- మట్టి తవ్వకాలకు అనుమతుల వెనుక భారీ అక్రమాలు
- చేతులు మారిన కోట్ల రూపాయలు
- రైతుల నోట్లో మట్టికొట్టిన వైనం
మంగళగిరి: భారీ ఎత్తున సొమ్ము చేతులు మారటం వల్లే ఆత్మకూరు చెరువులో మట్టి తవ్వకాలకు అనుమతులు మంజూరయ్యాయన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ‘ప్రజాప్రయోజనాల’ ముసుగులో అధికార పార్టీ నేతలు, రెవెన్యూ అధికారులు ఈ దందా నడిపినట్టు తెలుస్తోంది. సొంత పొలంలోని మట్టిని తోలుకునేందుకు ఎవరైనా దరఖాస్తు చేస్తే సవాలక్ష ప్రశ్నలతో కాలయాపన చేసే అధికారులు ఏకంగా 72 ఎకరాల్లో తవ్వకాలకు అనుమతులివ్వటం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.
ఇదీ సంగతి..
సర్వే నంబర్లు 198/అ, 199/అ 202లలో 99.90 ఎకరాల విస్తీర్ణంలో ఆత్మకూరు చెరువు ఉంది. సుమారు 30 ఏళ్ల క్రితం ఇది ఎండి పూడిపోవడంతో 10 ఎకరాల ను కుండలు తయూరు చేసుకునే సామాజికవర్గం వారు, మరో 18 ఎకరాల్లో దళితులు నివాస గృహాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. మిగిలిన 72 ఎకరాల్లో 100 మందికిపైగా రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 72 ఎకరాల్లోని మట్టిపై మాఫియా కన్ను పడింది. 2011లో ప్రారంభమైన విజయవాడ నుంచి చిలకలూరిపేట వరకు జాతీయ రహదారి విస్తరణ పనులకు మట్టి అవసరం కావటంతో ప్రజా ప్రయోజనాల పేరిట ఓ కాంట్రాక్టర్ అనుమతులు సాధించారు. అయితే స్థానిక రైతులు ఒప్పుకోకపోవడంతో పనులు సాగలేదు.
దీంతో ఎకరాకు ఇంత ధర అని నిర్ణయించి రైతులను ఒప్పించడంతోపాటు గ్రామ పంచాయతీ ప్రతినిధులు, అధికారులకు నజరానాలు ఇచ్చి అనుమతులు సాధించారు. జాతీయ రహదారి విస్తరణ పనులకు మట్టి అవసరం లేదని ఎన్‌హెచ్ అధికారులు చెప్పినా దందా కొనసాగిపోరుుంది. గత డిసెంబర్ నుంచి పెద్దఎత్తున మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోతున్నారుు. ప్రతి రోజూ సుమారు 200 లారీలు, ట్రాక్టర్లలో లెక్కలేనన్నిసార్లు మట్టిని తరలిస్తున్నారు. వాహనాల వారు ఒకే వేబిల్లుతో పలుమార్లు తిరుగుతున్నారు. తద్వారా అక్రమార్కులు రూ. కోట్లు దండుకుంటున్నారు. ప్రభుత్వానికి మాత్రం నామమాత్ర ఆదాయమే లభిస్తోంది. క్వారీ యూజమాన్యం నుంచి పెద్దమొత్తంలో మామూళ్లు అందుతుండటంతో అటు అధికారులు, ఇటు పాలకులు పట్టించుకోవటం లేదు.
- జిల్లా స్థాయి అధికారులు తనిఖీలు నిర్వహించినపుడు ముందురోజే స్థానిక అధికారులు కాంట్రాక్టర్‌కు సమాచారమిస్తున్నారు. దీంతో జిల్లా అధికారులు వచ్చిన రోజు మాత్రం నిబంధనల ప్రకారం తవ్వకాలు సాగిస్తున్నారు.
- మంగళగిరి వద్ద జాతీయ రహదారికి అరకిలో మీటర్ దూరంలో ఎకరా రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల విలువ చేసే భూమిని అప్పనంగా క్వారీ యూజమాన్యానికి అప్పగించడం విడ్డూరంగా ఉందని స్థానికులు విమర్శిస్తున్నారు.
- నూతన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన నేపథ్యంలో పలు జాతీయ సంస్థల ఏర్పాటుకు స్థలాల కోసం వెదుకుతున్న అధికారులకు ఇంత విలువైన భూమి కనిపించకపోవడం గమనార్హం.
లీజు రద్దు చేయూలని నివేదించాం..
ఆత్మకూరు మట్టి క్వారీ అక్రమాలపై మైనింగ్ ఎ.డి. జగన్నాథరావును వివరణ కోరగా క్వారీ లీజును రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి నివేదిక అందజేశామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు నిర్వహించినా, వే బిల్లులు సక్రమంగా జారీ చేయకపోయినా జరిమానా విధించడంతోపాటు లీజు రద్దుకు సిఫారసు చేస్తామన్నారు. దీనిపై మంగళగిరి తహశీల్దార్ శివరామకృష్ణారావు వివరణ ఇస్తూ శాంతిభద్రతల సమస్య తలెత్తినప్పుడు భూములను పరిశీలించటమే తమ బాధ్యతని పేర్కొన్నారు. మిగిలిన అనుమతులు, పర్యవేక్షణ మైనింగ్ శాఖ ఆధీనంలోనే ఉంటాయన్నారు. క్వారీ అనుమతులు తీసుకున్నది జాతీయ రహదారి విస్తరణ పనుల కోసం మాత్రమేనన్నారు. ప్రస్తుతం జరుగుతున్న తవ్వకాలను మైనింగ్ శాఖ అధికారులే అడ్డుకోవాల్సి ఉందన్నారు.
అవినీతి క్వారీ!
Published Tue, Aug 5 2014 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 11:22 AM
Advertisement
Advertisement