లోతుకి మించి తవ్విన గ్రావెల్ కుంటలు
సాక్షి, ప్రకాశం : అక్రమార్కుల ఆగడాలకు ఏ ఒక్కటీ మినహాయింపు కాదు అన్నట్లు తయారైంది. కాంట్రాక్టర్లు అనుమతులకు మించి మట్టి తవ్వకాలు సాగిస్తూ ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీకి గండికొడుతున్నారు. నాగులుప్పలపాడు మండల పరిధిలో 3వ రైల్వే లైన్ నిర్మాణ పనుల అంచనాల్లో మట్టి, ఇసుక, ఎర్ర గ్రావెల్ తరలించేందుకు మైనింగ్ శాఖకు రాయల్టీ చెల్లించి సంబంధిత అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంది. అయితే అనుమతి గోరంత, తవ్వుకునేది కొండంత అన్నట్లు ఉంది కాంట్రాక్టర్ల వాలకం. మైనింగ్ శాఖ నుంచి అమ్మనబ్రోలు రెవెన్యూ పరిధిలో అనుమతులు తీసుకొన్న కాంట్రాక్టర్ రాపర్ల రెవెన్యూ పరిధిలోని చవటపాలెం, రాపర్ల గ్రామాల్లో చాలా మేరకు అనధికారికంగా ఈ తవ్వకాలు చేపట్టారు.
రైల్వే పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ గుట్టు చప్పుడు కాకుండా రాత్రి సమయాల్లో పొక్లెయిన్ల సాయంతో మట్టి, ఎర్ర గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తూ, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండికొడుతున్నాడు. ఈ తంతు కొన్ని రోజులుగా జరుగుతున్నా అధికారులెవ్వరూ ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. అక్రమ తవ్వకాల విషయం కలెక్టర్ దృష్టికి రావడంతో సంబంధిత అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికీ ఎవ్వరూ స్పందించకపోవడం, అధికారులు మామూళ్లు పుచ్చుకొనే ఆ వైపు వెళ్లడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.
ఇదీ వాస్తవం..
గ్రామ సరిహద్దులోని ప్రాంతాల్లో అయితే 3 క్యూబిక్ మీటర్ల లోతుకి మించి తవ్వకాలు చేపట్టడానికి వీలులేదు. అయితే అనుకున్నదే తడవుగా సదరు కాంట్రాక్టర్ సుమారు 8 క్యూబిక్ మీటర్ల లోతున తవ్వకాలు చేపట్టారు. దీంతో మట్టి తీసిన చెరువులో భూగర్భ జలాలు కూడా బయట పడ్డాయి. భవిష్యత్‌లో ఈ కుంటల వలన చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. దీంతో పాటు మట్టి తవ్వకం చేపట్టిన పొలాలకు దగ్గర్లోని రైతులు తమ పొలాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాసుల కోసమే కక్కుర్తి..
గుంటూరు నుంచి నెల్లూరు జిల్లా వరకు రైల్వే 3వ లైన్ పనులు జిల్లాలో వేగంగా జరుగుతున్నాయి. ఈ పనులకు కొంత మేరకు అనుమతులు తీసుకొని రాపర్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 112, 114 లో కూడా ప్రభుత్వానికి సీనరేజి చెల్లించకుండా కాంట్రాక్టర్ రాత్రి సమయంలో గ్రావెల్, మట్టిని తరలిస్తున్నారు. మండలంలోని అమ్మనబ్రోలు, చవటపాలెం గ్రామాల్లో అక్రమ తవ్వకాలు జరుపుతుండటంతో అక్కడ నివశిస్తున్న గృహ యజమానులు, పశు పోషకులు ఆందోళన చెందుతున్నారు. అధికారికంగా తవ్వకాలు జరిపితే మైనింగ్ శాఖకు చెల్లించే రాయల్టీలో కొంత గ్రామ పంచాయతీకి జమ చేస్తారు.
ఈ అక్రమ తవ్వకాలకు అనుమతులు లేకుండా జరుగుతుంటే ఆ ప్రాంత ప్రజా ప్రతిని«ధులు, అధికారులు కన్నెత్తి చూడకపోవడం విశేషం. ఈ విషయంపై మైనింగ్ అధికారులను వివరణ కోరగా రైల్వే కాంట్రాక్టర్ కొద్ది మేర అనుమతులు తీసుకొని స్థాయి దాటి తవ్వకాలు చేస్తుంటే విజిలెన్స్ అధికారులతో విచారణ చేసి గట్టి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment