ఇంకా 448 బోధనేతర సిబ్బంది కొరత
దేశవ్యాప్తంగా ఎయిమ్స్‌లలో 24 శాతం నుంచి 39 శాతం అధ్యాపక పోస్టులు ఖాళీ
పార్లమెంట్‌లో వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఎయిమ్స్‌లలో బోధనా సిబ్బంది పోస్టుల్లో భారీగా ఖాళీలున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో పూర్తి స్థాయిలో పనిచేస్తున్న ఏడు ఎయిమ్స్‌లలో అధ్యాపక ఖాళీలు 24 శాతం నుంచి 39 శాతం వరకు ఉన్నాయని పార్లమెంట్‌లో ఆరోగ్య శాఖ సమాధానమిచ్చింది. పన్నెండు నగరాల్లో పాక్షికంగా పనిచేస్తున్న ఎయిమ్స్‌లు సైతం ఈ కొరతను ఎదుర్కొంటున్నాయి.
ప్రధానంగా ఢిల్లీ ఎయిమ్స్‌లో 1,235 బోధనా సిబ్బందికి గాను కేవలం 810 మాత్రమే ఉండగా, 425 ఖాళీలు(34శాతం) ఉన్నాయని, నాన్ ఫ్యాకల్టీ విభాగంలో 14,343 సిబ్బందికి గాను 12,101 మంది పనిచేస్తుండగా, మరో 2,242 ఖాళీలున్నాయని వెల్లడించింది. ఇదే మాదిరి భోపాల్‌లో 24శాతం, భువనేశ్వర్‌లో 25శాతం, జో«ద్‌పూర్‌లో 28, రాయ్‌పూర్‌లో 38, పాట్నాలో 27, రిషికేశ్‌లో 39శాతం ఖాళీలున్నాయంది.
ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పాక్షికంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ మంగళగిరి ఎయిమ్స్‌లో 259 మంది బోధనా సిబ్బందికి గాను కేవలం 152 మందే ఉండగా.. మరో 107 ఖాళీలు(41శాతం) ఉన్నాయని తెలిపింది. ఇక 1,469 మంది బోధనేతర సిబ్బందిలో 1,021 మంది పనిచేస్తుండగా 448 పోస్టులు ఖాళీలుగా పేర్కొంది.
తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్‌లోనూ 183 మంది బోధనా సిబ్బందికి గాను 118 మంది(36శాతం) మంది పనిచేస్తుండగా, 65 పోస్టుల్లో సిబ్బంది లేరని తెలిపింది. ఇక బోధనేతర సిబ్బందిలోనూ 1,374 మందిలో 898 మంది ఉండగా.. 476 ఖాళీలున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment