సాక్షి, కామారెడ్డి : కరోనా బాధితులను వైరస్ కన్నా తోటి వారే ఎక్కువగా వేధిస్తున్నారు. కోవిడ్–19 వచ్చిందని తెలిస్తే చాలు సామాజికంగా వెలి వేస్తున్నారు. ‘పోరాడాల్సింది రోగితో కాదు.. వ్యాధితో’ అని ప్రభుత్వం ఎంత ప్రచారం చేస్తున్నా సరే ప్రజలు మారడం లేదు. బాధితులకు భరోసా ఇవ్వాల్సింది పోయి మరింత బాధ పెడుతున్నారు. కామారెడ్డిలోని హౌసింగ్‌బోర్డు కాలనీవాసులు కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి పట్ల శనివారం మరోమారు కఠినంగా వ్యవహరించారు. బాధితుడికి టిఫిన్ పెట్టేందుకు వచ్చిన వ్యక్తిపై రాళ్లతో దాడి చేసేందుకు యత్నించారు. కాలనీవాసుల ప్రవర్తనతో కుంగిపోయిన బాధితుడు మళ్లీ అద్దె ఇంటికి చేరుకున్నాడు. (వైరస్ వ్యాప్తి: ఆ రెండూ వేర్వేరు అంశాలు)
పట్టణంలోని గోదాం రోడ్‌కు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతను అద్దెకు ఇంటున్న ఇంట్లోనే హోం ఐసోలేషన్‌లో ఉన్నాడు. అయితే, అక్కడ ఎండ, వెలుతురు సరిగ్గా లేకపోవడంతో కొద్దిగా ఇబ్బందులు పడుతున్నాడు. కరోనా బాధితులు ఎండకు ఉండాలని వైద్యులు సూచించారు. దీంతో అతను హౌసింగ్‌బోర్డు కాలనీలోని తన సొంత మామయ్య ఇంటికిశుక్రవారం రాత్రి రాగా, కాలనీ వాసులు ఆందోళన దిగిన సంగతి తెలిసిందే. వైద్య సిబ్బంది వచ్చి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.అయితే, శనివారం ఉదయం బాధితుడికి అతడి మిత్రుడు టిఫిన్ తీసుకువచ్చి గేటు వద్ద పెడుతుండగా కాలనీవాసులు కొందరు రాళ్లు పట్టుకుని కొట్టేందుకు సిద్ధమయ్యారని బాధితుడు తెలిపారు. దీంతో మళ్లీ ఆందోళన మొదలైంది.
సదరు వ్యక్తి ఆ కాలనీలో ఉండవద్దని, ఉంటే తమకూ వైరస్ సోకుతుందని కాలనీ వాసులు వాగ్వాదానికి చేశారు. ఓ తరుణంలో రాళ్లతో అయినా తరిమి కొడుతామని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్, పట్టణ ఎస్సై రవికుమార్ తదితరులు అక్కడకు చేరుకున్నారు. అధికారుల ముందే కాలనీవాసులు బాధితుడ్ని సూటిపోటీ మాటలతో ఆడిపోసుకున్నారు. వైద్యాధికారులు, పోలీసులు నచ్చచెప్పినా కాలనీవాసులు కనికరించ లేదు. దీంతో కుంగిపోయిన బాధితుడు తాను అద్దె ఇంటికి వెళ్లిపోతానని అధికారులకు చెప్పి, తన స్కూటీపై గోదాం రోడ్‌కు బయల్దేరి వెళ్లాడు. (కరోనా వేళ.. ‘సూపర్’ కథ!)
అతని వెనుకాలే పోలీసులు, వైద్యాధికారులు ఇంటి వరకు వెళ్లారు. అయితే, ఈ వ్యవహారంలో కాలనీవాసులకు మద్దతుగా వైద్యాధికారులు, పోలీసులపై రాజకీయ నాయకులు ఒత్తిడి తెచ్చి బాధితుడ్ని పంపించేలా చేసినట్లు తెలిసింది. ఈ ఘటనపై అర్బన్ మెడికల్ ఆఫీసర్ సుజాయిత్ అలీని ‘సాక్షి’ వివరణ కోరగా.. కాలనీవాసులు అభ్యంతరం తెలిపారని, ఇంటి పక్కవాళ్లు కూడా ఆందోళనకు గురికావడంతో సదరు వ్యక్తికి నచ్చచెప్పి పంపించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.
ఆదరించిన ఇంటి యజమాని..
కాలనీవాసులు కనికరం చూపకపోయినా ఇంటి యజమాని మాత్రం మానవత్వం ప్రదర్శించారు. హౌసింగ్‌బోర్డులో జరిగిన ఘటన తెలిసి, బాధితుడికి ఫోన్ చేసి తన ఇంటికి రావాలని కోరాడు. దీంతో బాధితుడు గోదాంరోడ్‌లోని అద్దె ఇంటికి వెళ్లిపోయాడు.
‘మానవత్వం లేని మనుషులు’
అద్దె ఇంట్లో ఎండ, వెలుతురు సరిగా లేకపోవడంతో హౌసింగ్‌బోర్డు కాలనీలోని మామయ్య ఇంటికి వెళ్లానని బాధితుడు తెలిపాడు. తన బాధను ‘సాక్షి’కి ఫోన్‌లో వివరించాడు. ‘రోజూ ఎండలో కొద్దిసేపు ఉంటే వైరస్ తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎండ, వెలుతురు కసమే హౌసింగ్‌బోర్డులోని మా మామయ్య ఇంటికి వెళ్లాను. అక్కడ మానవత్వం లేని మనుషులను చూసి బాధ పడ్డాను. రోగం వస్తే మనో ధైర్యం చెప్పాల్సిన మనుషులు ప్రస్తుతరం కరువయ్యారు. ఆదరించిన మా ఇంటి యజామానికి రుణపడి ఉంటా’నని బాధితుడు వివరించాడు.
Comments
Please login to add a commentAdd a comment