ఆయన జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా మంగళగిరి ప్రీమియర్ లీగ్ నిర్వహణ
ప్రారంభించిన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని
తమ రాజకీయ స్వప్రయోజనాల కోసం ఏసీఏ నిధులు, వనరులు దుర్వినియోగం!
సాక్షి, అమరావతి: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) గురించి అందరికీ తెలుసు.. మరి మంగళగిరి ప్రీమియర్ లీగ్(ఎంపీఎల్) గురించి మీకు తెలుసా? సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) ప్రత్యేక ఆసక్తితో నిర్వహిస్తున్న లీగ్ ఇది. తన స్వామి భక్తిని చాటుకునేందుకు ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) ఈ లీగ్‌కు రూపకల్పన చేశారు. ఈ నెల 23న లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా 22 మ్యాచ్‌లతో ఈ లీగ్‌ను నిర్వహిస్తున్నారు. మంగళగిరిలోని ఏసీఏ స్టేడియంలో ఆదివారం కేశినేని చిన్ని దీనిని ప్రారంభించారు. 22వ తేదీ వరకు లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయని.. 23న ఫైనల్స్ నిర్వహించి విజేతకు అవార్డు ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఏసీఏ నిధులు దుర్వినియోగం!
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఏసీఏను లోకేశ్ కోటరీ తమ గుప్పెట్లోకి తీసుకుంది. కేశినేని చిన్నిని అధ్యక్షుడిగా, తన సన్నిహితుడు, లాబీయిస్టు అయిన సానా సతీశ్‌ను ప్రధాన కార్యదర్శి పీఠంపై కూర్చోబెట్టారు లోకేశ్. అప్పటి నుంచి కేశినేని చిన్ని, సానా సతీశ్ క్రికెట్ ప్రయోజనాలను పక్కనపెట్టి.. లోకేశ్ కోసమే ఏసీఏను ఉపయోగిస్తున్నారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం కోసం ఏకంగా ప్రీమియర్ లీగ్ నిర్వహించడమే ఇందుకు నిదర్శనం. బీసీసీఐ మార్గదర్శకాల ప్రకారం గవర్నింగ్ బాడీ సమావేశంలో షెడ్యూల్‌ను రూపొందించి లీగ్‌లు నిర్వహిస్తుంటారు. కానీ కేశినేని చిన్ని అవేమీ చేయకుండా.. ఎవరినీ సంప్రదించకుండానే ఈ లీగ్‌ను ప్రకటించారు. ఏసీఏ నిధులు, వనరులను పూర్తిస్థాయిలో ఉపయోగిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో లోకేశ్ ఫొటోలతో భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. వీటన్నింటికీ ఏసీఏ నిధులు ఉపయోగిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒక్క నియోజకవర్గమే ముఖ్యమా?
వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు, క్రీడాకారులకు చేయూత అందించేందుకు ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో పోటీలు నిర్వహిస్తే కూటమి నేతలు అవాకులు, చెవాకులు పేలారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, దాదాపు అన్ని క్రీడలతో ‘ఆడుదాం ఆంధ్రా’ నిర్వహిస్తే విమర్శలు చేసిన కూటమి నేతలు.. ఇప్పుడు కేవలం సీఎం తనయుడి కోసం ఆయన నియోజకవర్గంలో మాత్రమే లీగ్ పెట్టడం, దానికి ఏసీఏను ఉపయోగించుకోవడం గమనార్హం. రాష్ట్రమంతటికీ ప్రాతినిధ్యం వహించి పనిచేయాల్సిన ఏసీఏ.. కేవలం ఒక నియోజకవర్గంలో ఒక నేత కోసమే పని చేయడమేమిటని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment