పాడేరు, న్యూస్‌లైన్: కుండపోతగా వర్షాలతో మన్యం అతలాకుతలమైంది. ఆరు రోజులుగా జనజీవనం స్తంభించింది. ఏజెన్సీ రైతులకు అపార నష్టం వాటిల్లింది. ప్రధాన గెడ్డలు, కొండవాగులు ఉధృతంగా పొంగి ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల ఆర్ అండ్ బీ రోడ్లు శిథిలమయ్యాయి. మారుమూల తండాలకు వెళ్లే మట్టి రోడ్లు కోతకు గురయ్యాయి. పంట పొలాలు నీటముని గాయి. మత్స్యగెడ్డ, రాళ్లగెడ్డ, బొయితిలి గెడ్డ, చాపరాయిగెడ్డ పొంగి ప్రవహిస్తుండడంతో సుమారు 100 మారుమూల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఖరీఫ్ అనుకూలించడంతో కోతదశకు వచ్చిన వరి, చిరుధాన్యాలైన చోడి, సామ, కొర్ర పంటలు తుడుచుపెట్టుకుపోయాయి.
వాణిజ్యపంట రాజ్‌మాకు పూతదశలో నీరు అధికమై మొక్కలు కుళ్లిపోతున్నాయి. మెట్ట ప్రాంతాల్లోని పంటలకు పెద్దగా నష్టం లేనప్పటికీ లోతట్టు ప్రాంతాల్లో మాత్రం నష్టం తీవ్రంగా ఉంది. అనంతగిరి, అరకులోయ, పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు మండలాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. కళ్లెదుట నాశనమైన పంటలను చూసి ఆదివాసీ రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. అనంతగిరి మండలంలోని 343 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్టు అధికారులు ధ్రువీకరించారు.
అరకులోయలో 171 ఎకరాల్లో వరి, 217 ఎకరాల్లో చోడి, 57.04 ఎకరాల్లో రాజ్‌మా, 19.14 ఎకరాల్లో క్యాబేజీ పంటలకు నష్టం వాటిల్లింది. డుంబ్రిగుడ మండలంలో 220 ఎకరాల్లో వరి పంట, 120 ఎకరాల్లో చోడిపంట, జీకే వీధి మండలంలో 280 హెక్టార్లలో వరి పంట, 270 హెక్టార్లలో చోడి, 61 హెక్టార్లలో సామ, 50 హెక్టార్లలో కొర్ర, 400 హెక్టార్లలో రాజ్‌మా, 20 హెక్టార్లలో కాయగూరలు, 20 హెక్టార్లలో అల్లం పంటలు నాశనమయ్యాయి.జి.మాడుగుల, చింతపల్లి, మండలాల్లో కూడా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
జి.మాడుగుల ప్రాంతంలోని సొలభం, గడుతూరు, పెదలోచలి, నుర్మతి, బీరం పంచాయతీల్లో కొండవాగులన్ని ఉధృతంగా ప్రవహించడంతో అనేక చోట్ల వరి పంట కొట్టుకుపోయింది. పలుచోట్ల కోత దశలో ఉన్న పంట నేలవాలడంతో గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏజెన్సీ వ్యాప్తంగా అన్ని మండలాల్లో పంట నష్టాన్ని అంచనా వేసేందుకు రెవెన్యూ యంత్రాంగం రంగంలో దిగింది. వీఆర్వోల ద్వారా పంట నష్ట నివేదికను ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు.
గిరిసీమకు గుండెకోత
Published Sun, Oct 27 2013 3:27 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
Advertisement