బీర్కూర్ : నవ మాసాలు మోసి కని పెంచిన తల్లినే క్షణికావేశంలో బండతో మోది కడతేర్చాడు ఓ కర్కశ కొడుకు. దురలవాట్లకు బానిసై, వాటికోసం చేసిన అప్పులు తీర్చలేక, దంపతుల మధ్య జరుగుతున్న గొడవను ఆపేందుకు ప్రయత్నించిన తల్లిపై బండరాయితో దాడిచేశాడు. ఎస్సై రాజ్‌భరత్ రెడ్డి కథనం ప్రకారం.
జిల్లాలోని బీర్కూరు మండలం దుర్కి గ్రామానికి చెందిన మేతిరి బశెట్టి, తన తల్లి పోశవ్వ (65)తో కలిసి ఎస్సీ కాలనీలో నివసిస్తున్నారు. రెండేళ్ల క్రితం మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన సవితతో బశెట్టికి వివాహమైంది. తరచూ భార్య భర్తలు గొడవ పడుతుండేవారు. 15 రోజుల క్రితం సవిత భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయి తిరిగి బుధవారం దుర్కి గ్రామానికి వచ్చింది. రాత్రి మళ్లీ భార్యభర్తలు గొడవ పడ్డారు.
దీంతో తాను ఆత్మహత్య చేసుకుంటానని బశెట్టి బయటకు వెళ్లి విద్యుత్ తీగను పట్టుకోవడంతో పాటు తలను బండకేసి మోదుకోగా తల్లి అడ్డుపడింది. దీంతో ‘నీ వల్లే మా మధ్యలో గొడవలవుతున్నాయని’ కోపోద్రిక్తుడైన బశెట్టి ఇంటి వద్ద నున్న బండరాయితో తల్లిని మోది తీవ్రంగా గాయపర్చాడు. గమనించిన కూతురు రజిత వెంటనే 108కు సమాచారం అందించగా, పోచవ్వను వెంటనే బాన్సు వాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆమె అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.
కన్న తల్లిని కడతేర్చిన కర్కశ కొడుకు
Published Fri, Nov 7 2014 2:53 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement