బీర్కూర్, న్యూస్‌లైన్: బతికున్నంత కాలం కలిసిమెలిసి ఉన్న ఆ అన్నదమ్ములను మృత్యువు ఒకేసారి తీసుకెళ్లింది. బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన మాడబోయిన గంగరాజులు, సాయిప్రసాద్ ఆదివారం తెల్లవారుజామున జిల్లా కేంద్రంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి చెందారు. మృతుల బంధువులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బీర్కూర్ గ్రామానికి చెందిన సత్యం, నిర్మల దంపతులకు ఇద్దరు కుమారులు. వారిలో గంగరాజులు(28) పెద్దవాడు. సాయిప్రసాద్ (21) చిన్నవాడు. గంగరాజులుకు 7 నెలల క్రితం గాంధారి మండలం గండివేట్ గ్రామానికి చెందిన ప్రియాంకతో వివాహం జరిగింది.
ఆమె ప్రస్తుతం ఐదు నెలల గర్భిణి. ప్రతినెల మాదిరిగా శనివారం గంగరాజులు తండ్రి సత్యం ప్రియాంకను జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి నెలవారి చెకప్‌కు తీసుకెళ్లాడు. అయితే అత్యవసరం కావడంతో శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో తండ్రి నుంచి ఫోన్ రావడంతో అన్నదమ్ములు తెలిసినవారి మోటర్‌సైకిల్ తీసుకుని నిజామాబాద్ వెళ్లారు. ఈక్రమంలో జిల్లా కేంద్రంలోని టూ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వాహనం వారిని ఢీకొంది. దీంతో మోటార్‌సైకిల్‌పై ఉన్న సాయిప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. అపస్మారక స్థితిలో ఉన్న గంగరాజులును జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స నిర్వహించేలోపే మృతి చెందాడు. దీంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను బీర్కూర్‌కు తీసుకెళ్లారు. అన్నదమ్ములు ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ముల మృతి
Published Mon, Oct 28 2013 4:02 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement