Soil excavation
-
లంకలను ముంచిన మట్టి తవ్వకాలు
కృష్ణా నది గట్టుకు గండి పడి గ్రామాలను ముంచెత్తిన వరద ముంపులో బాపట్ల జిల్లాలోని 27 లంక గ్రామాలు వేలాది ఎకరాల వాణిజ్య పంటల మునక జనజీవనం అతలాకుతలం భట్టిప్రోలు మండలం పెదపులివర్రు వద్ద కరకట్టపైకి నీరు ఏ క్షణమైనా కరకట్టకు గండిపడే ప్రమాదం ఇదే జరిగితే జలదిగ్బంధంలో చిక్కుకోనున్న రేపల్లె సాక్షి ప్రతినిధి, బాపట్ల: కూటమి నేతల అక్రమార్జన బాపట్ల జిల్లాలో 27 లంక గ్రామాల ప్రజలకు తీరని కష్టాలు తెచి్చపెట్టింది. తమ జేబులు నింపుకునేందుకు టీడీపీ, జనసేన పార్టీ నేతలు యథేచ్ఛగా కృష్ణానది సమీపంలో అక్రమంగా ఇసుక, మట్టి తవ్వకాలు చేపట్టడం కొంపముంచింది. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం పెసర్లంక అరవింద వారధి సమీపంలో కూటమి నేతల అక్రమ ఇసుక, మట్టి తవ్వకాల వల్ల కృష్ణానది గట్టు వరదకు ముందే బలహీనపడింది. గత రెండు రోజులుగా వరద పెరిగి సోమవారం సాయంత్రానికి దాదాపు 12 లక్షల క్యూసెక్కులకు చేరడంతో అరవింద వారధి సమీపంలో కృష్ణానదికి గండి పడింది. దీంతో కొల్లూరు మండలంలోని పెసర్లంక, చిలుమూరులంక, సుగ్గునలంక, ఈపూరులంక, చింతర్లంక, పెదలంక, ఆవులవారిపాలెం, గాజుల్లంక, పోతార్లంక, తిప్పలకట్ట, కిష్కింధపాలెం, తడికలపూడి, జువ్వలపాలెం తదితర 22 గ్రామాలతోపాటు భట్టిప్రోలు మండలంలోని చింతమోటు, పెదలంక, పెసర్లంక, పల్లెపాలెం, రేపల్లె మండలంలోని పెనుమూడి పల్లెపాలెం కలిపి మొత్తం 27 గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. ఈ గ్రామాల్లో 60 శాతం ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి. మరో 30 శాతం ఇళ్లల్లోకి నీరు చేరింది. ఈ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులపైన వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆయా గ్రామాల్లో ప్రజలు డాబాలపైకి ఎక్కారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 40 శాతం మందికి కూడా చేరని ఆహారం.. లంక గ్రామాలను ముంచెత్తిన వరదనీరు జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. బోట్ల ద్వారా ప్రభుత్వ యంత్రాంగం పంపుతున్న తాగునీరు, ఆహారం పట్టుమని 40 శాతం మందికి కూడా అందలేదు. డాబాలపైన వంట చేసుకుందామన్నా మంచినీరు అందుబాటులో లేదు. వరదలో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సరిపడా బోట్లు లేక అధికారులు మిన్నకుండి పోయారు. ఉన్నవారిని కూడా బయటకు తీసుకురాలేని దుస్థితి నెలకొంది. ఇక చాలా పశువులు నీటిలో కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు ఒక్క చిలుమూరు లంక నుంచి మాత్రమే కొద్దిమంది గ్రామస్తులను పునరావాస కేంద్రానికి తరలించారు. వరద ప్రాంతాలకు స్థానిక పోలీసులతోపాటు జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు చేరుకున్నాయి. జిల్లా కలెక్టర్ వెంకట మురళి, ఎస్పీ తుషార్ డూడిలు కొల్లూరులోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.రైతులకు భారీ దెబ్బ.. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాలైన కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లోని లంక గ్రామాల్లో భారీ ఎత్తున పసుపు, అరటి, మొక్కజొన్న, కంద, తమలపాకులు, బొప్పాయి, జామ, కొబ్బరి, కూరగాయలు తదితర వాణిజ్య, ఉద్యాన పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఇప్పుడు వరదకు ఈ రెండు మండలాల్లోని వేలాది ఎకరాల పంటలు నీటమునిగాయి. వాణిజ్య పంటలు రోజుల తరబడి నీటిలో నానడంతో పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. దీంతో తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.రేపల్లె పట్టణానికి పొంచి ఉన్న ప్రమాదం.. వరద ఉధృతికి భట్టిప్రోలు మండలం పెదపులివర్రు వద్ద కృష్ణా కరకట్టపైకి నీరు చేరుతోంది. దీంతో అధికారులు, గ్రామస్తులు అప్రమత్తమై మట్టి, ఇసుక సంచులు వేసి కట్టకు గండిపడకుండా ప్రయత్నిస్తున్నారు. రావి అనంతవరం గ్రామం వద్ద కరకట్ట నుంచి నీరు లీకు అవుతుండటంతో అధికారులు చర్యలు చేపట్టారు. వరద మరింత పెరిగితే ఆయా ప్రాంతాల్లో కరకట్టకు గండి పడే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే వరద ఉధృతికి భట్టిప్రోలు, రేపల్లె పట్టణం నీట మునగొచ్చని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎక్కడా కనిపించకపోవడంపై తీవ్రవిమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మట్టి అక్రమ తవ్వకాలే గండికి కారణం కృష్ణా నదికి తొలిరోజు ఆదివారం 8.79 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో పెసర్లంక సమీపంలోని అరవింద వారధి వద్ద కృష్ణానది గట్టుకు భారీ గండి పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ, జనసేన నేతలు నదికి ఇరువైపులా పెద్ద ఎత్తున అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపారు. దీంతో నది గట్లు, కరకట్ట రోజురోజుకు బలహీనపడుతూ వచ్చాయి. కరకట్ట దెబ్బతినకుండా చూడాల్సిన కృష్ణా నది పరిరక్షణ విభాగం ఏమాత్రం పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. అక్రమ తవ్వకాలు అడ్డుకుని.. దెబ్బతిన్న కట్టను బలోపేతం చేయాల్సి ఉన్నా ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో కృష్ణానది ఒడ్డు కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె ప్రాంతాల్లో మరింత బలహీనంగా మారింది. చాలా చోట్ల పూర్తిగా దెబ్బతింది. ఇలాగే 2009 అక్టోబర్ 6న కరకట్ట తెగిపోయి రేపల్లె పట్టణం నీటిలో మునిగింది. అప్పట్లో 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరదనీరు వచి్చంది. ప్రస్తుతం కేవలం 8.79 లక్షల క్యూసెక్కుల వరదకే అరవింద వారధి వద్ద మరోమారు గండిపడింది. ఇప్పటికైనా కృష్ణా కరకట్టలో అక్రమ మట్టి తవ్వకాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
అడ్డగోలు తవ్వకాలు
సాక్షి, ప్రకాశం : అక్రమార్కుల ఆగడాలకు ఏ ఒక్కటీ మినహాయింపు కాదు అన్నట్లు తయారైంది. కాంట్రాక్టర్లు అనుమతులకు మించి మట్టి తవ్వకాలు సాగిస్తూ ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీకి గండికొడుతున్నారు. నాగులుప్పలపాడు మండల పరిధిలో 3వ రైల్వే లైన్ నిర్మాణ పనుల అంచనాల్లో మట్టి, ఇసుక, ఎర్ర గ్రావెల్ తరలించేందుకు మైనింగ్ శాఖకు రాయల్టీ చెల్లించి సంబంధిత అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంది. అయితే అనుమతి గోరంత, తవ్వుకునేది కొండంత అన్నట్లు ఉంది కాంట్రాక్టర్ల వాలకం. మైనింగ్ శాఖ నుంచి అమ్మనబ్రోలు రెవెన్యూ పరిధిలో అనుమతులు తీసుకొన్న కాంట్రాక్టర్ రాపర్ల రెవెన్యూ పరిధిలోని చవటపాలెం, రాపర్ల గ్రామాల్లో చాలా మేరకు అనధికారికంగా ఈ తవ్వకాలు చేపట్టారు. రైల్వే పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ గుట్టు చప్పుడు కాకుండా రాత్రి సమయాల్లో పొక్లెయిన్ల సాయంతో మట్టి, ఎర్ర గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తూ, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండికొడుతున్నాడు. ఈ తంతు కొన్ని రోజులుగా జరుగుతున్నా అధికారులెవ్వరూ ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. అక్రమ తవ్వకాల విషయం కలెక్టర్ దృష్టికి రావడంతో సంబంధిత అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికీ ఎవ్వరూ స్పందించకపోవడం, అధికారులు మామూళ్లు పుచ్చుకొనే ఆ వైపు వెళ్లడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇదీ వాస్తవం.. గ్రామ సరిహద్దులోని ప్రాంతాల్లో అయితే 3 క్యూబిక్ మీటర్ల లోతుకి మించి తవ్వకాలు చేపట్టడానికి వీలులేదు. అయితే అనుకున్నదే తడవుగా సదరు కాంట్రాక్టర్ సుమారు 8 క్యూబిక్ మీటర్ల లోతున తవ్వకాలు చేపట్టారు. దీంతో మట్టి తీసిన చెరువులో భూగర్భ జలాలు కూడా బయట పడ్డాయి. భవిష్యత్‌లో ఈ కుంటల వలన చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. దీంతో పాటు మట్టి తవ్వకం చేపట్టిన పొలాలకు దగ్గర్లోని రైతులు తమ పొలాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాసుల కోసమే కక్కుర్తి.. గుంటూరు నుంచి నెల్లూరు జిల్లా వరకు రైల్వే 3వ లైన్ పనులు జిల్లాలో వేగంగా జరుగుతున్నాయి. ఈ పనులకు కొంత మేరకు అనుమతులు తీసుకొని రాపర్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 112, 114 లో కూడా ప్రభుత్వానికి సీనరేజి చెల్లించకుండా కాంట్రాక్టర్ రాత్రి సమయంలో గ్రావెల్, మట్టిని తరలిస్తున్నారు. మండలంలోని అమ్మనబ్రోలు, చవటపాలెం గ్రామాల్లో అక్రమ తవ్వకాలు జరుపుతుండటంతో అక్కడ నివశిస్తున్న గృహ యజమానులు, పశు పోషకులు ఆందోళన చెందుతున్నారు. అధికారికంగా తవ్వకాలు జరిపితే మైనింగ్ శాఖకు చెల్లించే రాయల్టీలో కొంత గ్రామ పంచాయతీకి జమ చేస్తారు. ఈ అక్రమ తవ్వకాలకు అనుమతులు లేకుండా జరుగుతుంటే ఆ ప్రాంత ప్రజా ప్రతిని«ధులు, అధికారులు కన్నెత్తి చూడకపోవడం విశేషం. ఈ విషయంపై మైనింగ్ అధికారులను వివరణ కోరగా రైల్వే కాంట్రాక్టర్ కొద్ది మేర అనుమతులు తీసుకొని స్థాయి దాటి తవ్వకాలు చేస్తుంటే విజిలెన్స్ అధికారులతో విచారణ చేసి గట్టి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. -
అధికారానికి తలొగ్గారు!
అధికార పార్టీ ఆగడాలకు అధికారులు తలొగ్గారు. కళ్లెదుటే అక్రమాలు జరుగుతున్నా ఏమీ కానట్టు వెనుదిరిగారు. రెడ్‌హ్యాండెడ్‌గా గ్రామస్తులు, వైఎస్సార్సీపీ నేతలు పట్టిచ్చినా... ఏవో హడావుడి చేసి చల్లగా జారుకున్నారు. అక్రమానికి అధికారులు వంతపాడటంతో ఇక యథేచ్ఛగా చెరువులో మట్టితవ్వకాలు జరిపేసి తరలించేశారు. అన్నంరాజుపేట (జామి): మండలంలో అన్నంరాజుపేట గ్రామంలో పద్మనాభరాజు చెరువులోని మట్టిని అక్రమంగా స్థానిక అధికారపార్టీకి చెందిన నేత, నీటిసంఘం అధ్యక్షుడు వారం రోజులుగా జేసీబీలతో తవ్వేస్తున్నారు. దానిని స్థానిక రైల్వేమూడోలైన్కోసం కోరుకొండవద్దకు, ఇటుకబట్టీ వ్యాపారులకోసం తరలించేస్తున్నారు. ఇష్టానుసారం మట్టి తవ్వేస్తుండటంతో చెరువులో ఎక్కడికక్కడ పెద్దపెద్దగోతులు ఏర్పడి ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని రైతులు,తదితరులు స్థానిక వైఎస్సార్సీపీ నేతల దృష్టికి తీసుకెళ్లడంతో మంగళవారం అర్ధరాత్రి సమయంలో దాడులు చేపట్టి, అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఏడు లారీలను అడ్డుకున్నారు. జేసీబీకి కూడా అడ్డుకుని తవ్వకాలు నిలుపుదల చేశారు. బుధవారం ఉదయం వరకూ కాపలా ఉండి రెవెన్యూ, మైనింగ్, మైనింగ్ విజిలెన్స్, పోలీస్, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. బుధవారం మైనింగ్ విజిలెన్స్ అధికారి సునీల్‌బాబు తదితర సిబ్బంది, జామిపోలీసులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ పైడిరాజు సంఘటన స్థలానికి వచ్చి జరిగిన తవ్వకాలపై ఆరాతీశారు. హడావుడిగా మట్టితవ్వినచోట కొలతలు కొలిచారు. లారీనంబర్లును రాసుకున్నారు. రెవెన్యూ అధికారులు పంచనామా కూడ చేశారు. తరువాత అధికార పార్టీనేతల ఒత్తిడితో అధికారులంతా చల్లగా జారుకున్నారు. దీంతో గ్రామస్తులు నివ్వెరపోయారు. తమకు ఎలాంటి సంబంధం లేదంటూ ఒక్కొక్కరు తప్పించుకున్నారు. అధికారులు తొత్తులుగా మారారు: వైఎస్ఆర్సీపీ నేతలు: అధికారులు పాలక పార్టీనేతలకు తొత్తులుగా మారారని, చెరువులో గోతులు పెట్టడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని వాపోయారు. అధికారపార్టీ నేతలు మట్టిని అమ్మకాలుచేసుకుంటున్న విషయం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నా అధికారులు తమకేం సంబంధం లేదంటూ వెనుదిగడం దారుణమన్నారు. ఈ తవ్వకాలను నీరు-చెట్టు పథకంలో పెడితే న్యాయపోరాటం చేస్తామని వైఎసార్సీపీ నేతలు ముకుందశ్రీను, చెల్లూరి సూర్యనారాయణ, కంటుభుక్త రాము, తదితరులు తెలిపారు. చెరువు అభివృద్ధికే మట్టి తరలింపు చెరువును అభివృద్ధి చేయాలనే అందులోని మట్టిని తీసివేయడానికి అంగీకరించామని దేశంపార్టీ నేత జె.ఏ.చానల్ నీటిసంఘం అధ్యక్షుడు ఎన్నింటి అప్పలరాజు, అతని అనుచరులు, రైతులు తెలిపారు. ప్రభుత్వమే చెరువు పనుల్ని జేసీబీతో చేయిస్తుంటే తాము చేయడంలో తప్పేంటని ఎదురు ప్రశ్న వేశారు. -
దోపిడే దోపిడీ
తూప్రాన్ : మండలంలో మట్టి అక్రమ దందా జోరుగా సాగుతోంది. సీఎం ఇలాకాలోనే యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్నా అడిగే వారే లేకుండా పోయారు. మండలంలోని కూచారం, ముప్పిరెడ్డిపల్లి గ్రామాల్లో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. కూచారం రైల్వే స్టేషన్ సమీపంలోని చెరువు నుంచి, కాళ్లకల్ గ్రామ సమీపంలోని కొండాపూర్ గ్రామంలో తవ్వకాలు జరుపుతూ పరిశ్రమలకు మట్టిని విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. పట్టపగలే తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. రెవెన్యూ అధికారుల అండదండలు ఉండడంతోనే అక్రమార్కులు రెచ్చిపోతున్నట్టు తెలుస్తోంది. పత్రికల్లో వరుస కథనాలు ప్రచురితమవుతున్నా అధికారులు స్పందించకపోవడంపై జనం భగ్గుమంటున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు స్పందించి అక్రమార్కులకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. చర్యలు తప్పవు వాల్టా చట్టానికి వ్యతిరేకంగా మట్టిని తరలిస్తే చర్యలు తప్పవు. ప్రభుత్వ అనుమతులు పొందిన తర్వాతే తవ్వకాలు జరపాలి. అక్రమంగా మట్టి తరలిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. తమ సిబ్బందిని సంఘటన స్థలానికి పంపి వాహనాలు సీజ్ చేస్తాం. - ముత్యంరెడ్డి, సిద్దిపేట ఆర్డీఓ అనుమతులు తప్పనిసరి.. చెరువులు, కుంటల్లో అనుమతులు లేకుండా తవ్వకాలు జరిపితే చర్యలు తప్పవు. వాల్టా నిబంధనల ప్రకారం అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం. అక్రమంగా మట్టిని తరలిస్తే ఎంతటివారైన ఉపేక్షించే ది లేదు. - శ్రీకాంత్, ఇరిగేషన్ ఏఈ -
‘ఫిల్టర్’ మాఫియా!
యథేచ్ఛగా మట్టి తవ్వకాలు, కృత్రిమ ఇసుక తయారీ - శామీర్‌పేట్ మండలంలో తిష్టవేసిన ఇసుక దొంగలు - నిత్యం వందలాది లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలింపు - సహజ సంపదను దోచుకుంటున్న బడాబాబులు - చూసీచూడనట్లుగా రెవెన్యూ యంత్రాంగం తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత.. దోచుకున్నోళ్లకు దోచుకున్నంత. కృత్రిమ ఇసుక తయారీకి.. మట్టి తవ్వకాల అక్రమార్కులకు శామీర్‌పేట్ మండలం అడ్డాగా మారింది. వారికి అధికారులే అండగా ఉండడంతో ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా మారింది. వీరి వ్యాపారం మూడు ట్రాక్టర్లు, ఆరు లారీలుగా వర్ధిల్లుతోంది. ఫిల్టర్ ఇసుక, మట్టిని అక్రమంగా తరలించే వాహనాలకు జరిమానాలు కలెక్టర్ కార్యాలయం నుంచే విధిస్తారని.. ఈ విషయంలో తమకేమీ తెలియదని చెబుతుండడమే ఈ వ్యవహారంలో అధికారుల పాత్ర ఏమిటో చెప్పకనే చెబుతోంది. ఇప్పటివరకు ఎన్ని వాహనాలు సీజ్ చేశారు. ఎంత మొత్తం జరిమానాల రూపంలో ఆదాయం వచ్చింది. ఎంత మందిపై కేసులు నమోదు చేశారు అనే వివరాలు రెవెన్యూ కార్యాలయంలో లేవనే సమాధానమే వారి నుంచి వస్తోందంటే.. అక్రమాల పుట్ట ఎంతగా పెరిగి విస్తరించిందో ఇట్టే అవగతమవుతోంది. శామీర్‌పేట్/కీసర/మేడ్చల్ : శామీర్‌పేట్ మండలంలోని ఉద్దమర్రి, శామీర్‌పేట్ పెద్ద చెరువు, మూడుచింతలపల్లి, లక్ష్మాపూర్, ఆద్రాస్‌పల్లి, కేశవరం, ఎల్లగూడ, ఉషార్‌పల్లి, నారాయణపూర్, అనంతారం, అలియాబాద్ తదితర గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ భూములనే తేడా లేకుండా మట్టి తవ్వకాలు, కృత్రిమ ఇసుక తయారీ జోరుగా కొనసాగుతున్నాయి. రాత్రి వేళల్లో వందల సంఖ్యలో లారీల్లో మట్టి, కృత్రిమ ఇసుక తర లిస్తున్నారు. ప్రధానంగా ఉద్దమర్రి అలియాబాద్ శామీర్‌పేట్ పెద్ద చెరువు, ఎల్లగూడెం తదితర గ్రామాల నుంచి వందల సంఖ్యల్లో లారీలు రాజీవ్ రహదారి గుండా, ఉద్దమర్రి నుంచి కీసర మీదుగా వీటి రవాణా కొనసాగుతోంది. అధికారులు మాత్రం తూతూమంత్రంగానే దాడులు చేస్తున్నారు. నామమాత్రంగా జరిమానాలు విధిస్తున్నారు. మట్టి అక్రమ తవ్వకాలపై నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ సెలవు దినాల్లో మట్టి వ్యాపారులకు పండగనే. అక్రమ సంపాదనకు అలవాటు పడిన వ్యాపారులు కాసుల కక్కుర్తితో చెరువులు, కుంటల్లో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. వాటి రూపురేఖలనే మార్చివేస్తున్నారు. రాత్రింబవళ్లూ కృత్రిమ ఇసుక తయారీ చేస్తున్నారు. చెరువులు, కుంటల్లో భారీ గుంతలు ఏర్పడటంతో అమాయకులు వాటిలో పడి మృతిచెందిన సంఘటనలు కూడా ఉన్నాయి. ప్రజలు ప్రాణాలకు ముప్పుతెస్తున్న అక్రమ మట్టి, ఇసుక తవ్వకాలపై అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీడులుగా పచ్చని పొలాలు.. అక్రమార్కుల మట్టి తవ్వకాలతో పచ్చని పంట పొలాలు బీడులుగా మారుతున్నాయి. డబ్బు ఆశ చూపుతూ వ్యవసాయ భూముల్లో మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. పట్టా భూముల్లో సైతం వాస్తు దోషం ఉందని నేల మట్టం చేయాల్సిన అవసరం ఉందని, పక్క భూములకన్నా ఎత్తు, లోతు ఉందని రకరకాల కారణాలతో అమాయకులకు డబ్బుల ఎర చూపిస్తున్నారు. మట్టి తవ్వి తీసుకెళ్తున్నారు. ఎకరానికి లక్షల్లో చెల్లించి పట్టా భూముల్లో సైతం మట్టి, ఇసుక దందా కొనసాగిస్తున్నారు. రెవెన్యూ అధికారులు మాత్రం ఈ అక్రమ తవ్వకాలపై ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం వందలాది లారీల్లో.. కృత్రిమ ఇసుకను రాత్రి 12 నుంచి తెల్లవారుజామున 4గంటల వరకు లారీల్లో తరలిస్తున్నారు. ఉద్దమర్రి మీదుగా బొమ్మలరామారం, అంకిరెడ్డిపల్లి, కీసర కుషాయిగూడ ప్రాంతాల మీదుగా నగరానికి ఇవి చేరుకుంటున్నాయి. మరోవైపు జమీలాల్పేట్ బర్షిగూడెం, బోగారం, కొండాపూర్, ఘట్కేసర్ మీదుగా, ఉప్పల్, ఎల్బీ నగర్, దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాలకు చేరుతున్నాయి. రాత్రి వేళల్లో అక్రమంగా తరలించే క్రమం లో వేగంగా వెళ్తున్న లారీలతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయిని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గస్తీ నిర్వహించే పోలీసులు లారీలను పట్టుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారనే విమర్శలున్నాయి. లారీ యజమానులు పోలీసులకు అమ్యామ్యాలు ఇస్తూ తమ పని కానిచ్చేస్తున్నారు. మేడ్చల్ మండలంలోని రావల్కోల్, సోమారం, రాజబొల్లారం, ఘన్పూర్, బండమాదారం, శ్రీరంగవరం గ్రామాల్లో ఫిల్టర్ ఇసుక తయారు చేస్తున్నారు. మేడ్చల్ అడ్డాపై విక్రయించడంతో పాటు నగరానికి లారీల్లో తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నారెవెన్యూ అధికారులు కంటితుడుపు చర్యలకే పరిమితమవుతున్నారు. అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. రెవెన్యూ యంత్రాంగం మామూళ్ల యావలో పడి చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటంతోనే ఈ అక్రమ దందా యథేచ్ఛగా కొనసాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ తవ్వకాలు వాస్తవమే.. మండలంలో మట్టి కృత్రిమ ఇసుక స్థావరాలపై దాడులు చేస్తున్నాం. కేసులు నమోదు చేస్తున్నాం. మట్టి, కృత్రిమ ఇసుక తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో ప్రత్యేక నిఘాతో వాహనాలను సీజ్ చేశాం. వాటి యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేశాం. మండలంలో మట్టి అక్రమ తవ్వకాలు వాస్తవమే. - దేవుజా, శామీర్‌పేట్ తహసీల్దార్ కీసర మీదుగా నగరానికి ఫిల్టర్ ఇసుక రవాణా.. ఇసుక వ్యాపారులు నల్గొండ జిల్లా పరిధిలోని వివిధ గ్రామాల్లో ఫిల్టర్ ఇసుక కేంద్రాలను నెలకొల్పి దందాను కొనసాగిస్తున్నారు. ఆ జిల్లాలోని బొమ్మల రామారం మండలం చీకటిమామిడి, జలాల్పూర్. కేశపూర్, బండకాడిపల్లి, జమీలాల్పేట్, భాషినగర్, కేశపూర్, రామలింగంపల్లి శివారు ప్రాంతం, జేనపల్లి తదితర గ్రామాల నుంచి శామీర్‌పేట్ పెద్దచెరువు వాగు ఇరువైపులా భారీ ఎత్తున ఇసుక ఫిల్టర్ల నిర్వహణ కొనసాగిస్తున్నారు. ఇక్కడి నుంచి వివిధ మార్గాల్లో ఇసుకను లారీల్లో నగరంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తూ.. వ్యాపారులు లక్షల్లో ఆర్జిస్తున్నారు. -
ఎట్టకేలకు మట్టి మాఫియాకు చెక్
* ఆత్మకూరు చెరువు భూమి తవ్వకాల్లో అక్రమాలు * ‘సాక్షి’ కథనాలతో విజిలెన్స్, మైనింగ్ అధికారుల్లో కదలిక * వే బిల్లులు ఇచ్చేందుకు నిరాకరణ * లెసైన్సు రద్దు చేయాలని ప్రభుత్వానికి నివేదిక ఆత్మకూరు (మంగళగిరి రూరల్) : ఆత్మకూరు చెరువు భూమిలోని మట్టి తవ్వకాలకు ఎట్టకేలకు అధికారులు చెక్ పెట్టారు. గత నవంబర్ నుంచి నిర్విరామంగా మట్టిని తవ్వుకుంటూ కోట్ల రూపాయలకు అమ్ముకుని సొమ్ముచేసుకున్న మట్టి మాఫియాకు అధికారులు అనుమతులు నిలిపివేశారు. వే బిల్లులు ఈనెల 20వరకు మాత్రమే వుండడంతో మట్టి రవాణాకు తిరిగి వే బిల్లులు ఇచ్చేందుకు మైనింగ్ అధికారులు నిరాకరించారు. మట్టి అక్రమ తవ్వకాలపై సాక్షి పత్రికలో ప్రచురితమైన పలు కథనాలపై స్పందించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఉన్నతాధికారులను కలసి అక్రమ మట్టి, ఇసుక రవాణాలను అరికట్టాలని కోరారు. ఆ మేరకు విజిలెన్స్, మైనింగ్ అధికారులు మట్టి తవ్వకాలను పరిశీలించారు. అక్రమాలు వాస్తవమేనని నిర్ధారించి సంబంధిత కాంట్రాక్టర్ నుంచి జరిమానా వసూలు చేయడంతో పాటు లెసైన్స్ రద్దుచేయాల్సిందిగా ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఉన్నతాధికారులు ఇచ్చిన వేబిల్లుల వరకు అనుమతులు ఇవ్వాలని, తదుపరి వే బిల్లులు మంజూరు చేయవద్దంటూ ఆదేశాలు జారీఅయ్యాయి. దీంతో మట్టి తవ్వకాలు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి. జిల్లా అధికారులు మట్టితవ్వకాలకు సంబంధించి వే బిల్లులు మంజూరు చేయబోమని, మట్టి రవాణా నిలిచిపోయినట్లేనని చెబుతుంటే.. మండల అధికారులు మాత్రం కాంట్రాక్టర్‌కు 2015 వరకు అనుమతులు వున్నాయని, త్వరలోనే తిరిగి మట్టి తవ్వకాలు కొనసాగించుకోవచ్చని చెప్పడం గమనార్హం! ఈ విషయమై మైనింగ్ ఏడీ జగన్మాథరావును వివరణ కోరగా ఈనెల 20వ తేదీతో వే బిల్లుల కాలపరిమితి అయిపోయిందని, ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చేవరకు ఇక ఎటువంటి వే బిల్లులు మంజూరు చేసే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ఇప్పటికే ప్రభుత్వానికి లెసైన్స్ రద్దు చేయాలని నివేదిక పంపామని, అందుకనుగుణంగా వచ్చే ఆదేశాల మేరకు నడుచుకుంటామని ఏడీ తెలిపారు. -
అవినీతి క్వారీ!
- మట్టి తవ్వకాలకు అనుమతుల వెనుక భారీ అక్రమాలు - చేతులు మారిన కోట్ల రూపాయలు - రైతుల నోట్లో మట్టికొట్టిన వైనం మంగళగిరి: భారీ ఎత్తున సొమ్ము చేతులు మారటం వల్లే ఆత్మకూరు చెరువులో మట్టి తవ్వకాలకు అనుమతులు మంజూరయ్యాయన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ‘ప్రజాప్రయోజనాల’ ముసుగులో అధికార పార్టీ నేతలు, రెవెన్యూ అధికారులు ఈ దందా నడిపినట్టు తెలుస్తోంది. సొంత పొలంలోని మట్టిని తోలుకునేందుకు ఎవరైనా దరఖాస్తు చేస్తే సవాలక్ష ప్రశ్నలతో కాలయాపన చేసే అధికారులు ఏకంగా 72 ఎకరాల్లో తవ్వకాలకు అనుమతులివ్వటం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. ఇదీ సంగతి.. సర్వే నంబర్లు 198/అ, 199/అ 202లలో 99.90 ఎకరాల విస్తీర్ణంలో ఆత్మకూరు చెరువు ఉంది. సుమారు 30 ఏళ్ల క్రితం ఇది ఎండి పూడిపోవడంతో 10 ఎకరాల ను కుండలు తయూరు చేసుకునే సామాజికవర్గం వారు, మరో 18 ఎకరాల్లో దళితులు నివాస గృహాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. మిగిలిన 72 ఎకరాల్లో 100 మందికిపైగా రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 72 ఎకరాల్లోని మట్టిపై మాఫియా కన్ను పడింది. 2011లో ప్రారంభమైన విజయవాడ నుంచి చిలకలూరిపేట వరకు జాతీయ రహదారి విస్తరణ పనులకు మట్టి అవసరం కావటంతో ప్రజా ప్రయోజనాల పేరిట ఓ కాంట్రాక్టర్ అనుమతులు సాధించారు. అయితే స్థానిక రైతులు ఒప్పుకోకపోవడంతో పనులు సాగలేదు. దీంతో ఎకరాకు ఇంత ధర అని నిర్ణయించి రైతులను ఒప్పించడంతోపాటు గ్రామ పంచాయతీ ప్రతినిధులు, అధికారులకు నజరానాలు ఇచ్చి అనుమతులు సాధించారు. జాతీయ రహదారి విస్తరణ పనులకు మట్టి అవసరం లేదని ఎన్‌హెచ్ అధికారులు చెప్పినా దందా కొనసాగిపోరుుంది. గత డిసెంబర్ నుంచి పెద్దఎత్తున మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోతున్నారుు. ప్రతి రోజూ సుమారు 200 లారీలు, ట్రాక్టర్లలో లెక్కలేనన్నిసార్లు మట్టిని తరలిస్తున్నారు. వాహనాల వారు ఒకే వేబిల్లుతో పలుమార్లు తిరుగుతున్నారు. తద్వారా అక్రమార్కులు రూ. కోట్లు దండుకుంటున్నారు. ప్రభుత్వానికి మాత్రం నామమాత్ర ఆదాయమే లభిస్తోంది. క్వారీ యూజమాన్యం నుంచి పెద్దమొత్తంలో మామూళ్లు అందుతుండటంతో అటు అధికారులు, ఇటు పాలకులు పట్టించుకోవటం లేదు. - జిల్లా స్థాయి అధికారులు తనిఖీలు నిర్వహించినపుడు ముందురోజే స్థానిక అధికారులు కాంట్రాక్టర్‌కు సమాచారమిస్తున్నారు. దీంతో జిల్లా అధికారులు వచ్చిన రోజు మాత్రం నిబంధనల ప్రకారం తవ్వకాలు సాగిస్తున్నారు. - మంగళగిరి వద్ద జాతీయ రహదారికి అరకిలో మీటర్ దూరంలో ఎకరా రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల విలువ చేసే భూమిని అప్పనంగా క్వారీ యూజమాన్యానికి అప్పగించడం విడ్డూరంగా ఉందని స్థానికులు విమర్శిస్తున్నారు. - నూతన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన నేపథ్యంలో పలు జాతీయ సంస్థల ఏర్పాటుకు స్థలాల కోసం వెదుకుతున్న అధికారులకు ఇంత విలువైన భూమి కనిపించకపోవడం గమనార్హం. లీజు రద్దు చేయూలని నివేదించాం.. ఆత్మకూరు మట్టి క్వారీ అక్రమాలపై మైనింగ్ ఎ.డి. జగన్నాథరావును వివరణ కోరగా క్వారీ లీజును రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి నివేదిక అందజేశామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు నిర్వహించినా, వే బిల్లులు సక్రమంగా జారీ చేయకపోయినా జరిమానా విధించడంతోపాటు లీజు రద్దుకు సిఫారసు చేస్తామన్నారు. దీనిపై మంగళగిరి తహశీల్దార్ శివరామకృష్ణారావు వివరణ ఇస్తూ శాంతిభద్రతల సమస్య తలెత్తినప్పుడు భూములను పరిశీలించటమే తమ బాధ్యతని పేర్కొన్నారు. మిగిలిన అనుమతులు, పర్యవేక్షణ మైనింగ్ శాఖ ఆధీనంలోనే ఉంటాయన్నారు. క్వారీ అనుమతులు తీసుకున్నది జాతీయ రహదారి విస్తరణ పనుల కోసం మాత్రమేనన్నారు. ప్రస్తుతం జరుగుతున్న తవ్వకాలను మైనింగ్ శాఖ అధికారులే అడ్డుకోవాల్సి ఉందన్నారు.