Birkur
-
కరోనాతో తల్లీకొడుకు మృతి
బీర్కూర్ (బాన్సువాడ): కరోనా కారణంగా తల్లీకొడుకు గంటల వ్యవధిలోనే కన్నుమూశారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. బీర్కూర్ మాజీ ఎంపీపీ మల్లెల మీన, ఆమె భర్త హన్మంత్ (42), అత్త గంగామణి (65) వారం క్రితం అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం నిజామాబాద్‌కు వెళ్లి పరీక్ష చేయించుకోగా, కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ముగ్గురు ఇంటికి వచ్చి హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. రెండ్రోజుల తర్వాత హన్మంత్ దంపతుల ఆరోగ్యం క్షీణించడంతో నిజామాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అయితే, ఇంట్లో ఉన్న గంగామణికి ఆదివారం రాత్రి శ్వాసకోశ సమస్యలు తలెత్తడంతో ఊపిరి ఆడక కన్ను మూసింది. దీంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు కోవిడ్ నిబంధనల ప్రకారం రాత్రి సమయంలోనే అంత్యక్రియలు పూర్తి చేశారు. మరోవైపు, ఆదివారం రాత్రి హన్మంత్ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేయగా, సోమవారం ఉదయం మృతి చెందారు. 12 గంటల వ్యవధిలోనే తల్లీకొడుకు మృతి చెందడంతో బీర్కూర్‌లో విషాద చాయలు నెలకొన్నాయి. 5 రోజుల వ్యవధిలో దంపతులు మృతి బెల్లంపల్లి: మాయదారి కరోనా ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఐదు రోజుల వ్యవ ధిలో భార్యాభర్తల ఉసురుతీసింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్‌బస్తీకి చెందిన దంపతులకు వారం క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. భర్తకు తీవ్ర అస్వస్థత ఉండటంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. భార్య హోం ఐసోలేషన్‌లో ఉండి తీవ్ర మనోవేదనకు గురైంది. తన భర్తకు నయం అవుతుందో లేదోనని ఆందోళన చెందింది. సంతానం లేని సదరు గృహిణి.. ఈనెల 14న ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది. తాజాగా ఆమె భర్త కరోనాతో పోరాడుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. ఐదు రోజుల వ్యవధిలోనే దంపతులిద్దరూ చనిపోవడం స్థానికంగా విషాదం నింపింది. -
హరితలోగిళ్లు.. ఈ అంగన్వాడీలు
సాక్షి, బీర్కూర్ (కామారెడ్డి): తెలంగాణ వ్యాప్తంగా మొక్కల పెంపకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనిలో భాగంగా హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతీ ప్రభుత్వ శాఖను హరితహారంలో భాగం చేస్తు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే శాశ్వత అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు స్వచ్చందంగా ముందుకు వచ్చి తమ కేంద్రాలను అందమైన హరితలోగిళ్లుగా మార్చుతున్నారు. తమ కేంద్రాల ఆవరణలో అనేక రకాల పూల మొక్కలతో పాటు కూరగాయల మొక్కలు, ఆకు కూరల పాదులు ఏర్పాటు చేసుకుంటున్నారు. వీటి ద్వారా వచ్చిన కూరగాయలు, ఆకు కూరలను పౌష్టికాహారంలో భాగంగా గర్బవతులకు, బాలింతలకు, చిన్నారులకు మంచి ఆకుకూరలతో భోజనాన్ని వడ్డిస్తున్నారు. ఎక్కువగా సొంత భవనాల్లోనే.. సొంత భవనాల్లో అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయా గ్రామాల్లోని అంగన్వాడీ కార్యకర్తలు తమ కేంద్రాల పరిదిలో హరితవనాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. బీర్కూర్ మండలంలో మొత్తం 25 కేంద్రాలు ఉండగా వాటిలో 14 కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు కార్యకర్తలు మొక్కలు నాటి వాటిని పోషించే బాధ్యతను స్వీకరించారు. బీర్కూర్ మండల కేంద్రంలోని హరిజనవాడ, కిష్టాపూర్,అన్నారం, దామరంచ, రైతునగర్ త దితర గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల ఆవరణలో మొక్క లు పెంచుతున్నారు. బీర్కూర్ మండలంతో పాటు బాన్సువాడ ప్రాజెక్ట్ పరిధిలోని ఐదు మండలాల్లో మొత్తం 222 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వాటిలో 94 కేంద్రాలు సొంత భవనాల్లో కొనసాగుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో 1198 అంగన్వాడీ కేంద్రాలుండగా కొన్నే సొంత భవనాలు ఉన్నాయి. బీర్కూర్ మండలంలో.. బీర్కూర్ మండలంతో పాటు బాన్సువాడ ప్రాజెక్ట్ పరిధిలో కొన్ని కేంద్రాలకు సొంత భవనాలు ఉండటంతో మొక్కల పెంపకం చేపట్టడం జరిగిందని అయితే అద్దె భవనాల్లో ఈ సదుపాయం లేకుండా పోతోందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే మరికొంత మంది మాత్రం సొంత భవనాలు ఉన్నప్పటికి మొక్కల పెంపకంపై ఆసక్తి కనబరచడం లేదు. బీర్కూర్ గ్రామంలోని హరిజనవాడ అంగన్వాడీ కేంద్రాల్లో అనేక రకాల పూల మొక్కలతో పాటు ఆకుకూరల పాదులను ఏర్పాటు చేసి సాగు చేస్తున్నారు. ఆట పాటలతో విద్యాబోధన కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు ఆట పాటలతో చిన్నారులకు విద్యాభోదన చేస్తున్నారు. దీంతో పాటు గర్భవతులకు, బాలింతలకు ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యం మేరకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుండటంతో కొంత మేర మార్పు కనిపిస్తోందని ఆయా గ్రామాల ప్రజలు అభిప్రాయపడ్తున్నారు. పచ్చదనంతో నిండి ఉంటుంది.. బీర్కూర్ మండల కేంద్రంలోని హరిజనవాడలో అన్న అంగన్వాడీ కేంద్రం పచ్చదనంతో నిండి ఉంటుంది. అం గన్వాడీ కేంద్రానికి వస్తే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. తమ పిల్లలు కేంద్రంలో చక్కగా భోజనం చేస్తూ ఆటలు ఆడుకుంటూ చదువు నేర్చుకుంటున్నారు. సొంత భవనం లేనప్పుడు పిల్లలు కూడా ఇబ్బందులు పడేవారు. – కల్యాణి, బాలింతరాలు, బీర్కూర్ కొన్ని కేంద్రాలు ఎంతో బాగున్నాయి బీర్కూర్ మండలంలో మొత్తం 25 కేంద్రాలకు గాను 14 కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు హరితహారంలో భాగంగా మొక్కలు నాటుతూ కార్యకర్తలు కూరగాయ మొక్కలను సైతం పెంచు తున్నారు. దీనివల్ల గర్భవతులకు పౌష్టికాహారం అందించే సమయంలో వీటిని ఉపయోగిస్తున్నారు. – కళావతి, ఐసీడీఎస్ సూపర్వైజర్ బీర్కూర్ -
ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
బిర్కూర్: నిజామాబాద్ జిల్లా బిర్కూర్ మండలం దుర్తి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం విషాదం చోటు చేసుకుంది. కుటుంబకలహాలతో మనస్థాపం చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంది. దుర్తికి చెందిన నాగమణి(35)కి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ఈమెకు రెండేళ్ల జేతశ్రీతో పాటు మూడు నెలల చిన్న పాప ఉంది. కుటుంబకలహాల నేపథ్యంలో మనస్థాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన ఇరుగుపొరుగువారు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. తల్లీబిడ్డలు ముగ్గురు మంటలకు ఆహుతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆమె భర్త వ్యవసాయ కూలి. అతను పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జాతీయజెండాకు నిప్పు
బస్వాయిపల్లి(బీర్కూర్) : నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలం అంకోల్ పంచాయతీ పరిధిలోని బస్వాయిపల్లి గ్రామంలో జాతీయజెండాకు అవమానం జరిగింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేస్తారు. సోమవారం ఉదయం గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు బండారి గంగారాం జాతీయ జెండాను ఎగురవేశారు. సాయంత్రం జెండాను దించి అవతనం చేయడం కోసం వెళ్లగా కర్ర కిందపడి, జాతీయజెండా సగం దగ్ధమై కనిపించింది. దీంతో గ్రామ సర్పంచ్ దీపిక కిరణ్ గౌడ్‌కు సమాచారం అందించగా పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎవరో గుర్తుతెలియని దుండగులు దురుద్దేశంతోనే జెండాను కిందపడేసి కాల్చినట్లు అనుమానం వ్యక్తం చేశారు. -
అతిసారంతో 41 మందికి అస్వస్థత
దుర్కి (బీర్కూర్) : నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలంలోని దుర్కి గ్రామంలో డయేరియా ప్రబలింది. మంగళవారం గ్రామానికి చెందిన సుమారు 41మంది దళితులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. స్థానిక ఏఎన్ఎం ఇచ్చిన సమాచారంతో బీర్కూర్ పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిలిప్‌కుమార్ సిబ్బందితో గ్రామానికి చేరుకుని అత్యవసర వైద్యశిబిరం నిర్వహించారు. అస్వస్థతకు గురైన వారిని గ్రామ చావిడి, సబ్సెంటర్లలో పరీక్షించి ప్రత్యేక చికిత్సలు అందించారు. గ్రామంలో డయేరియా వ్యాపిస్తోందని తెలుసుకున్న జిల్లా మలేరియా అధికారి లక్ష్మయ్య, జిల్లా స్పెషల్ డాక్టర్ రాజేష్‌లు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. -
కన్న తల్లిని కడతేర్చిన కర్కశ కొడుకు
బీర్కూర్ : నవ మాసాలు మోసి కని పెంచిన తల్లినే క్షణికావేశంలో బండతో మోది కడతేర్చాడు ఓ కర్కశ కొడుకు. దురలవాట్లకు బానిసై, వాటికోసం చేసిన అప్పులు తీర్చలేక, దంపతుల మధ్య జరుగుతున్న గొడవను ఆపేందుకు ప్రయత్నించిన తల్లిపై బండరాయితో దాడిచేశాడు. ఎస్సై రాజ్‌భరత్ రెడ్డి కథనం ప్రకారం. జిల్లాలోని బీర్కూరు మండలం దుర్కి గ్రామానికి చెందిన మేతిరి బశెట్టి, తన తల్లి పోశవ్వ (65)తో కలిసి ఎస్సీ కాలనీలో నివసిస్తున్నారు. రెండేళ్ల క్రితం మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన సవితతో బశెట్టికి వివాహమైంది. తరచూ భార్య భర్తలు గొడవ పడుతుండేవారు. 15 రోజుల క్రితం సవిత భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయి తిరిగి బుధవారం దుర్కి గ్రామానికి వచ్చింది. రాత్రి మళ్లీ భార్యభర్తలు గొడవ పడ్డారు. దీంతో తాను ఆత్మహత్య చేసుకుంటానని బశెట్టి బయటకు వెళ్లి విద్యుత్ తీగను పట్టుకోవడంతో పాటు తలను బండకేసి మోదుకోగా తల్లి అడ్డుపడింది. దీంతో ‘నీ వల్లే మా మధ్యలో గొడవలవుతున్నాయని’ కోపోద్రిక్తుడైన బశెట్టి ఇంటి వద్ద నున్న బండరాయితో తల్లిని మోది తీవ్రంగా గాయపర్చాడు. గమనించిన కూతురు రజిత వెంటనే 108కు సమాచారం అందించగా, పోచవ్వను వెంటనే బాన్సు వాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆమె అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. -
కరెంటు లేక పంటకు నిప్పు
బీర్కూర్: కరెంటు కోతలు రైతులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన దాసరి లక్ష్మయ్య మూడు ఎకరాలు కౌలుకు తీసుకోని ఖరీఫ్‌లో నాట్లు వేశాడు. ఎకరానికి 12 బస్తాల చొప్పున కౌలు పెట్టాల్సి ఉంటుంది. పంట సాగు చేసేందుకు ఎకరానికి సుమారు రూ. 20 వేలు ఖర్చయింది. వానలు లేవు, కరెంటు సైతం తీవ్ర ఇబ్బందులు పెట్టింది. దీంతో పొట్ట దశకు వచ్చిన పంట కళ్లముందే ఎండిపోయింది. పంట పాలు తాగాల్సిన సమయంలో నీళ్లు లేకపోవడంతో పంట అంతా పొల్లు పోయింది. ఎండిన పంటను చూసి తట్టుకోలేక లక్ష్మయ్య పంటకు నిప్పు పెట్టాడు. -
మల్చింగ్‌తో మేలెంతో..
బీర్కూర్ : వ్యవసాయంలో మెలకువలు తెలుసుకుంటూ, వాటిని క్షేత్రంలో అమలు చేస్తూ పురోగమిస్తున్నారు పలువురు రైతులు. పంటల సాగులో ఆధునిక పద్ధతులు అవలంబిస్తూ పెట్టుబడి ఖర్చులు తగ్గించుకుంటున్నారు. అధిక దిగుబడులూ సాధిస్తున్నారు. బిందు సేద్యం, మల్చింగ్ విధానంలో పంటలు పండిస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మలచుకుంటున్నారు రైతునగర్‌కు చెందిన మద్దుకూరి గౌతమ్ కుమార్ అనే రైతు. ఆయన సాగు పద్ధతుల గురించి తెలుసుకుందామా మరి.. ‘‘పదేళ్ల క్రితం బిందు సేద్యం గురించి తెలుసుకున్నాను. అప్పట్లో ప్రభుత్వం 60 శాతం రాయితీపై పరికరాలను సరఫరా చేసింది. మూడెకరాల్లో పరికరాల ఏర్పాటుకు సుమారు రూ. 50 వేల వరకు ఖర్చయ్యాయి. గతేడాది రెండెకరాల్లో బిందు సేద్యం పరికరాలను(90 శాతం రాయితీ) ఏర్పాటు చేసుకున్నాను. ఎక్కువగా క్యాబేజీ, కాలీఫ్లవర్, మిర్చి, టమాట, మొక్కజొన్న సాగు చేస్తున్నాను. బోధన్, వర్ని, బాన్సువాడ అంగడులలో విక్రయిస్తున్నాను. ఇటీవలి కాలంలో మల్చింగ్ విధానం గురించి తెలిసింది. ఆ పద్ధతిని కూడా అవలంబిస్తున్నాను. ఈసారి మూడెకరాల్లో టమాట, రెండెకరాల్లో మొక్కజొన్న వేశాను. బిందు సేద్యం, మల్చింగ్ విధానంతో తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేయవచ్చు. ఈ విధానాలు అవలంబిస్తూ ఎకరానికి సరిపోయే నీటితోనే ఐదెకరాల్లో పంటలు సాగు చేస్తున్నాను’’ అని గౌతమ్ కుమార్ వివరించారు. ఈ విధానాల్లో పంటల సాగుతో పెట్టుబడి ఖర్చులు తగ్గాయని, రాబడి కూడా పెరిగిందని తెలిపారు. -
విచారణ లేదు.. ఎన్నికలు లేవు
బీర్కూర్,న్యూస్‌లైన్: రైతుల రుణాల్లో అక్రమాలు చోటుచేసుకున్న నేపథ్యంలో బీర్కూర్ మండలంలోని దామరంచ సింగిల్ విండో పాలక వర్గాన్ని రద్దు చేసిన అధికారులు తిరిగి ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యం చూపుతున్నారు. మొదట్లో రుణాల దుర్వినియోగంపై విచారణ చేపట్టిన అధికారులు ఆ తరువాత పట్టించుకోలేదు. దామరంచ సింగిల్ విండోలో గతంలో పని చేసిన అధ్యక్ష, కార్యదర్శులు సుమారు రూ. 1 కోటి 60 లక్షలు దుర్వినియోగం చేసినట్లు రైతులు ఆరోపించారు. ఈ మేరకు రైతులు ఆధారాలను బయటపెట్టారు. పలు రకాలుగా రైతులకు రుణాలు రూ .1,78,87,695 వచ్చాయి. దీంట్లో స్వల్ప కాలిక రుణాలు రూ. 1,13,00712, రీ షెడ్యూల్ ద్వారా, రూ. 12,05,505 నార్మల్ లాంగ్ టర్మ్ రుణాలు రూ. 88,325, ఎల్టీ నాబార్డు ద్వారా రూ. 2,62,679 , నాబార్డు రీషెడ్యూల్ ద్వారా రూ. 46,88,407, నాబార్డు రీ షెడ్యూల్ద్వారా రూ. 3,01,042 వచ్చాయి. అయితే మొదటి సారి రూ. 67,59,973, రెండవ సారి రూ. 67,65,869 మాఫీ వచ్చింది. దీంతో పాటు వైద్యనాథ్ కమిటీ ద్వారా సొసైటీకి రూ. 25,10,471, పీఎం ఫండ్ ద్వారా రూ. 16,42,103 వచ్చాయి. అయితే ఇంత జరిగినా రైతులు ఒక్క రూపాయి కూడా లోన్లు తీసుకోకుండానే అధ్యక్ష, కార్యదర్శులు రైతుల పేరు మీద లక్షలకు లక్షలు స్వాహా చేశారు. మొదటి విడత, రెండవ విడతలో రుణ మాఫీ కాని వారికి వైఎస్ ప్రభుత్వం రూ. 