యథేచ్ఛగా మట్టి తవ్వకాలు చేపట్టి సొమ్ము చేసుకున్న కూటమి నేతలు
కృష్ణా నది గట్టుకు గండి పడి గ్రామాలను ముంచెత్తిన వరద
ముంపులో బాపట్ల జిల్లాలోని 27 లంక గ్రామాలు
వేలాది ఎకరాల వాణిజ్య పంటల మునక జనజీవనం అతలాకుతలం
భట్టిప్రోలు మండలం పెదపులివర్రు వద్ద కరకట్టపైకి నీరు
ఏ క్షణమైనా కరకట్టకు గండిపడే ప్రమాదం
ఇదే జరిగితే జలదిగ్బంధంలో చిక్కుకోనున్న రేపల్లె
సాక్షి ప్రతినిధి, బాపట్ల: కూటమి నేతల అక్రమార్జన బాపట్ల జిల్లాలో 27 లంక గ్రామాల ప్రజలకు తీరని కష్టాలు తెచి్చపెట్టింది. తమ జేబులు నింపుకునేందుకు టీడీపీ, జనసేన పార్టీ నేతలు యథేచ్ఛగా కృష్ణానది సమీపంలో అక్రమంగా ఇసుక, మట్టి తవ్వకాలు చేపట్టడం కొంపముంచింది. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం పెసర్లంక అరవింద వారధి సమీపంలో కూటమి నేతల అక్రమ ఇసుక, మట్టి తవ్వకాల వల్ల కృష్ణానది గట్టు వరదకు ముందే బలహీనపడింది. గత రెండు రోజులుగా వరద పెరిగి సోమవారం సాయంత్రానికి దాదాపు 12 లక్షల క్యూసెక్కులకు చేరడంతో అరవింద వారధి సమీపంలో కృష్ణానదికి గండి పడింది.
దీంతో కొల్లూరు మండలంలోని పెసర్లంక, చిలుమూరులంక, సుగ్గునలంక, ఈపూరులంక, చింతర్లంక, పెదలంక, ఆవులవారిపాలెం, గాజుల్లంక, పోతార్లంక, తిప్పలకట్ట, కిష్కింధపాలెం, తడికలపూడి, జువ్వలపాలెం తదితర 22 గ్రామాలతోపాటు భట్టిప్రోలు మండలంలోని చింతమోటు, పెదలంక, పెసర్లంక, పల్లెపాలెం, రేపల్లె మండలంలోని పెనుమూడి పల్లెపాలెం కలిపి మొత్తం 27 గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. ఈ గ్రామాల్లో 60 శాతం ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి. మరో 30 శాతం ఇళ్లల్లోకి నీరు చేరింది. ఈ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులపైన వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆయా గ్రామాల్లో ప్రజలు డాబాలపైకి ఎక్కారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
40 శాతం మందికి కూడా చేరని ఆహారం..
లంక గ్రామాలను ముంచెత్తిన వరదనీరు జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. బోట్ల ద్వారా ప్రభుత్వ యంత్రాంగం పంపుతున్న తాగునీరు, ఆహారం పట్టుమని 40 శాతం మందికి కూడా అందలేదు. డాబాలపైన వంట చేసుకుందామన్నా మంచినీరు అందుబాటులో లేదు. వరదలో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సరిపడా బోట్లు లేక అధికారులు మిన్నకుండి పోయారు. ఉన్నవారిని కూడా బయటకు తీసుకురాలేని దుస్థితి నెలకొంది. ఇక చాలా పశువులు నీటిలో కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు ఒక్క చిలుమూరు లంక నుంచి మాత్రమే కొద్దిమంది గ్రామస్తులను పునరావాస కేంద్రానికి తరలించారు. వరద ప్రాంతాలకు స్థానిక పోలీసులతోపాటు జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్) బృందాలు చేరుకున్నాయి. జిల్లా కలెక్టర్ వెంకట మురళి, ఎస్పీ తుషార్ డూడిలు కొల్లూరులోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
రైతులకు భారీ దెబ్బ..
కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాలైన కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లోని లంక గ్రామాల్లో భారీ ఎత్తున పసుపు, అరటి, మొక్కజొన్న, కంద, తమలపాకులు, బొప్పాయి, జామ, కొబ్బరి, కూరగాయలు తదితర వాణిజ్య, ఉద్యాన పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఇప్పుడు వరదకు ఈ రెండు మండలాల్లోని వేలాది ఎకరాల పంటలు నీటమునిగాయి. వాణిజ్య పంటలు రోజుల తరబడి నీటిలో నానడంతో పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. దీంతో తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
రేపల్లె పట్టణానికి పొంచి ఉన్న ప్రమాదం..
వరద ఉధృతికి భట్టిప్రోలు మండలం పెదపులివర్రు వద్ద కృష్ణా కరకట్టపైకి నీరు చేరుతోంది. దీంతో అధికారులు, గ్రామస్తులు అప్రమత్తమై మట్టి, ఇసుక సంచులు వేసి కట్టకు గండిపడకుండా ప్రయత్నిస్తున్నారు. రావి అనంతవరం గ్రామం వద్ద కరకట్ట నుంచి నీరు లీకు అవుతుండటంతో అధికారులు చర్యలు చేపట్టారు. వరద మరింత పెరిగితే ఆయా ప్రాంతాల్లో కరకట్టకు గండి పడే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే వరద ఉధృతికి భట్టిప్రోలు, రేపల్లె పట్టణం నీట మునగొచ్చని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎక్కడా కనిపించకపోవడంపై తీవ్రవిమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మట్టి అక్రమ తవ్వకాలే గండికి కారణం
కృష్ణా నదికి తొలిరోజు ఆదివారం 8.79 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో పెసర్లంక సమీపంలోని అరవింద వారధి వద్ద కృష్ణానది గట్టుకు భారీ గండి పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ, జనసేన నేతలు నదికి ఇరువైపులా పెద్ద ఎత్తున అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపారు. దీంతో నది గట్లు, కరకట్ట రోజురోజుకు బలహీనపడుతూ వచ్చాయి. కరకట్ట దెబ్బతినకుండా చూడాల్సిన కృష్ణా నది పరిరక్షణ విభాగం ఏమాత్రం పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. అక్రమ తవ్వకాలు అడ్డుకుని.. దెబ్బతిన్న కట్టను బలోపేతం చేయాల్సి ఉన్నా ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో కృష్ణానది ఒడ్డు కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె ప్రాంతాల్లో మరింత బలహీనంగా మారింది. చాలా చోట్ల పూర్తిగా దెబ్బతింది. ఇలాగే 2009 అక్టోబర్ 6న కరకట్ట తెగిపోయి రేపల్లె పట్టణం నీటిలో మునిగింది. అప్పట్లో 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరదనీరు వచి్చంది. ప్రస్తుతం కేవలం 8.79 లక్షల క్యూసెక్కుల వరదకే అరవింద వారధి వద్ద మరోమారు గండిపడింది. ఇప్పటికైనా కృష్ణా కరకట్టలో అక్రమ మట్టి తవ్వకాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment