‘ఫిల్టర్’ మాఫియా! | Random soil excavation | Sakshi
Sakshi News home page

‘ఫిల్టర్’ మాఫియా!

Published Tue, Aug 11 2015 2:19 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM

‘ఫిల్టర్’ మాఫియా! - Sakshi

‘ఫిల్టర్’ మాఫియా!

యథేచ్ఛగా మట్టి తవ్వకాలు, కృత్రిమ ఇసుక తయారీ
- శామీర్‌పేట్ మండలంలో తిష్టవేసిన ఇసుక దొంగలు
- నిత్యం వందలాది లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలింపు
- సహజ సంపదను దోచుకుంటున్న బడాబాబులు
- చూసీచూడనట్లుగా రెవెన్యూ యంత్రాంగం
తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత.. దోచుకున్నోళ్లకు దోచుకున్నంత. కృత్రిమ ఇసుక తయారీకి.. మట్టి తవ్వకాల అక్రమార్కులకు శామీర్‌పేట్ మండలం అడ్డాగా మారింది. వారికి అధికారులే అండగా ఉండడంతో ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా మారింది. వీరి వ్యాపారం మూడు ట్రాక్టర్లు, ఆరు లారీలుగా వర్ధిల్లుతోంది. ఫిల్టర్ ఇసుక, మట్టిని అక్రమంగా తరలించే వాహనాలకు జరిమానాలు కలెక్టర్ కార్యాలయం నుంచే విధిస్తారని.. ఈ విషయంలో తమకేమీ తెలియదని చెబుతుండడమే ఈ వ్యవహారంలో అధికారుల పాత్ర ఏమిటో చెప్పకనే చెబుతోంది. ఇప్పటివరకు ఎన్ని వాహనాలు సీజ్ చేశారు. ఎంత మొత్తం జరిమానాల రూపంలో ఆదాయం వచ్చింది. ఎంత మందిపై కేసులు నమోదు చేశారు అనే వివరాలు రెవెన్యూ కార్యాలయంలో లేవనే సమాధానమే వారి నుంచి వస్తోందంటే.. అక్రమాల పుట్ట ఎంతగా పెరిగి విస్తరించిందో ఇట్టే అవగతమవుతోంది.
 
శామీర్‌పేట్/కీసర/మేడ్చల్ :
శామీర్‌పేట్ మండలంలోని ఉద్దమర్రి, శామీర్‌పేట్ పెద్ద చెరువు, మూడుచింతలపల్లి, లక్ష్మాపూర్, ఆద్రాస్‌పల్లి, కేశవరం, ఎల్లగూడ, ఉషార్‌పల్లి, నారాయణపూర్, అనంతారం, అలియాబాద్ తదితర గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ భూములనే తేడా లేకుండా మట్టి తవ్వకాలు, కృత్రిమ ఇసుక తయారీ జోరుగా కొనసాగుతున్నాయి. రాత్రి వేళల్లో వందల సంఖ్యలో లారీల్లో మట్టి, కృత్రిమ ఇసుక తర లిస్తున్నారు. ప్రధానంగా ఉద్దమర్రి అలియాబాద్ శామీర్‌పేట్ పెద్ద చెరువు, ఎల్లగూడెం తదితర గ్రామాల నుంచి వందల సంఖ్యల్లో లారీలు రాజీవ్ రహదారి గుండా, ఉద్దమర్రి నుంచి కీసర మీదుగా వీటి రవాణా కొనసాగుతోంది. అధికారులు మాత్రం తూతూమంత్రంగానే దాడులు చేస్తున్నారు.

నామమాత్రంగా జరిమానాలు విధిస్తున్నారు. మట్టి అక్రమ తవ్వకాలపై నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ సెలవు దినాల్లో మట్టి వ్యాపారులకు పండగనే. అక్రమ సంపాదనకు అలవాటు పడిన వ్యాపారులు కాసుల కక్కుర్తితో చెరువులు, కుంటల్లో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. వాటి రూపురేఖలనే మార్చివేస్తున్నారు. రాత్రింబవళ్లూ కృత్రిమ ఇసుక తయారీ చేస్తున్నారు. చెరువులు, కుంటల్లో భారీ గుంతలు ఏర్పడటంతో అమాయకులు వాటిలో పడి మృతిచెందిన సంఘటనలు కూడా ఉన్నాయి. ప్రజలు ప్రాణాలకు ముప్పుతెస్తున్న అక్రమ మట్టి, ఇసుక తవ్వకాలపై అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  
 
బీడులుగా పచ్చని పొలాలు..

అక్రమార్కుల మట్టి తవ్వకాలతో పచ్చని పంట పొలాలు బీడులుగా మారుతున్నాయి. డబ్బు ఆశ చూపుతూ వ్యవసాయ భూముల్లో మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. పట్టా భూముల్లో సైతం వాస్తు దోషం ఉందని నేల మట్టం చేయాల్సిన అవసరం ఉందని, పక్క భూములకన్నా ఎత్తు, లోతు ఉందని రకరకాల కారణాలతో అమాయకులకు డబ్బుల ఎర చూపిస్తున్నారు. మట్టి తవ్వి తీసుకెళ్తున్నారు. ఎకరానికి లక్షల్లో చెల్లించి పట్టా భూముల్లో సైతం మట్టి, ఇసుక దందా కొనసాగిస్తున్నారు. రెవెన్యూ అధికారులు మాత్రం ఈ అక్రమ తవ్వకాలపై ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
 
నిత్యం వందలాది లారీల్లో..
కృత్రిమ ఇసుకను రాత్రి 12 నుంచి తెల్లవారుజామున 4గంటల వరకు లారీల్లో తరలిస్తున్నారు. ఉద్దమర్రి మీదుగా బొమ్మలరామారం, అంకిరెడ్డిపల్లి, కీసర కుషాయిగూడ ప్రాంతాల మీదుగా నగరానికి ఇవి చేరుకుంటున్నాయి. మరోవైపు జమీలాల్‌పేట్ బర్షిగూడెం, బోగారం, కొండాపూర్, ఘట్‌కేసర్ మీదుగా, ఉప్పల్, ఎల్‌బీ నగర్, దిల్‌సుఖ్‌నగర్ తదితర ప్రాంతాలకు చేరుతున్నాయి. రాత్రి వేళల్లో అక్రమంగా తరలించే క్రమం లో వేగంగా వెళ్తున్న లారీలతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయిని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గస్తీ నిర్వహించే పోలీసులు లారీలను పట్టుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారనే విమర్శలున్నాయి.

లారీ యజమానులు పోలీసులకు అమ్యామ్యాలు ఇస్తూ తమ పని కానిచ్చేస్తున్నారు.  మేడ్చల్ మండలంలోని రావల్‌కోల్, సోమారం, రాజబొల్లారం, ఘన్‌పూర్, బండమాదారం, శ్రీరంగవరం గ్రామాల్లో ఫిల్టర్ ఇసుక తయారు చేస్తున్నారు. మేడ్చల్ అడ్డాపై విక్రయించడంతో పాటు నగరానికి లారీల్లో తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నారెవెన్యూ అధికారులు కంటితుడుపు చర్యలకే పరిమితమవుతున్నారు. అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. రెవెన్యూ యంత్రాంగం మామూళ్ల యావలో పడి చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటంతోనే ఈ అక్రమ దందా యథేచ్ఛగా కొనసాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
అక్రమ తవ్వకాలు వాస్తవమే..

మండలంలో మట్టి కృత్రిమ ఇసుక స్థావరాలపై దాడులు చేస్తున్నాం. కేసులు నమోదు చేస్తున్నాం. మట్టి, కృత్రిమ ఇసుక తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో ప్రత్యేక నిఘాతో వాహనాలను సీజ్ చేశాం. వాటి యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేశాం. మండలంలో మట్టి అక్రమ తవ్వకాలు వాస్తవమే.
- దేవుజా, శామీర్‌పేట్ తహసీల్దార్
 
కీసర మీదుగా నగరానికి ఫిల్టర్ ఇసుక రవాణా..

ఇసుక  వ్యాపారులు నల్గొండ జిల్లా పరిధిలోని వివిధ గ్రామాల్లో ఫిల్టర్ ఇసుక కేంద్రాలను నెలకొల్పి దందాను కొనసాగిస్తున్నారు. ఆ జిల్లాలోని బొమ్మల రామారం మండలం చీకటిమామిడి, జలాల్‌పూర్. కేశపూర్, బండకాడిపల్లి, జమీలాల్‌పేట్, భాషినగర్, కేశపూర్, రామలింగంపల్లి శివారు ప్రాంతం, జేనపల్లి తదితర గ్రామాల నుంచి శామీర్‌పేట్ పెద్దచెరువు వాగు ఇరువైపులా భారీ ఎత్తున ఇసుక ఫిల్టర్ల నిర్వహణ కొనసాగిస్తున్నారు. ఇక్కడి నుంచి వివిధ మార్గాల్లో ఇసుకను లారీల్లో నగరంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తూ.. వ్యాపారులు లక్షల్లో ఆర్జిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement