్తున్నారు కానీ మాకు ఇవ్వడం లేదు. ఇప్పటికైనా మా సేవలను గుర్తించాలి.
– విజయ్, 108, అంబులెన్స్ డ్రైవర్, కామారెడ్డి
మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు
నేను జిల్లాకు ఇటీవలే బదిలీపై వచ్చాను. 108 సిబ్బంది టీకాలు ఇవ్వాలని ఇప్పటి వరకు ఆదేశాలు రాలేవు. అందుకే మేము కూడా స్పందించ లేకపోయాం. రెండు రోజుల క్రితమే సిబ్బంది డేటాను సేకరించాం. వారికి టీకా ఇచ్చే విషయమై ఉన్నతాధికారులకు నివేదిస్తాం.
– అనిరుధ్, 108 జిల్లా కో–ఆర్టినేటర్, కామారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment