దోపిడే దోపిడీ
తూప్రాన్ : మండలంలో మట్టి అక్రమ దందా జోరుగా సాగుతోంది. సీఎం ఇలాకాలోనే యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్నా అడిగే వారే లేకుండా పోయారు. మండలంలోని కూచారం, ముప్పిరెడ్డిపల్లి గ్రామాల్లో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. కూచారం రైల్వే స్టేషన్ సమీపంలోని చెరువు నుంచి, కాళ్లకల్ గ్రామ సమీపంలోని కొండాపూర్ గ్రామంలో తవ్వకాలు జరుపుతూ పరిశ్రమలకు మట్టిని విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు.
పట్టపగలే తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. రెవెన్యూ అధికారుల అండదండలు ఉండడంతోనే అక్రమార్కులు రెచ్చిపోతున్నట్టు తెలుస్తోంది. పత్రికల్లో వరుస కథనాలు ప్రచురితమవుతున్నా అధికారులు స్పందించకపోవడంపై జనం భగ్గుమంటున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు స్పందించి అక్రమార్కులకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.
చర్యలు తప్పవు
వాల్టా చట్టానికి వ్యతిరేకంగా మట్టిని తరలిస్తే చర్యలు తప్పవు. ప్రభుత్వ అనుమతులు పొందిన తర్వాతే తవ్వకాలు జరపాలి. అక్రమంగా మట్టి తరలిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. తమ సిబ్బందిని సంఘటన స్థలానికి పంపి వాహనాలు సీజ్ చేస్తాం.
- ముత్యంరెడ్డి, సిద్దిపేట ఆర్డీఓ
అనుమతులు తప్పనిసరి..
చెరువులు, కుంటల్లో అనుమతులు లేకుండా తవ్వకాలు జరిపితే చర్యలు తప్పవు. వాల్టా నిబంధనల ప్రకారం అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం. అక్రమంగా మట్టిని తరలిస్తే ఎంతటివారైన ఉపేక్షించే ది లేదు.
- శ్రీకాంత్, ఇరిగేషన్ ఏఈ