అధికార పార్టీ ఆగడాలకు అధికారులు తలొగ్గారు. కళ్లెదుటే అక్రమాలు జరుగుతున్నా ఏమీ కానట్టు వెనుదిరిగారు. రెడ్‌హ్యాండెడ్‌గా గ్రామస్తులు, వైఎస్సార్‌సీపీ నేతలు పట్టిచ్చినా... ఏవో హడావుడి చేసి చల్లగా జారుకున్నారు. అక్రమానికి అధికారులు వంతపాడటంతో ఇక యథేచ్ఛగా చెరువులో మట్టితవ్వకాలు జరిపేసి తరలించేశారు.
అన్నంరాజుపేట (జామి): మండలంలో అన్నంరాజుపేట గ్రామంలో పద్మనాభరాజు చెరువులోని మట్టిని అక్రమంగా స్థానిక అధికారపార్టీకి చెందిన నేత, నీటిసంఘం అధ్యక్షుడు వారం రోజులుగా జేసీబీలతో తవ్వేస్తున్నారు. దానిని స్థానిక రైల్వేమూడోలైన్‌కోసం కోరుకొండవద్దకు, ఇటుకబట్టీ వ్యాపారులకోసం తరలించేస్తున్నారు. ఇష్టానుసారం మట్టి తవ్వేస్తుండటంతో చెరువులో ఎక్కడికక్కడ పెద్దపెద్దగోతులు ఏర్పడి ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలోని రైతులు,తదితరులు స్థానిక వైఎస్సార్‌సీపీ నేతల దృష్టికి తీసుకెళ్లడంతో మంగళవారం అర్ధరాత్రి సమయంలో దాడులు చేపట్టి, అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఏడు లారీలను అడ్డుకున్నారు. జేసీబీకి కూడా అడ్డుకుని తవ్వకాలు నిలుపుదల చేశారు. బుధవారం ఉదయం వరకూ కాపలా ఉండి రెవెన్యూ, మైనింగ్, మైనింగ్ విజిలెన్స్, పోలీస్, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
బుధవారం మైనింగ్ విజిలెన్స్ అధికారి సునీల్‌బాబు తదితర సిబ్బంది, జామిపోలీసులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పైడిరాజు సంఘటన స్థలానికి వచ్చి జరిగిన తవ్వకాలపై ఆరాతీశారు. హడావుడిగా మట్టితవ్వినచోట కొలతలు కొలిచారు. లారీనంబర్లును రాసుకున్నారు. రెవెన్యూ అధికారులు పంచనామా కూడ చేశారు. తరువాత అధికార పార్టీనేతల ఒత్తిడితో అధికారులంతా చల్లగా జారుకున్నారు. దీంతో గ్రామస్తులు నివ్వెరపోయారు. తమకు ఎలాంటి సంబంధం లేదంటూ ఒక్కొక్కరు తప్పించుకున్నారు.
అధికారులు తొత్తులుగా మారారు: వైఎస్‌ఆర్‌సీపీ నేతలు:
అధికారులు పాలక పార్టీనేతలకు తొత్తులుగా మారారని, చెరువులో గోతులు పెట్టడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని వాపోయారు. అధికారపార్టీ నేతలు మట్టిని అమ్మకాలుచేసుకుంటున్న విషయం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నా అధికారులు తమకేం సంబంధం లేదంటూ వెనుదిగడం దారుణమన్నారు. ఈ తవ్వకాలను నీరు-చెట్టు పథకంలో పెడితే న్యాయపోరాటం చేస్తామని వైఎసార్‌సీపీ నేతలు ముకుందశ్రీను, చెల్లూరి సూర్యనారాయణ, కంటుభుక్త రాము, తదితరులు తెలిపారు.
చెరువు అభివృద్ధికే మట్టి తరలింపు
చెరువును అభివృద్ధి చేయాలనే అందులోని మట్టిని తీసివేయడానికి అంగీకరించామని దేశంపార్టీ నేత జె.ఏ.చానల్ నీటిసంఘం అధ్యక్షుడు ఎన్నింటి అప్పలరాజు, అతని అనుచరులు, రైతులు తెలిపారు. ప్రభుత్వమే చెరువు పనుల్ని జేసీబీతో చేయిస్తుంటే తాము చేయడంలో తప్పేంటని ఎదురు ప్రశ్న వేశారు.
అధికారానికి తలొగ్గారు!
Published Wed, Jun 1 2016 11:59 PM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM
Advertisement