5000 ఇన్సెంటీవ్ ప్రకటించగా సొసైటీ పరిధిలోని 567 మంది రైతుల పేరు మీద ఇన్సెంటీవ్ తెప్పించి వారిలో కేవలం 250 మంది వరకు రైతులకు మాత్రమే బోనస్‌ను అందించి మిగిలినవి వారి జేబుల్లో వేసుకున్నారు. ఇదిలా ఉండగా తొమ్మిదేళ్ల క్రితం చనిపోయిన దావోరి విఠల్(అకౌంట్ నంబర్ 180) అ నే రైతు పేరు మీద డబ్బులు తీసుకుంటూ దర్జాగా కాలక్షేపం చేశారు. రూపాయి కూడా రుణం తీసుకోని రైతుల పేరు మీద కూడా వేలకు వేలు అప్పులు ఉన్నట్లు చూ పిస్తున్నారు. రైతుల పేరు మీద వారికి తె లియకుండా రుణాలు పొం దడమే కా కుండా ఇవన్ని సక్రమంగానే జరిగాయం టు అధికారులను గతంలో న మ్మించడానికి ప్రయత్నించారు. ప్రతి సంవత్సరం రుణాలు తీసుకుని సక్రమంగా చెల్లించే వారి పేరు మీద కూడా వీరిరువురు లోన్లు తీసుకున్నట్లు తేలింది. మరో నమ్మలేని నిజం ఏమిటంటే నవంబర్ 31, 2006లో గడ్డం లక్ష్మి పేరు మీద రూ. 35 వేలు, శేక్ హుస్సేన్ పేరు మీద రూ. 38,500 కాజేశారు. అసలు ప్రపంచంలోని ఏ క్యాలండర్ చూసినా నవంబర్ 31 ఉండనే ఉండదు. ఈ ఒక్క విషయం చాలు వారు ఎంతగా రైతులకు వచ్చే నిధులు స్వాహా చేశారో అర్థం అవుతుంది. లోన్లు తీసుకుని రుణాలు చె ల్లించిన వారికి కూడా రుణ మాఫీ తీసుకువచ్చి ఈ డబ్బులను సైతం సొంతానికి వా డుకున్నారు. అయితే గతంలోనే దీనిపై స హకార బ్యాంక్ అధికారులు విచారణ జ రిపి కమిటీని రద్దు చేసి చేతులు దులుపుకున్నారు. సుమారు రూ. 1కోటి 60 లక్షలు దుర్వినియోగం అయినా బాధ్యులైన వారిపై ఇంత వరకు చర్యలు తీసుకోకపోవడంపై రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎన్నికల గురించి మరిచిపోయిన అదికారులు దాదాపుగా 17 నెలలుగా దామరంచ సింగిల్ విండోకు ఎన్నికలు జరపకుండా, అటు విచారణ సైతం పూర్తి చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తుండటంపై దామరంచ గ్రామ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్వాకంపై రైతులు మండిపడుతున్నారు. త్వరితగతిన విచారణ జరిపించి దామరంచ సింగిల్ విండోకు ఎన్నికలు జరపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ముల మృతి
బీర్కూర్, న్యూస్‌లైన్: బతికున్నంత కాలం కలిసిమెలిసి ఉన్న ఆ అన్నదమ్ములను మృత్యువు ఒకేసారి తీసుకెళ్లింది. బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన మాడబోయిన గంగరాజులు, సాయిప్రసాద్ ఆదివారం తెల్లవారుజామున జిల్లా కేంద్రంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి చెందారు. మృతుల బంధువులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బీర్కూర్ గ్రామానికి చెందిన సత్యం, నిర్మల దంపతులకు ఇద్దరు కుమారులు. వారిలో గంగరాజులు(28) పెద్దవాడు. సాయిప్రసాద్ (21) చిన్నవాడు. గంగరాజులుకు 7 నెలల క్రితం గాంధారి మండలం గండివేట్ గ్రామానికి చెందిన ప్రియాంకతో వివాహం జరిగింది. ఆమె ప్రస్తుతం ఐదు నెలల గర్భిణి. ప్రతినెల మాదిరిగా శనివారం గంగరాజులు తండ్రి సత్యం ప్రియాంకను జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి నెలవారి చెకప్‌కు తీసుకెళ్లాడు. అయితే అత్యవసరం కావడంతో శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో తండ్రి నుంచి ఫోన్ రావడంతో అన్నదమ్ములు తెలిసినవారి మోటర్‌సైకిల్ తీసుకుని నిజామాబాద్ వెళ్లారు. ఈక్రమంలో జిల్లా కేంద్రంలోని టూ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వాహనం వారిని ఢీకొంది. దీంతో మోటార్‌సైకిల్‌పై ఉన్న సాయిప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. అపస్మారక స్థితిలో ఉన్న గంగరాజులును జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స నిర్వహించేలోపే మృతి చెందాడు. దీంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను బీర్కూర్‌కు తీసుకెళ్లారు. అన్నదమ్ములు ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.