మంగళగిరి జనసేన కార్యాలయం వద్ద రోజంతా పడిగాపులు
నాడు ప్రతిపక్షంలో ఉండగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన పవన్
అధికారంలోకి వచ్చి ఎనిమిది మాసాలు గడిచినా పట్టించుకోని వైనం
పరిహారం చెల్లించకుండా దౌర్జన్యంగా భూములు స్వాధీనం
సాక్షి ప్రతినిధి, విజయవాడ/హనుమాన్‌జంక్షన్ రూరల్: గోడు వినలేదు.. కనికరం చూపలేదు.. కనీసం కలిసేందుకు అవకాశం ఇవ్వలేదు. నాడు హామీ ఇచ్చారు కదా.. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా.. అని ఆశతో వస్తే.. ముఖం చాటేశారు. రోజంతా ఎదురుచూసినా ఫలితం దక్కలేదు. ఇక చేసేది లేక నిరాశతో వెనుదిరిగారు. ఇదీ మంగళవారం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం వద్ద డెప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను కలిసేందుకు వచ్చిన మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడ నిర్వాసితుల పరిస్థితి. 2019 ఎన్నికల ముందు స్వయంగా మల్లవల్లి వచ్చి భూ నిర్వాసితుల ఆందోళనకు మద్దతు తెలపటంతో పాటుగా, అధికారంలోకి రాగానే బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన పనన్ కల్యాణ్ ఇప్పుడూ ముఖం చాటేయటంతో ఉసూరుమంటూ వెనుదిరిగారు.
అసలు విషయం ఏమిటంటే..
2016లో పారిశ్రామికవాడ ఏర్పాటుకు మల్లవల్లిలోని రీ సర్వే నంబర్–11లో 1360 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించారు. అప్పటికే ఆ భూములను సాగు చేస్తున్న రైతులను గుర్తించేందుకు జియోకాన్ అనే సంస్థతో ఎంజాయ్‌మెంట్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో 623 మంది సాగుదారులు ఉన్నట్లు నివేదిక ఇవ్వగా, ఆ తర్వాత రెవెన్యూ అధికారులు 716.44 ఎకరాల్లో 490 మంది సాగుదారులు ఉన్నట్లుగా తుది జాబితాను ప్రకటించారు.
కానీ వివిధ కారణాలతో చివరికి 443 మంది రైతులకు గానూ 615.6 ఎకరాలకు మాత్రమే రూ.7.50 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని పంపిణీ చేశారు. దీంతో పరిహారం దక్కని సాగుదారులు ఎనిమిదేళ్లుగా ప్రజాప్రతినిధులు, అధికారుల చూట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సాగుదారుల లెక్క తేల్చే విషయంలో రెవెన్యూ అధికారులపై నాటి టీడీపీ నాయకుల ఒత్తిడితోనే పలువురి పేర్లు తుది జాబితాలో గల్లంతయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో గుడివాడ ఆర్డీఓ కార్యాలయంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయగా, 217 మంది సాగుదారులు 713 ఎకరాలకు నష్టపరిహారం దక్కలేదని అర్జీలు దాఖలు చేశారు.
పవన్‌కల్యాణ్, లోకేష్ హడావుడి హామీలు..
నష్టపరిహారం అందని సాగుదారులు పలు దఫాలుగా ఆందోళనలు చేపట్టారు. ఏపీఐఐసీ ఇప్పటికే పరిశ్రమలకు భూకేటాయింపులు చేయటంతో ఆ సంస్థలు చేపట్టిన నిర్మాణాలను సాగుదారులు అడ్డుకుంటూ నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే గత ఏడాది ఆగస్ట్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మల్లవల్లి పారిశ్రామికవాడలో పర్యటించారు. నష్టపరిహారం అందని సాగుదారులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
యువగళం పాదయాత్రలో నారా లోకేష్ మల్లవల్లి గ్రామానికి వచ్చినప్పుడు బాధితులు తమ గోడును విన్నవించగా న్యాయం చేస్తానని హామీనిచ్చారు. ఈ హామీలను నమ్మిన భూనిర్వాసితులు ఇప్పుడు నెత్తికొట్టుకుంటున్నారు. పవన్ కల్యాణ్‌ను కలిసి తమ కష్టాన్ని చెప్పుకునేందుకు వెళ్తే కనీసం దర్శనభాగ్యం కలగలేదంటూ వాపోతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లవల్లి భూనిర్వాసితుల ఊసే పవన్ కల్యాణ్, నారా లోకేష్‌కు పట్టలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజా పరిణామాలు ఇవి..
బాపులపాడు మండలం మల్లవల్లిలోని ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో పరిహారం దక్కని రైతుల స్వాధీనంలో ఉన్న భూములను బలవంతంగా లాక్కునేందుకు కూటమి ప్రభుత్వం దౌర్జన్యకాండకు దిగింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈ నెల మూడో తేదీ నుంచి నాలుగురోజుల పాటు గ్రామాన్ని అదుపులోకి తీసుకుంది. భూనిర్వాసితులను గృహ నిర్బంధం చేసి, వారి భూములను దౌర్జన్యంగా స్వాధీనం చేసుకుంటోంది. పారిశ్రామికవాడలోకి ఇతరులను ఎవ్వరిని అనుమతించకుండా బారికేడ్లు ఏర్పాటు చేసింది. ఎనిమిదేళ్లుగా పరిహారం కోసం కళ్లు కాయలు కాసేటట్లు ఎదురుచూస్తున్న సాగుదారులను నిర్ధాక్షిణ్యంగా ఇళ్లలో బంధించి, వారి భూములను బలవంతంగా లాక్కొంటున్న కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది.
పవన్‌కల్యాణ్, లోకేష్ హడావుడి హామీలు..
నష్టపరిహారం అందని సాగుదారులు పలు దఫాలుగా ఆందోళనలు చేపట్టారు. ఏపీఐఐసీ ఇప్పటికే పరిశ్రమలకు భూకేటాయింపులు చేయటంతో ఆ సంస్థలు చేపట్టిన నిర్మాణాలను సాగుదారులు అడ్డుకుంటూ నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే గత ఏడాది ఆగస్ట్‌లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మల్లవల్లి పారిశ్రామికవాడలో పర్యటించారు. నష్టపరిహారం అందని సాగుదారులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ మల్లవల్లి గ్రామానికి వచ్చినప్పుడు బాధితులు తమ గోడును విన్నవించగా న్యాయం చేస్తానని హామీనిచ్చారు. ఈ హామీలను నమ్మిన భూనిర్వాసితులు ఇప్పుడు నెత్తికొట్టుకుంటున్నారు. పవన్ కల్యాణ్‌ను కలిసి తమ కష్టాన్ని చెప్పుకునేందుకు వెళ్తే కనీసం దర్శనభాగ్యం కలగలేదంటూ వాపోతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లవల్లి భూనిర్వాసితుల ఊసే పవన్‌కల్యాణ్, నారా లోకేష్ కు పట్టలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లాక్కోవటం తగదు..
మల్లవల్లి పారిశ్రామికవాడ భూముల్లో సుమారు 150 మందికిపైగా నష్టపరిహారం అందలేదు. దీనిపై ఎనిమిదేళ్లుగా పలు రకాలుగా ఆందోళనలు, పోరాటాలు చేశాం. ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ కూడా వచ్చి న్యాయం చేస్తామని మాట ఇచ్చారు. కానీ ఇప్పుడు నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా పోలీసు బలగాన్ని అడ్డుపెట్టుకుని బలవంతంగా భూములు లాక్కోవటం సబబు కాదు.
– చిన్నాల వరప్రసాద్, భూ నిర్వాసితుల ఉద్యమ నేత, మల్లవల్లి
కోర్టు ఆదేశాలు ఉన్నా బేఖాతరు..
మల్లవల్లిలోని ఆర్‌ఎస్ నంబర్ 11లో మా కుటుంబానికి 15 ఎకరాల భూమి ఉంది. దశాబ్దాలుగా ఆ భూమిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. కానీ పారిశ్రామికవాడకు భూసేకరణ జరిగినప్పుడు మాకు నష్టపరిహారం ఇవ్వలేదు. ఈ భూమిపై గతంలోనే కోర్టు ద్వారా పరి్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది. అయినప్పటికీ రెవెన్యూ, ఏపీఐఐసీ అధికారులు భూములు స్వా«దీనం చేసుకుంటున్నారు.
– బొకినాల సాంబశివరావు, నిర్వాసితుడు, మల్లవల్లి
అలసిపోయాను..
చెట్లు, ముళ్ల పోదలతో అడవిలా ఉన్న భూమిని మా కుటుంబం అంతా కలిసి నానా కష్టాలు పడి చదును చేసుకున్నాం. ఆ భూమిలోనే పంటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తరుణంలో టీడీపీ ప్రభుత్వం పారిశ్రామికవాడ ఏర్పాటు చేస్తామని భూములు లాక్కొది. కానీ ఒక్క రూపాయి కూడా పరిహారం చెల్లించలేదు. ఎన్నో సార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి అలసిపోయాను. ఆ మనోవేదనతో ఆరోగ్యం బాగా క్షీణించింది.
– పంతం కామరాజు, నిర్వాసితుడు, మల్లవల్లి
Comments
Please login to add a commentAdd a comment