బతుకమ్మ ఆటకు స్థలం లేదు! | Bathukamma not the place to play! | Sakshi
Sakshi News home page

బతుకమ్మ ఆటకు స్థలం లేదు!

Published Fri, Sep 19 2014 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 1:35 PM

బతుకమ్మ ఆటకు స్థలం లేదు!

బతుకమ్మ ఆటకు స్థలం లేదు!

  • కబ్జా గుప్పిట చారిత్రక గుట్ట
  • సహకరిస్తున్న  రెవెన్యూ యంత్రాంగం
  • మౌనముద్రలో టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు
  • తెలంగాణ పల్లె ఆత్మను ప్రతిబింబించే సద్దుల బతుకమ్మ  జిల్లాలో వైభంగా జరుగుతుంది. హన్మకొండ పద్మాక్షి గుట్ట వద్ద జరిగే సద్దుల బతుకమ్మ ఉత్సవాలను చూసి తీరాల్సిందే. రాష్ట్రంలో సద్దుల బతుకమ్మ అంటే.. పద్మాక్షి గుట్ట అనే అభిప్రాయం ఉంది. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత తొలి బతుకమ్మ పండుగ దగ్గరకు వస్తోంది. అయితే, వరంగల్‌లో సద్దుల బతుకమ్మ ఆడే స్థలం మాత్రం కరిగిపోతోంది. ప్రసిద్ధిగాంచిన పద్మాక్షి గుట్ట ఇప్పుడు కబ్జా కోరల్లో చిక్కుకుంది.
     
    సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ నగరంలోని భూ ఆక్రమణదారులు పద్మాక్షి గుట్టకు గురిపెట్టారు. ఇప్పటికే గుట్ట చుట్టూ స్థలం చాలావరకు ప్రైవేటు పరమైంది. తెలంగాణలో జరగనున్న తొలి బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని టీఆర్‌ఎస్ ప్రభుత్వం చెబుతుంటే.. ప్రతిష్టాత్మక స్థలం పరాధీనమవుతున్నా టీఆర్‌ఎస్‌కు చెందిన ఎంపీలుగానీ, ఎమ్మెల్యేలు గానీ పట్టించుకోవడం లేదు.

    ఈ విషయంలో రెవెన్యూ అధికారులు ఉదాసీనంగా ఉండడం ఆరోపణలకు తావిస్తోంది. వరంగల్ నగరం విస్తరించి జనాభా పెరుగుతుండడంతో మారుమూల ప్రాంతాల్లోనూ స్థలాల ధరలు పెరిగాయి. హన్మకొండలోని పద్మాక్షి గుట్ట ప్రాంతం పరిస్థితి ఇలాగే ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం 898 సర్వే నెంబరులో పద్మాక్షి గుట్ట, 78.03 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ప్రభుత్వం గతంలో 83 మందికి 80, 60 గజాల చొప్పున ఇళ్ల స్థలాలను కేటాయించింది. ప్రభుత్వం కేటాయించిన భూములు మినహా మిగిలిన భూమి ఎంత ఉంటుందనేది రెవెన్యూ అధికారులు స్పష్టం చేయడం లేదు.

    రాజకీయంగా పలుకుబడి ఉన్న పలువురు నాయకులు, వారి అనుచరులు ఇష్టారాజ్యంగా భూములను కబ్జా చేస్తున్నారు. రెవెన్యూ అధికారుల సహకారంతో గుట్టను, చుట్టుపక్క భూములను సొంతం చేసుకుంటున్నారు. గుట్టకు సమీపంలోని ప్రైవేటు వ్యక్తుల పట్టా భూములను చూపి... ఆ పక్కన ఉండే ప్రభుత్వ భూముల్లోనూ కట్టడాలు మొదలుపెడుతున్నారు. ప్రతిష్టాత్మక భూములు కావడంతో నేరుగా ప్రైవేటు నిర్మాణాల జోలికి పోవడం లేదు.

    మొదట దేవుళ్ల రూపాలను పెట్టి ఆ పక్కన ఉండే స్థలాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. మరికొందరు దేవుళ్ల పేరిట సంస్థలు స్థాపించి.. రెవెన్యూ అధికారుల సహకారంతో తర్వాత సొంతం చేసుకుంటున్నారు. ఇటీవలి వరకు అధికారంలో ఉన్న పార్టీకి చెందిన నేతలు, వారి అనుచరులు ఇన్నాళ్లు గుట్టను సొంతం చేసుకున్నారు. ఇతర పార్టీ నేతలు కొందరు శ్మశానాన్ని సైతం ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. అప్పుడు చోద్యం చూసిన రెవెన్యూ ఉన్నతాధికారులు ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు.
     
    ఇలా జరుగుతోంది...

    పద్మాక్షి గుట్ట ఉన్న 898 సర్వే నెంబరులో కొంత భాగం ఖాళీగా ఉంది. మూడేళ్ల క్రితమే కొందరు ఈ స్థలంలో చిన్న గుడి నిర్మాణాన్ని మొదలుపెట్టారు. దీన్ని గమనించిన రెవెన్యూ అధికారులు మొదట అడ్డుకున్నారు. ఆ తర్వాత కబ్జాదారులకు సహకరించారు. వెంటనే గుడి నిర్మాణం పూర్తయింది.
     
    పద్మాక్షి గుట్ట పరిధిలో గల ప్రభుత్వ స్థలాలు ఆక్రమణ పెరిగింది. ప్రభుత్వ స్థలాలకు హద్దులు గుర్తించి పాతిన రాళ్ళను తొలగించారు. గుడి వెనుకాల గల గుట్టను కొల్లగొడుతున్నారు. రెండు ఇళ్ల నిర్మాణాలు చేపట్టేంత మేరకు చదును చేశారు. గుట్టను ఆనుకుని ఉన్న పట్టా స్థలాలకు, ప్రభుత్వ స్థలాల సరిహద్దులో కొత్తగా గుడి, విగ్రహాలు పెడుతున్నారు. దీన్ని ఆసరగా చేసుకుని గుట్టను, గుట్ట స్థలాన్ని కబ్జా చేస్తున్నారు. ఇది ఇలానే కొనసాగితే.. కొన్నాళ్లలో పద్మాక్షి గుట్ట మొత్తం కరిగిపోయే ప్రమాదం ఉంది.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement